Metro Rail : తెలంగాణ కొవిడ్ అన్ లాక్ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో రైలు సేవల్లో మార్పులు
తెలంగాణ వ్యాప్తంగా రేపటి నుంచి లాక్ డౌన్ (జూన్ 20) సంపూర్ణంగా ఎత్తివేయాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించిన నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో రైల్ సమయాల్లో..
Hyderabad Metro Rail timings : తెలంగాణ వ్యాప్తంగా నేటి నుంచి లాక్ డౌన్ (జూన్ 20) సంపూర్ణంగా ఎత్తివేయాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించిన నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో రైల్ సమయాల్లో అధికారులు మార్పులు చేశారు. ఎల్లుండి నుంచి పూర్తిస్థాయిలో ప్రయాణికులకు మెట్రో రైలు సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మెట్రో రైళ్లు తిరుగుతాయి. ఉ.7 గంటలకు మొదటి మెట్రో రైలు బయలు దేరుతుంది. చివరి స్టేషన్ నుంచి రాత్రి 9 గంటలకు మెట్రో రైలు బయలు దేరుతుందని హైదరాబాద్ మెట్రో ఒక ప్రకటన విడుదల చేసింది. మార్చిన మెట్రో రైళ్ల వేళలు సోమవారం నుంచి అమలులోకి రానున్నాయి.
కాగా, రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య, పాజిటివిటీ శాతం గణనీయంగా తగ్గిందని, కరోనా పూర్తి నియంత్రణలోకి వచ్చిందని తెలంగాణ కేబినెట్ కు వైద్యశాఖ అధికారులు అందించిన నివేదికలు పరిశీలించిన నేపథ్యంలో తెలంగాణ కేబినెట్ లాక్ డౌన్ ను ఎత్తివేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో అన్ని రకాల వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు రేపటి నుంచి యథావిధిగా సాగనున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా అన్‌లాక్ గైడ్‌లైన్స్‌ను ప్రభుత్వం విడుదల చేసింది.
లాక్‌డౌన్‌కు ముందున్న అన్ని కార్యకలాపాలకు అనుమతినిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, బహిరంగ ప్రదేశాలు, పని ప్రదేశాల్లో మాస్కు ధరించడం తప్పనిసరి అని సర్కారు పేర్కొంది. మాస్కు ధరించకపోతే వెయ్యి రూపాయల జరిమానా.. ఆఫీసులు, దుకాణాల్లో కొవిడ్ నిబంధనలు పాటించాలని పేర్కొంది. భౌతిక దూరం, శానిటైజేషన్ తప్పనిసరి అని.. జూలై 1 నుంచి విద్యాసంస్థలు, కోచింగ్ సెంటర్లు తెరిచేందుకు అనుమతినిస్తూ తెలంగాణ సర్కారు నిర్ణయం తీసుకుంది.