Vande Bharat Express: గుడ్ న్యూస్.. మరో రెండు వందేభారత్ రైళ్లు.? సికింద్రాబాద్ నుంచి ఎక్కడెక్కడికంటే..
ఇప్పటికే తెలుగు రాష్ట్రాల మధ్య రెండు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు పరుగులు పెడుతోన్న సంగతి తెలిసిందే..
ఇప్పటికే తెలుగు రాష్ట్రాల మధ్య రెండు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు పరుగులు పెడుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో ఒకటి సికింద్రాబాద్-విశాఖపట్నం, మరొకటి సికింద్రాబాద్-తిరుపతి. ప్రస్తుతం ఈ రెండు రైళ్లకు ప్రజాదరణ ఎక్కువగా ఉంది. ఆయా రైళ్లలో రిజర్వేషన్లు కూడా ఫుల్ అవుతున్నాయని రైల్వేశాఖ చెబుతోంది. ఇదిలా ఉంటే.. ఈ రెండు రైళ్లతో పాటు మరో రెండు లేదా మూడు నెలల్లో సికింద్రాబాద్ నుంచి బెంగళూరుకు వందేభారత్ రైలు నడపాలని కేంద్ర రైల్వేశాఖ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు కూడా ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వందేభారత్ రైలు కాచిగూడ-బెంగళూరు రూట్‌లో ఉంటుందట.
ఇప్పటికే ఈ రెండు నగరాల మధ్య అనేక రైళ్లు నడుస్తున్నాయ్. అలాగే ఈ రైళ్ల ప్రయాణ సమయం కూడా దాదాపుగా 12 గంటలు పడుతోంది. ఆ ప్రయాణ సమయాన్ని వందేభారత్ 8 గంటలకు కుదిస్తుంది. ఇప్పటికీ ఈ ట్రైన్‌ను వీలైనంత త్వరగా పట్టాలెక్కించాలని రైల్వే అధికారులు భావిస్తున్నారట.
అటు కర్ణాటకలో ఎన్నికలకు డేట్ దగ్గర పడుతుండటంతో.. అనుకున్న డేట్ కన్నా ముందే సికింద్రాబాద్-బెంగళూరు మధ్య వందేభారత్ రైలును కేంద్రం ప్రారంభించే అవకాశం ఉందని అధికారిక వర్గాలు చెబుతున్నాయ్. కాగా, బెంగళూరుకు వందేభారత్ రైలును ప్రారంభించాక.. ఆ తర్వాత సికింద్రాబాద్ నుంచి పూణేకు కూడా వందేభారత్ రైలును కేంద్ర రైల్వేశాఖ నడిపే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.