Hyderabad: రోడ్డుపై ఒక్కసారిగా కుప్పకూలిన భవననిర్మాణ కార్మికుడు.. మెరుపువేగంతో కాపాడిన ట్రాఫిక్ పోలీస్! వీడియో వైరల్
ఈ మధ్యకాలంలో వయసుతో సంబంధం లేకుండా అన్ని వయసుల వారు గుండెపోటుతో ఆకస్మికంగా మరణిస్తున్నారు. ఐతే గుండెపోటు వచ్చిన సమయంలో ఏం చేయాలో.. ఎలా చేయాలో తెలియక అవగాహన రాహిత్యంతో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కొద్దిపాటి అప్రమత్తతో ఈ ప్రమాదం నుంచి సులువుగా బయటపడొచ్చని ఆరోగ్య నిపుణులు..
హైదరాబాద్, ఆగస్టు 31: ఈ మధ్యకాలంలో వయసుతో సంబంధం లేకుండా అన్ని వయసుల వారు గుండెపోటుతో ఆకస్మికంగా మరణిస్తున్నారు. ఐతే గుండెపోటు వచ్చిన సమయంలో ఏం చేయాలో.. ఎలా చేయాలో తెలియక అవగాహన రాహిత్యంతో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కొద్దిపాటి అప్రమత్తతో ఈ ప్రమాదం నుంచి సులువుగా బయటపడొచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. తాజాగా నగరానికి చెందిన ఓ భవన నిర్మాణ కార్మికుడు గుండెపోటుతో కుప్పకూలగా సమీపంలోని ఓ ట్రాఫిక్ పోలీస్ సకాలంలో సీపీఆర్ ఇచ్చి ప్రాణాలు కాపాడాడు. అనంతరం అతన్ని ఆసుపత్రికి తరలించారు. అసలేం జరిగిందంటే..
హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ ఏసీపీ పీ మధుసూధన్ రెడ్డి బేగంపేట వద్ద బుధవారం (ఆగస్టు 30) ఉదయం గస్తీకాస్తున్న సమయంలో అటుగా వెళ్తున్న ఓ బాటసారి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. గమనించిన ఏపీసీ మధుసూధన్ రెడ్డి అతని వద్దకు పరుగెత్తి, వెంటనే అతనికి సీపీఆర్ ఇచ్చి అతని ప్రాణాలు కాపాడారు. అనంతరం అంబులెన్స్‌లో బాధితుడిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. బాధితుడిని ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళానికి చెందిన భవన నిర్మాణ కార్మికుడిని గుజ్జల్ల రాము (40)గా గుర్తించారు. జీవనోపాధి కోసం నగరానికి వచ్చిన రాము బేగంపేటలో నివాసం ఉంటున్నట్లు విచారణలో తేలింది. బుధవారం ఉదయం పనికి వెళ్తుండగా ఛాతీ భాగంలో నొప్పి రావడంతో రాము కుప్పకూలిపోయాడని అధికారులు తెలిపారు. రోగిని వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతను క్షేమంగా ఉన్నాడు.
Hats off to ACP P. Madhusudhan Reddy @HYDTP 🫡 for his swift response, administering #CPR to a man who collapsed in Begumpet, #Hyderabad. Grateful to our dedicated officers like him, and relieved to hear the man is recovering in the hospital. 🙏👏 @CVAnandIPS @CPHydCity #HERO pic.twitter.com/dwEyYuXj9G
— Karthikeyan Rayana (@rkntwia) August 30, 2023
సకాలంలో ట్రాఫిక్ ఏసీపీ మధుసూధన్ రెడ్డి అందించిన సహాయం అతన్ని కాపాడింది. సమయానుకూలంగా CPR చేసి ప్రాణాలు కాపాడిన నార్త్ జోన్ ట్రాఫిక్ ఏసీపీ మధుసూదన్ రెడ్డిని అందరూ అభినందిస్తున్నారు. CPR నేర్చుకుని ప్రాణాలను కాపాడండి అంటూ గతంలో మంత్రి హరీష్ ట్వీట్ చేశారు కూడా. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.