NEET UG 2024 Rankers List: నీట్ యూజీ 2024 ఫలితాల్లో ఏకంగా 67 మందికి ఫస్ట్ ర్యాంకు.. కటాఫ్ మార్కులు ఇవే!
నీట్ యూజీ ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) జూన్ 4న వెల్లడించిన సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా మొత్తం 23.33 లక్షల మంది విద్యార్ధులు నీట్ యూజీ పరీక్షకు హాజరుకాగా వీరిలో 13.16 లక్షల మంది ఉత్తీర్ణత సాధించారు. తెలంగాణ నుంచి నీట్ యూజీ పరీక్షకు మొత్తం 79,813 మంది దరఖాస్తు చేసుకోగా, వారిలో 77,849 మంది పరీక్ష రాశారు. ఇందులో 47,371 మంది కనీస అర్హత మార్కులు సాధించారు...
న్యూఢిల్లీ, జూన్ 5: నీట్ యూజీ ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) జూన్ 4న వెల్లడించిన సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా మొత్తం 23.33 లక్షల మంది విద్యార్ధులు నీట్ యూజీ పరీక్షకు హాజరుకాగా వీరిలో 13.16 లక్షల మంది ఉత్తీర్ణత సాధించారు. తెలంగాణ నుంచి నీట్ యూజీ పరీక్షకు మొత్తం 79,813 మంది దరఖాస్తు చేసుకోగా, వారిలో 77,849 మంది పరీక్ష రాశారు. ఇందులో 47,371 మంది కనీస అర్హత మార్కులు సాధించారు. దేశ వ్యాప్తంగా చూస్తే 67 మంది విద్యార్ధులకు 99.997129 పర్సంటెల్ వచ్చింది. సాధారణంగా ఆలిండియా ఫస్ట్ ర్యాంకు ఒకరికో, ఇద్దరికో వస్తుంది. కానీ నీట్ యూజీలో మాత్రం ఏకంగా 67 మందికి రావడం ఒకింత ఆశ్చర్యానికి గురిచేసింది. వీరందరికీ ఒకే పర్సంటెల్ వచ్చింది. ఆలిండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వారిలో ఆంధ్రప్రదేశ్ నుంచి నలుగురు విద్యార్ధులు ఉండటం విశేషం. ఫస్ట్ ర్యాంకు సాధించిన వారిలో 14 మంది అమ్మాయిలు, 53 మంది అబ్బాయిలు ఉన్నారు. రాజస్థాన్ నుంచి అత్యధికంగా 11 మంది విద్యార్థులు ఒకటో ర్యాంకు సాధించారు.
నీట్ యూజీ 2024 ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
నీట్‌లో అర్హత సాధించిన వారందరికీ కౌన్సెలింగ్ నిర్వహించి ఎంబీబీఎస్, బీడీఎస్ వంటి తదితర కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఇక తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్‌కు చెందిన అనురన్ ఘోష్ అనే విద్యార్ది 77వ ర్యాంకు సాధించాడు. దీంతో ఈసారి తెలంగాణ నుంచి 100లోపు ర్యాంకు కేవలం ఒకరు మాత్రమే సాధించినట్లైంది. కాగా నీట్ యూజీ 2024 పరీక్ష మే 5వ తేదీన దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించిన సంగతి తెలిసిందే.
ఈసారి నీట్ యూజీ కటాఫ్ ఎంతంటే..
నీట్ యూజీ పరీక్ష మొత్తం 720 మార్కులకు నిర్వహించారు. ఇందులో జనరల్ కేటగిరికి కటాఫ్ 164 మార్కులుగా నిర్ణయించారు. నీట్ యూజీలో జనరల్ కేటగిరి అభ్యర్ధులు 164 మార్కులు వస్తేనే ఎంబీబీఎస్ కోర్సులో ప్రవేశాలు పొందుతారు. అలాగే బీసీ, ఎస్‌సీ, ఎస్‌టీ కేటగిరీలకు 129 మార్చులు, ఈడబ్ల్యూఎస్ కేటగిరికి 146 మార్కులుగా కటాఫ్ నిర్ణయించారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.