Andhra: గంగమ్మతల్లి పండుగలో అంతా సందడిగా ఉన్న వేళ ఒక్కసారిగా మిన్నంటిన రోదనలు
కుటుంబ కలహం చివరకు తండ్రి ప్రాణాలను బలితీసుకుంది. గంగమ్మతల్లి పండుగ రోజు ఆనందం విషాదంగా మారింది. కోపావేశంలో కొడుకు చేసిన దాడిలో తండ్రి అక్కడికక్కడే మృతి చెందగా, గ్రామమంతా ఉలిక్కిపడింది. పూర్తి వివరాలు కథనం లోపల తెలుసుకుందాం పదండి ... ..

ఒక కుటుంబంలో చెలరేగిన కలహం తండ్రి ప్రాణాలను బలితీసుకుంది. పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం నేరేడువలసలో చోటు చేసుకున్న ఈ దారుణ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. తుమరావల్లి పంచాయతీ నేరేడువలస గ్రామం.. గంగమ్మతల్లి పండుగతో సందడిగా ఉంది. అందరూ ఆనందంగా గడుపుతున్న క్షణాల్లో వారి మధ్య చోటు చేసుకున్న ఘటన విషాదంగా మారింది. నేరేడువలసకు చెందిన పొయిరి సోమయ్య (56) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. తన తండ్రి మృతిపై దర్యాప్తు జరపాలని చిన్న కుమారుడు ఎరుకయ్య ఇచ్చిన సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. వారి విచారణలో సోమయ్య మృతికి సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. సోమయ్యకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కుమార్తె లక్ష్మిని శతాబి గ్రామానికి చెందిన శ్రీరామ్‌కు ఇచ్చి వివాహం చేశారు. చిన్న కుమారుడు ఎరకయ్య శతాబి గ్రామానికి చెందిన మహిళను వివాహం చేసుకుని ఇల్లరికంగా ఉంటున్నాడు. పెద్ద కుమారుడు సింహాచలం, భార్య గౌరమ్మతో విభేదాల కారణంగా తల్లిదండ్రులతోనే నివశిస్తున్నాడు.
మూడేళ్ల క్రితం సోమయ్య భార్య లచ్చమ్మ మృతి చెందడంతో సోమయ్య కుంగిపోయి మానసిక సమస్యలతో బాధపడుతున్నాడు. ఒంటరిగా వచ్చే వారిపై దాడి చేయడం, బట్టలు చించడంతో పాటు వికృత చేష్టలకు పాల్పడుతుంటాడు. సోమయ్య చేసే పనులకు మీ తండ్రిని అదుపులో పెట్టుకోవాలని సింహాచలంను గ్రామస్తులు నిలదీయడంతో పాటు అవమానకరమైన మాటలతో వేధిస్తున్నారు. ఈ క్రమంలో ఈ నెల 17న గంగమ్మతల్లి పండుగ సందర్భంగా ఇంట్లో భోజనం చేస్తున్నాడు సింహాచలం. అదే సమయంలో కొడుకును చూసిన సోమయ్య విపరీతమైన కోపంతో మానసికంగా విచక్షణ కోల్పోయి.. వెనుక నుంచి సింహాచలంను కాలితో తన్నాడు. దాంతో కిందపడిన సింహాచలం పట్టరాని కోపంతో నీ వల్ల నాకు అన్నీ ఇబ్బందులే అంటూ దుర్భాషలాడుతూ అక్కడే ఉన్న కర్రతో తండ్రి మెడపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో సోమయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. జరిగిన ఘటనపై చిన్న కుమారుడు ఎరకయ్య ఈ నెల 18న పాచిపెంట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఘటనాస్థలానికి వచ్చిన సింహాచలం చేసిన దాడి కారణంగానే సోమయ్య చనిపోయినట్లు నిర్ధారించి నిందితుడు సింహాచలాన్ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు పోలీసులు. పండుగ రోజు జరిగిన ఈ దారుణ ఘటన గ్రామంలో తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. కుటుంబ కలహాలు ప్రాణాంతకంగా మారుతున్న తీరు పై గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
