India – UAE flight: హైదారాబాద్ టు షార్జా… 180 మంది ప్రయాణించే విమానంలో ముగ్గురే ప్రయాణికులు.
India - UAE flight: కరోనా మహమ్మారి దేశాల మధ్య దూరాన్ని పెంచేసింది. వైరస్ ఒక దేశం నుంచి మరో దేశానికి వ్యాపించకూడదనే ఉద్దేశంతో ఇతర దేశాలకు చెందిన విమానాలను తమదేశంలోకి...
India – UAE flight: కరోనా మహమ్మారి దేశాల మధ్య దూరాన్ని పెంచేసింది. వైరస్ ఒక దేశం నుంచి మరో దేశానికి వ్యాపించకూడదనే ఉద్దేశంతో ఇతర దేశాలకు చెందిన విమానాలను తమదేశంలోకి అనుమతిని నిరాకరిస్తూ కొన్ని దేశాలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో ఎక్కడి ప్రజలు అక్కడి ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. అలా షార్జా నుంచి తెలంగాణకు వచ్చి ఇరుక్కు పోయారు కరీంనగర్‌కు చెందిన బండం శ్రీనివాసరెడ్డి కుటుంబం. ఇక తాజాగా విమాన సేవలు తిరిగి ప్రారంభం కావడంతో ఈ కుటుంబం షార్జాకు వెళ్లింది. అయితే ఈ సమయంలో ఈ కుటుంబం వింత అనుభూతిని ఎదుర్కొంది.
వివరాల్లోకి వెళితే.. కరీంనగర్‌కు చెందిన బండం శ్రీనివాసరెడ్డి, పోటు హరిత రెడ్డి దంపతులు మూడు నెలల క్రితం అత్యవసర పని మీద హన్మకొండకు వచ్చారు. పని పూర్తి చేసుకొని తిరిగి షార్జాకు వెళ్లాలనుకున్న సమయంలో కరోనా విజృంభించింది. దీంతో యూఏఈ ప్రభుత్వం తమ దేశంలోకి ఇతర దేశాల విమానాలను అనుమతించలేదు. ఇక చేసేది ఏమి లేక శ్రీనివాస రెడ్డి కుటుంబం భారత్‌లోనే ఉండాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే విమానాలు నడుస్తాయన్న సమాచారంతో శ్రీనివాస రెడ్డి ఆరు సార్లు టికెట్ బుక్ చేసుకున్నాడు. కానీ విమాన సేవలు రద్దు అవుతూ వచ్చాయి. ఇక తాజాగా యూఏఈ ప్రభుత్వం విమాన సేవలను తిరిగి ప్రారంభించింది. అయితే కేవలం గోల్డెన్ వీసా ఉన్నవాళ్లకు మాత్రమే అవకాశం కలిపించారు. దీంతో శ్రీనివాస రెడ్డి కుటుంబం గోల్డెన్ వీసా కలిగి ఉండడంతో తిరిగి షార్జాకు ప్రయణమయ్యారు. అయితే ఇక్కడో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. హైదారబాద్ నుంచి షార్జాకి వెళ్లిన ఏ. 320 అరేబియన్ విమానంలో కేవలం శ్రీనివాస రెడ్డి కుటుంబం మాత్రమే ఉంది. 180 మంది ప్రయాణించే వీలున్న ఫ్లైట్‌లో శ్రీనివాస రెడ్డి, ఆయన భార్య హరిత రెడ్డితో పాటు కుమారుడు మాత్రమే ప్రయానించారు. దీంతో ఈ ప్రయాణం వారికి మరపురాని అనుభవంగా మారింది. ఇలా ఈ నెల 3న ఈ కుటుంబం యూఏఈకి వెళ్లింది. హరిత రెడ్డి షార్జాలో వైద్యురాలిగా పనిచేస్తుండగా.. శ్రీనివాస రెడ్డి టెక్ మహేంద్రలో జనరల్ మేనేజర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం ఫ్లైట్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.