Harish Rao: కొడంగల్‌లో నువ్వు చేసిన అభివృద్ధి ఇదేనా..? రేవంత్ రెడ్డికి.. మంత్రి హరీష్ రావు ప్రశ్నలు
రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉండి ఏం అభివృద్ధి చేశారో చెప్పాలన్నారు. రేవంత్ రైతు డిక్లరేషన్ అంటుండు.. ముందు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రైతు డిక్లరేషన్ చేయండి అంటూ మంత్రి హరీష్ రావు సూచించారు.
Minister Harish Rao on Revanth Reddy: కొడంగల్ పర్యటనలో ఉన్న మంత్రి హరీష్ రావు.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. తొమ్మిదేళ్లపాటు ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్ రెడ్డి కొడంగల్‌కు డిగ్రీ కాలేజ్, హాస్పటల్, బస్ డిపో ఎందుకు తేలేదంటూ ప్రశ్నలు గుప్పించారు. కోడంగల్‌లో టీఆర్ఎస్ గెలవకుంటే అభివృద్ధి జరిగేది కాదంటూ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. పాలమూరు రంగారెడ్డి నీరు కోడంగల్‌కు తరలించేందుకు కాలువ పనులు, త్వరలో ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. పాలమూరు రంగారెడ్డి నీరు తీసుకొచ్చి మీ కాళ్ళు కడుగుతామంటూ పేర్కొన్నారు. పక్కనే కర్ణాటక ఉంది.. మరి అక్కడ కరెంట్ ఎంతసేపు వస్తుందో ఆలోచించాలని సూచించారు. రెండు నెలల్లో అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్లు అందజేస్తామని పేర్కొన్నారు. గతంలో మంచి నీళ్ల కోసం అరిగొసపడేవారు. కానీ నేడు మిషన్ భగీరథతో ప్రతి ఇంటికి నీరు ఇస్తున్నామన్నారు.. రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉండి ఏం అభివృద్ధి చేశారో చెప్పాలన్నారు. రేవంత్ రైతు డిక్లరేషన్ అంటుండు.. ముందు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రైతు డిక్లరేషన్ చేయండి అంటూ సూచించారు. అభయ హస్తం డబ్బులు ఈ నెలాఖరులోపు వడ్డీతో సహా ఇస్తామని పేర్కొన్నారు. వడ్డీ లేని రుణాన్ని త్వరలోనే అందిస్తామని.. మూడు పల్లె దవాఖానాలు మంజూరు చేస్తున్నామని పేర్కొన్నారు. పోస్ట్ మార్టం రూంను కొడంగల్ ఆస్పత్రిలో ఏర్పాటు చేస్తామని హామీనిచ్చారు.
కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై కక్షగట్టిందని హరీశ్ రావు పేర్కొన్నారు. తలసరి ఆదాయంలో అగ్రగామిగా ఉన్నామని.. ఎఫ్ ఆర్ బి యం రాకుండా అడ్డుకుంటున్నారు.. ఎంఎన్ఆర్జిసి నిధులు ఇవ్వడం లేదని పేర్కొన్నారు. కేసీఆర్ నాయకత్వమే శ్రీరామ రక్ష అంటూ హరీశ్ పేర్కొన్నారు. త్వరలోనే అర్హులైన వారికి రేషన్ కార్డులు అందజేస్తామని పేర్కొన్నారు. నియోజకవర్గానికి మూడు వేల ఇండ్లు మంజూరు చేస్తామన్నారు. స్థలం ఉంటే మూడు లక్షల రూపాయలు ఇస్తామంటూ హరీశ్ పేర్కొన్నారు. కాంగ్రెస్ హయాంలో ప్రభుత్వ ఆస్పత్రిలో 30శాతం ప్రసవాలు మాత్రమే అయ్యేవి, కానీ నేడు అది 60 శాతానికి పెరిగాయని గుర్తు చేశారు. అంబేడ్కర్, ముదిరాజ్ భవనాలకు కోటి రూపాయల చొప్పున మంజూరు చేస్తున్నామమని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. నియోజక వర్గంలో ప్రతి తండాకు రోడ్లు వేశామని తెలిపారు. అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్నట్లు తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..