Jubilee Hills Bypoll: మామూలు ట్విస్ట్ కాదుగా.. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి అతనేనా..?
గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల విషయంలో ట్విస్ట్ ఇచ్చింది..కాంగ్రెస్ పార్టీ. ఎమ్మెల్సీ రేసు నుంచి అనూహ్యంగా మీర్ అమీర్ అలీఖాన్‌ను తప్పించిన హస్తం పార్టీ..ఉహించని విధంగా ఆ స్థానంలో వెటరన్ క్రికెటర్, మాజీ ఎంపీ మహ్మద్ అజారుద్దీన్‌ను ఎంపిక చేసింది. దీంతో ఒక్కసారిగా ఆసక్తికరమైన చర్చ మొదలయింది.

గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల విషయంలో ట్విస్ట్ ఇచ్చింది..కాంగ్రెస్ పార్టీ. ఎమ్మెల్సీ రేసు నుంచి అనూహ్యంగా మీర్ అమీర్ అలీఖాన్‌ను తప్పించిన హస్తం పార్టీ..ఉహించని విధంగా ఆ స్థానంలో వెటరన్ క్రికెటర్, మాజీ ఎంపీ మహ్మద్ అజారుద్దీన్‌ను ఎంపిక చేసింది. దీంతో ఒక్కసారిగా ఆసక్తికరమైన చర్చ మొదలయింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తానే కాంగ్రెస్ అభ్యర్థినంటూ మాజీ ఎంపీ అజారుద్దీన్ ప్రకటించుకున్నారు. మరోవైపు అధిష్టానం కూడా మైనారిటీ కోటాలో ఆయనకే సీటు ఇవ్వడం ఖాయమని అంతా భావించారు. కానీ, అనూహ్యంగా ఇప్పుడు ఆయనకు ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టింది పార్టీ. దీంతో జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరై ఉంటారు? అనే సస్పెన్స్‌కు తెరలేచింది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎంపికైన కోదండరాం, ఆమిర్ అలీఖాన్ నియామకాన్ని సవాల్ చేస్తూ బీఆర్‌ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ గత ఏడాది ఆగస్టులో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు..కోదండరాం, ఆమీర్ అలీ ఖాన్ ఎమ్మెల్సీ పదవులపై ఇటీవల స్టే విధించింది. 2024 ఆగస్టు 14న తాము ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల తర్వాత జరిగిన పరిణామాలు..ఆ ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఉంటే ఎమ్మెల్సీల నియామకాన్ని రద్దు చేస్తామని వ్యాఖ్యానించింది. అయితే.. ఏదైనా తుది ఉత్తర్వులకు లోబడే ఉంటుందని స్పష్టం చేస్తూ.. తదుపరి విచారణను సెప్టెంబర్ 17కు వాయిదా వేసింది.
ఈ నేపథ్యంలో అనూహ్యంగా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదండరాం, అజారుద్దీన్ పేర్లను సిఫారసు చేస్తూ తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. అయితే లిస్ట్‌లో అమీర్ అలీ ఖాన్ పేరు తొలగించి..అజారుద్దీన్‌కు స్థానం కల్పించింది ప్రభుత్వం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఎమ్మెల్సీగా అజారుద్దీన్ ఎంపిక ఆసక్తికరంగా మారింది.
కాంగ్రెస్ పార్టీ నిర్ణయంతో జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానం టికెట్ రేస్‌లో ఉన్న అజారుద్దీన్ పోటీ నుంచి తప్పుకున్నట్టే. దీంతో బీసీ సామాజిక వర్గానికి చెందిన నవీన్ యాదవ్ పేరు లేటెస్ట్‌గా తెరపైకి వచ్చింది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి మజ్లిస్ అభ్యర్థిగా పోటీచేసిన నవీన్ యాదవ్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ముస్లిం మైనారిటీ ఓటర్లు కీలకంగా ఉన్న నేపథ్యంలో మజ్లిస్ పార్టీ మద్దతు కూడా తప్పనిసరి. ఈ క్రమంలోనే.. నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్ పేర్లు తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అభ్యర్థి ఎవరనేది కాంగ్రెస్ పార్టీ ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




