AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: ఆస్తి కోసం ఎంతకు తెగించావురా.. బతికుండగానే తల్లిని చంపేశాడు… ఇక నెలకు 15 వేలు కట్టాల్సిందే.

ఆస్తి కోసం తల్లి బతికుండగానే రికార్డుల్లో చంపేశాడు కొడుకు. తప్పుడు మరణ ధృవీకరణ పత్రంతో భూమిని అమ్మేసి, వృద్ధాశ్రమంలో ఉన్న తల్లికి ఘోరీ కట్టాడు. చివరికి మెయింటెన్స్‌ అండ్‌ వెల్ఫేర్‌ ఆఫ్‌ పేరెంట్స్‌ అండ్‌ సీనియర్‌ సిటిజన్‌ యాక్ట్‌–2007 ఆమెకు న్యాయం చేసింది.

Andhra: ఆస్తి కోసం ఎంతకు తెగించావురా.. బతికుండగానే తల్లిని చంపేశాడు... ఇక నెలకు 15 వేలు కట్టాల్సిందే.
Ramdevi
Fairoz Baig
| Edited By: |

Updated on: Dec 23, 2025 | 7:39 PM

Share

ఆస్తి కోసం తల్లి జీవించి ఉండగానే అమెను రికార్డుల్లో చంపేశాడో కొడుకు… పున్నామ నరకం నుంచి కొడుకు కాపాడతాడో లేదో తెలియదు కానీ ప్రాణం ఉండగానే ఆమెకు ఘోరీ కట్టేశాడు. తల్లి చనిపోయినట్టు తప్పుడు మరణ ధృవీకరణ పత్రం పుట్టించి ఆమె పేరున ఉన్న ఆస్తిని ఆమ్మేశాడు. పండుముదుసలి అయిన ఆమె వృద్దాశ్రమంలో ఉండగా తొలుత గ్రహించలేకపోయింది… ఈ విషయం ఆలస్యంగా తెలుసుకుని తనకు న్యాయం చేయాలని మెయింటెన్స్‌ అండ్‌ వెల్ఫేర్‌ ఆఫ్‌ పేరెంట్స్‌ అండ్‌ సీనియర్‌ సిటిజన్‌ యాక్ట్‌ 2007 చట్టం కింద అధికారులను ఆశ్రయించింది. దీంతో ఆమె ఆస్తిని అక్రమంగా రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న డాక్యుమెంట్లను రద్దు చేసి అధికారులు ఆమెకు తిరిగి అప్పగించారు.

ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం కొమ్మవరం గ్రామానికి చెందిన 85 ఏళ్ల విప్పల రమాదేవి గుంటూరు పట్టణంలోని అనురాగ్‌ వృద్ధాశ్రమంలో ఉంటున్నారు. రమాదేవి భర్త పెద్ద వెంకిరెడ్డి చనిపోవడంతో 155/1 సర్వే నెంబరులోని 1.96 ఎకరాల భూమి ఆమెకు సంక్రమించింది. రెవెన్యూ రికార్డుల్లో కూడా భూమి రమాదేవి పేరుతోనే ఉంది. ఆమెకు ఒక కొడుకు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఒక కుమార్తె మరణించగా మిగిలిన ఇద్దరు సంతానం ఆమెను పట్టించుకోకపోవడంతో చనిపోయిన పెద్ద కుమార్తె కూతురు శివపార్వతి సంరక్షణలో ఉంటోంది. 85 ఏళ్ల వయస్సు దాటడంతో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న రమాదేవిని మనవరాలు గుంటూరులోని ఓ వృద్దాశ్రమంలో ఉంచి చికిత్స చేయిస్తోంది.

ప్రస్తుతం రమాదేవి గ్రామంలో లేకపోవడంతో ఆమె కుమారుడు వేణుగోపాల్‌రెడ్డి భూమిని అమ్ముకునేందుకు పథకం వేశాడు. రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై తన తల్లి రమాదేవి మరణించినట్లుగా తప్పుడు ధృవీకరణ పత్రాలతో ఆస్తిని తనపేరుపై బదలాయించుకున్నాడు. అనంతరం గుట్టు చప్పుడుకాకుండా మరొకరికి విక్రయించి సొమ్ము చేసుకున్నాడు. గత ఏడాది డిసెంబరు 21న దర్శి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌ కూడా చేశాడు. కొనుగోలుదారులు భూమిని తన పేరుతో మార్పించుకోవడం కూడా జరిగిపోయింది. ఆనారోగ్యంతో చికిత్స చేయించుకుంటూ ఆస్తిని ఆమ్మి డబ్బులు తీసుకుందామని భావించిన తల్లి రమాదేవికి షాక్‌ తగిలింది. తన ప్రమేయం లేకుండా తాను చనిపోయినట్టు తప్పుడు మరణధృవీకరణ పత్రంతో తన కొడుకు ఆస్తిని తన పేరున బదలాయించుకుని అమ్మేసుకున్నట్టు తెలుసుకుని అధికారులను ఆశ్రయించారు. ఒంగోలు కలెక్టరేట్‌లోని మీకోసంలో స్పందన కార్యక్రమంలో తనకు న్యాయం చేయాలని మెయింటెన్స్‌ అండ్‌ వెల్ఫేర్‌ ఆఫ్‌ పేరెంట్స్‌ అండ్‌ సీనియర్‌ సిటిజన్‌ యాక్ట్‌ 2007 చట్టం కింద అధికారులకు ఫిర్యాదు చేశారు. రమాదేవి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన అధికారులు కలెక్టర్‌ రాజాబాబు ఆదేశాలతో ఆర్డీవో లక్ష్మీప్రసన్న సమగ్ర విచారణ చేపట్టారు. రమాదేవి కుమారుడు వేణుగోపాల్‌రెడ్డి తనకు తండ్రి ఇచ్చిన ఆరు ఎకరాలతోపాటు తన తల్లి పేరుతో ఉన్న 1.96 ఎకరాల భూమిని ఇతరులకు విక్రయించినట్లుగా ఆర్డీవో ఎదుట ఒప్పుకున్నాడు. రమాదేవి వృద్ధాశ్రమంలో చేరిన నాటి నుంచి కొడుకు పట్టించుకోకపోవడంతో ఆమె ఖర్చును మనవరాలు శివపార్వతే భరిస్తుందని విచారణలో గుర్తించారు. అక్రమంగా చేసిన భూమి రిజిస్ట్రేషన్‌ను రద్దు చేశారు.  తన తల్లి జీవనోపాధికి ప్రతినెలా 15 వేలు కొడుకు చెల్లించే విధంగా ఆదేశించారు. అలాగే జరిగిన అక్రమ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసి ఆ పత్రాలను రమాదేవికి అందించారు. రమాదేవి మరణించినట్లుగా ధ్రువీకరణ పత్రాలు జారీచేసిన రెవెన్యూ అధికారులపై చర్యలకు సిఫార్సు చేశారు.

తమను కొడుకులు, కూతుళ్లు ఎవరైనా మోసం చేసినట్టు తల్లిదండ్రులు మెయింటెన్స్‌ అండ్‌ వెల్ఫేర్‌ ఆఫ్‌ పేరెంట్స్‌ అండ్‌ సీనియర్‌ సిటిజన్‌ యాక్ట్‌ 2007 చట్టం కింద తమకు ఫిర్యాదు చేస్తే నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఒంగోలు ఆర్డీవో లక్ష్మీప్రసన్న హెచ్చరించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.