Secunderabad: మోడ్రన్ రైల్వే హబ్‌గా సికింద్రాబాద్‌.. భారీ వ్యయంతో అభివృద్ధి పనులు.. మారనున్న రూపురేఖలు

దేశవ్యాప్తంగా పలు ప్రధాన రైల్వే స్టేషన్‌ల పునరాభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన ఇండియన్ రైల్వే స్టేషన్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (IRSDC-ఐఆర్‌ఎస్‌డిసి) ద్వారా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ అభివృద్ధి పనులు చేపట్టనున్నారు.

Secunderabad: మోడ్రన్ రైల్వే హబ్‌గా సికింద్రాబాద్‌.. భారీ వ్యయంతో అభివృద్ధి పనులు.. మారనున్న రూపురేఖలు
Secunderabad Railway Station
Follow us

|

Updated on: Jun 16, 2022 | 8:51 PM

Secunderabad Junction railway station: తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద రైల్వే సెంటర్‌గా ఉన్న.. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ రూపు రేఖలు త్వరలో మారిపోనున్నాయి. ఏకంగా 653 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో అభివృద్ధికి టెండర్‌లు సైతం దాఖలయ్యాయి. హైదరాబాద్‌లో సికింద్రాబాద్ స్టేషన్‌ ఒక ప్రధాన ఇంటర్‌సిటీ జంక్షన్ రైల్వే స్టేషన్. ప్రయాణికులకు అతి ముఖ్యమైన రైల్వే హబ్‌గా ఉంది. ఇది దక్షిణ మధ్య రైల్వే కేంద్రంగా కూడా పనిచేస్తోంది. దేశవ్యాప్తంగా పలు ప్రధాన రైల్వే స్టేషన్‌ల పునరాభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన ఇండియన్ రైల్వే స్టేషన్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (IRSDC-ఐఆర్‌ఎస్‌డిసి) ద్వారా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ అభివృద్ధి పనులు చేపట్టనున్నారు.

సికింద్రాబాద్ స్టేషన్ చుట్టుపక్కల ఉన్న 5.62 ఎకరాల విస్తీర్ణం తోపాటు 96,243 చ.మీ.ల స్థలాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఇందులో రాకపోకలు, ఫుడ్‌ కోర్టులు, ప్రయాణీకులు వేచివుండే ప్రాంతాలు, పార్కింగ్‌ వంటి అనేక సౌకర్యాలను రూ.282 కోట్ల అంచనా వ్యయంతో IRSDC బిడ్‌లను ఆహ్వానించింది. రీడెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ EPC – ఇంజనీరింగ్, ప్రొక్యూర్‌మెంట్ , కన్‌స్ట్రక్షన్ ఈ పనులను.. బిడ్డర్ టెండర్ అవార్డ్ తేదీ నుంచి 36 నెలల్లో ప్రాజెక్ట్‌ను పూర్తి చేసే అవకాశం ఉంది.

మూడంతస్థుల భవనం..

ఇవి కూడా చదవండి

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ డెవలెప్మెంట్ ప్లానింగ్‌లో ఉత్తర భాగం వైపు 22,516 చదరపు మీటర్ల విస్తీర్ణంలో కొత్తగా మూడు అంతస్తుల స్టేషన్ భవనం నిర్మాణం చేయనున్నారు. ప్రస్తుతం ఉన్న దక్షిణం వైపు స్టేషన్‌ భవనం విస్తరించి G+3 అంతస్తులతో 14,792 చ.మీ లలో అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. మొదటి శ్రేణి (ఫస్ట్ క్లాస్) ప్రయాణీకులకు సౌకర్యంగా 108 మీటర్ల వెడల్పుతో డబుల్ స్టోరీ స్కై కాన్‌కోర్స్‌ను నిర్మించడం. రెండవ శ్రేణి (సెకండ్ క్లాస్) వారి కోసం 24,604 చ.మీ.ల పైకప్పు ప్లాజాగా ఉపయోగపడుతుంది. స్టేషన్‌కు ఉత్తరం వైపున మట్లీ-లెవల్ (ఐదు స్థాయిలు) పార్కింగ్‌కు ప్లాన్ చేశారు.

పార్కింగ్..

సికింద్రాబాద్‌ స్టేషన్‌లో ఇప్పటి వరకూ పార్కింగ్‌ పెద్ద సమస్యగా ఉంది. దీన్ని అధిగమించేలా నూతన నిర్మాణాలు చేయబోతున్నారు. స్టేషన్‌కు ఉత్తరాన బహుళ-స్థాయి (ఐదు స్థాయిలలో పార్కింగ్ ఏర్పాటు చేయడానికి) ప్రణాళికలు రూపొందించారు. దీంతోపాటు స్టేషన్‌కు దక్షిణం వైపు ప్రత్యేకంగా అండర్ గ్రౌండ్‌ పార్కింగ్‌ను ఏర్పాటు చేయనున్నారు. ప్రత్యేక ప్రవేశం, నిష్క్రమణ లేన్లు (డ్రాప్ ఆఫ్ అండ్‌ పికప్ పాయింట్లు) నిర్మిస్తారు. దీంతో ఎంత భారీ ట్రాఫిక్‌ ఉన్నా.. ప్రయాణికులకు వాహనాలు వెళ్లేందుకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు.

రూపురేఖలన్నీ మారుతాయి.. సీపీఆర్‌వో రాకేష్‌

మరోవైపు విద్యుత్‌ సౌకర్యాన్ని మరింత అభివృద్ధి చేస్తున్నారు. పవర్ సప్లైకి ఎలాంటి అవరోధాలు లేకుండా 5000 కేవీ సోలార్ పవర్ ప్లాంట్ నిర్మించనున్నారు. ఇప్పటి వరకు దక్షిణ మధ్య రైల్వే డివిజన్‌లో సికింద్రాబాద్‌ స్టేషన్‌ ఒక్కదానికి మాత్రమే అభివృధ్దిచేయడానికి ప్రణాళికలు సిద్దం చేశామని సిపీఆర్‌వో రాకేష్‌ స్పష్టం చేశారు. సికింద్రాబాద్ స్టేషన్‌ అభివృద్ధితోపాటు ప్రయాణీకులకు అన్ని సౌకర్యాలు కల్పించనున్నట్లు చెప్పారు. తాజాగా తీసుకుంటున్న చర్యలతో స్టేషన్ రూపు రేఖలన్నీ మారుతాయని పేర్కొన్నారు.

-గణేష్‌.వై, టీవీ9 తెలుగు, హైదరాబాద్‌

Secunderabad

Secunderabad

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..