LB Nagar flyover collapsed: కుప్పకూలిన నిర్మాణ పనుల్లో ఉన్న ఎల్బీ నగర్ ఫ్లైఓవర్.. 8 మంది కూలీలకు తీవ్ర గాయాలు
ఎల్బీ నగర్‌లోని సాగర్ రింగ్‌రోడ్డు కూడలి వద్ద నిర్మాణ పనుల్లో ఉన్న ఫ్లైఓవర్ ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ రోజు (జూన్ 21) తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. పిల్లర్ల మధ్య ఇనుప ర్యాంప్ ఏర్పాటు చేస్తుండగా ప్రమాదం..
హైదరాబాద్: ఎల్బీ నగర్‌లోని సాగర్ రింగ్‌రోడ్డు కూడలి వద్ద ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణ పనుల్లో ఉన్న ఫ్లైఓవర్ ర్యాంప్ ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ రోజు (జూన్ 21) తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. పిల్లర్ల మధ్య ఇనుప ర్యాంప్ ఏర్పాటు చేస్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాద స్థలంలో కొంత మంది గాఢ నిద్రలో ఉండగా ఘటన జరిగినట్లు సమాచారం. ఈ ఘటనలో 8 మంది కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన కార్మికులంతా బీహార్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన వారిగా గుర్తించారు. ఈ ఘటనపై సమాచారం అందించిన వెంటనే రెస్క్యూ టీం ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను హుటాహుటీన సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. గాయపడిన కార్మికుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
3 జేసీబీల సహాయంతో శిధిలాలను తొలగిస్తున్నారు. గత 3 గంటలుగా సహాయక పనులు కొనసాగుతున్నాయి. ఫ్లైఓవర్ కూలిపోవడానికి గల ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, జీహెచ్‌ఎంసీ మేజర్ ప్రాజెక్టు అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయ పనులను పరిశీలిస్తున్నారు.
మరిన్ని తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.