Hyderabad: మెట్రో ప్రయాణీకులకు షాక్.. ఈ ఆఫర్లు, రాయితీలను రద్దు చేసిన HMRL
హైదరాబాద్‌లోని మెట్రో ప్రయాణికులకు తీవ్ర నిరాశ ఎదురైంది. మెట్రో అధికారులు మెట్రో కార్డులు, హాలిడే కార్డులపై ఉన్న రాయితీలను రద్దు చేశారు. తాజాగా తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ప్రయాణికులపై అదనపు ఆర్థిక భారం పడనుంది.

హైదరాబాద్‌లోని మెట్రో ప్రయాణికులకు తీవ్ర నిరాశ ఎదురైంది. మెట్రో అధికారులు మెట్రో కార్డులు, హాలిడే కార్డులపై ఉన్న రాయితీలను రద్దు చేశారు. తాజాగా తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ప్రయాణికులపై అదనపు ఆర్థిక భారం పడనుంది. హైదరాబాద్ రోజు రోజుకు విశ్వనగరంగా మారుతోంది. దేశ, విదేశాల నుంచి అనేక మంది ఉద్యోగ, వ్యాపార ఇతర పనుల నిమిత్తం భాగ్యనగరానికి వస్తూ ఉంటారు. అయితే వారిని సురక్షితంగా, సుఖవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు మెట్రో అనేక రకాలుగా దోహదపడుతుంది. పైగా నగరంలో రోజు రోజుకు విస్తరిస్తున్న ట్రాఫిక్ రద్దీని ఎదుర్కోకుండా ప్రజలు, ఉద్యోగులు త్వరగా తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి మెట్రో రైలు హైదరాబాద్ వాసులకు ప్రాథమిక రవాణా మార్గంగా మారింది. దీంతో ఉదయం, సాయంత్రం, రద్దీ వేళలతో పాటు సెలవు దినాల్లోనూ మెట్రో ప్రయాణం ప్రత్యేక ఆదరణ పొందింది. మండుటెండ వేసవి తాపంతో గత కొద్దిరోజులుగా మెట్రో కోసం మొగ్గు చూపుతున్న వారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. బస్సుల కోసం ఎదురు చూడకుండా, ఎండలో కష్టమైన ప్రయాణానికి చెక్ పెట్టి హాయిగా ఏసీలో త్వరగా గమ్యస్థానాన్ని చేరవేసే మెట్రో వైపుకు అడుగులు వేస్తున్నారు నగర వాసులు. ఇలాంటి అద్భుతమైన రవాణా సౌకర్యాన్ని కల్పించిన హైదరాబాద్ మెట్రో రైల్ తాజాగా ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో ఇలాంటి వారిని కలవరపెడుతోంది.
హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (HMRL) అధికారులు మెట్రో కార్డ్‌లపై 10 శాతం తగ్గింపును ఉపసంహరించుకున్నట్లు ప్రకటించారు. అలాగే SSO-59 లేదా సూపర్ సేవర్ హాలిడే స్మార్ట్ కార్డ్‌లు కూడా నిలిపివేయబడినట్లు తెలిపారు. సూపర్ సేవర్ స్మార్ట్ కార్డ్‌లు మెట్రోలో ప్రయాణించడానికి ప్రయాణీకులు కేవలం రూ. 59 చెల్లిస్తే చాలు. అయితే ఈ కార్డు ద్వారా రీచార్జ్ చేసుకుని నిర్దిష్ట సెలవు దినాల్లో, శని, ఆది వారాల్లో ప్రయాణాలు చేయవచ్చు. ఈ ఆఫర్ 2023, సెప్టెంబర్ 23, న ప్రవేశపెట్టబడింది. ఈ రాయితీని ఎందుకు రద్దు చేస్తున్నారన్న విషయాన్ని ఎక్కడా చెప్పలేదు. తిరిగి అమలు చేస్తారా అన్న విషయాన్ని కూడా తెలుపలేదు. ఏది ఏమైనా ఈ ప్రత్యేక ఆఫర్లను తొలగించడం వల్ల నిత్యం మెట్రోలో ప్రయాణించే లక్షల మంది ప్రయాణీకులకు చేదు వార్త అనే చెప్పాలి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…




