Hyderabad: హైదరాబాద్‌లో వచ్చే 4 రోజులు వర్షాలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్…
రాష్ట్రంలో రుతుపవనాలు ఎంటరయ్యాయ్. పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయ్. ఇక హైదరాబాద్ సిటీలో కూడా వచ్చే 4 రోజులు వర్షాలు పడతాయని నగర వాతావరణ కేంద్రం తెలిపింది. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ తెలుసుకుందాం పదండి....

Rain Alert
రానున్న నాలుగు రోజుల పాటు నగరంలోని అన్ని మండలాల్లో ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హైదరాబాద్ అంచనా వేసింది.వాతావరణ శాఖ చెబతున్న వివరాల ప్రకారం, జూన్ 8 వరకు చార్మినార్, ఖైరతాబాద్, కూకట్‌పల్లి, ఎల్‌బి నగర్, సికింద్రాబాద్, శేరిలింగంపల్లిలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు, ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. తెలంగాణ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని ఆ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. మంగళవారం తెలంగాణలోని ములుగు, మంచిర్యాల, పెద్దపల్లి, జగిత్యాల, నిజామాబాద్, హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వర్షపాతం నమోదైంది.
రుతుపవనాల రాకకు ముందు కురిసిన వర్షాల కారణంగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. మంగళవారం మహబూబ్‌నగర్‌లో 33 డిగ్రీల సెల్సియస్ నమోదయింది. హైదరాబాద్, ఖైరతాబాద్‌లో 36.2 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయింది. గత కొద్ది రోజులుగా వేసవి తాపంతో సతమతమవుతున్న తెలంగాణ వాసులకు IMD హైదరాబాద్ అంచనా వేసిన వర్షపాతం ఎంతవరకు ఉపశమనం కలిగిస్తుందో చూడాలి. ఇక తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించిన విషయం తెలిసిందే. తాజా అప్‌డేట్ ఏంటంటే… అవి రాష్ట్రంలో చురుగ్గా కదులుతున్నాయి. సాధారణంగా జూన్ రెండో వారంలో తెలంగాణకు రుతుపవనాలు వస్తుంటాయి. కానీ ఈ సారి చాలా ఎర్లీగానే వచ్చేశాయి. ఈ ఏడాది వారం రోజుల ముందే వీటి ఆగమనం జరిగింది. ఈసారి సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




