Hyderabad Metro: ప్రయాణికులకు షాక్ ఇచ్చిన హైదరాబాద్ మెట్రో..ఆ ఛార్జీల మోత..
రాత్రికిరాత్రి ఛార్జీలు పెట్టడం ఏంటని అంటూ మెట్రో నిర్వహకులపై విరుచుకుపడ్డారు. ఎల్ అండ్ టీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఇకపై నాగోల్ మెట్రో స్టేషన్ వద్ద వాహనాలు పార్కింగ్ చేయాలంటే డబ్బులు చెల్లించాల్సిందే. బైకును మినిమం 2 గంటల వరకు పార్క్ చేస్తే రూ.10 చెల్లించాల్సి ఉంటుంది. 8 గంటల వరకు పార్కింగ్ చేస్తే రూ.25, 12 గంటల వరకు...
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు షాక్ ఇచ్చింది. మెట్రో స్టేషన్‌లో ఉన్న ఉచిత పార్కింగ్‌ను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. మొన్నటి వరకు నాగోల్ మెట్రో స్టేషన్‌లో అందుబాటులో ఉన్న ఉచితి పార్కింగ్‌ను తొలగిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం వరకు ఉచితంగా ఉన్న పార్కింగ్ స్థానంలో పార్కింగ్ ఛార్జీలకు సంబంధించిన వివరాలను తెలియజేస్తూ బోర్డును ఏర్పాటు చేశారు. దీంతో ఇది చూసిన ప్రయాణికులు ఒక్కసారిగా కంగుతిన్నారు.
రాత్రికిరాత్రి ఛార్జీలు పెట్టడం ఏంటని అంటూ మెట్రో నిర్వహకులపై విరుచుకుపడ్డారు. ఎల్ అండ్ టీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఇకపై నాగోల్ మెట్రో స్టేషన్ వద్ద వాహనాలు పార్కింగ్ చేయాలంటే డబ్బులు చెల్లించాల్సిందే. బైకును మినిమం 2 గంటల వరకు పార్క్ చేస్తే రూ.10 చెల్లించాల్సి ఉంటుంది. 8 గంటల వరకు పార్కింగ్ చేస్తే రూ.25, 12 గంటల వరకు రూ.40 కట్టాలి. అలాగే కార్లకు మినిమం 2 గంటల వరకు పార్క్ చేస్తే రూ.30 చెల్లించాలి. అదే 8 గంటల వరకు రూ.75, 12 గంటల వరకు అయితే రూ.120 చొప్పున ధరలను నిర్ణయించారు. ఈ ధరలను పేర్కొంటూ బోర్డును ఏర్పాటు చేశారు.
ఇదిలా ఉంటే దీనిపై ఎల్‌అండ్‌టీ అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేసింది. నాగోల్ మెట్రో స్టేషన్‌లో ఆగస్టు 25వ తేదీ నుంచి, మియాపూర్ స్టేషన్‌లో సెప్టెంబర్ 1వ తేదీ నంఉచి పార్కింగ్ ఫీజులను వసూలు చేయనున్నట్లు ప్రకటించింది. వివిధ సిస్టమ్స్ పనితీరును, సమర్ధతను పరీక్షించేందుకు పైలట్ ప్రాతిపదికన నాగోల్ పార్కింగ్ ఫెసిలిటీలో మంగళవారం ట్రయల్స్ నిర్వహించినట్లు పేర్కొన్నారు. టూ వీలర్, ఫోర్ వీలర్ వాహనాలకు మధ్య స్పష్టమైన హద్దులు ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. అలాగే వాహనదారుల కోసం బయో-టాయ్‌లెట్లు, మెరుగైన భద్రత కోసం 24/7 సీసీటీవీ నిఘా ఉంటుందని పేర్కొన్నారు. ఇక పార్కింగ్ ఫీజు చెల్లింపుల కోసం యాప్‌ను కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు.
క్యూఆర్ కోడ్ సహాయంతో చెల్లింపులు చేసేలా వ్యవస్థ తీసుకురానున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. రాత్రి పూట మెరుగైన విజిబులిటీ కోసం మంచి లైటింగ్ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మెరుగైన పార్కింగ్ అనుభవాన్ని ప్రయాణికులకు అందించేందుకే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎల్ అండ్ టీ అధికారులు చెబుతున్నారు. కానీ ప్రయాణికులు మాత్రం ఇది తమకు కచ్చితంగా భారంగా మారుతుందని వాపోతున్నారు.
మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..