Frano Selak: యముడికే చుక్కలు చూపించాడు.. ఈయన అదృష్టం చూస్తే షాక్ అవుతారు!
మృత్యువు ఏడుసార్లు వెంటాడినా జుట్టు కూడా చెదరలేదు.. పైగా కోట్లలో లాటరీ తగిలి అదృష్టం తలుపు తట్టింది. వినడానికి ఏదో సినిమా కథలా ఉన్నా, క్రొయేషియాకు చెందిన ఫ్రాన్ సెలాక్ జీవితంలో జరిగినవన్నీ అక్షర సత్యాలు. ప్రపంచంలోనే అత్యంత అదృష్టవంతుడిగా పేరుగాంచాడు. ఈయన గగుర్పాటు కలిగించే జీవన ప్రయాణం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. అతడు ఎదుర్కొన్న ఏడు గండాలు అతడిని కోటీశ్వరుడిని చేశాయి..

చావు అంచుల వరకు వెళ్లి రావడం అంటే ఒక ఎత్తు.. కానీ ఏకంగా ఏడు సార్లు మృత్యువును ముద్దాడి ప్రాణాలతో బయటపడటం మరొక ఎత్తు. విధి ఆడిన వింత నాటకంలో ఎన్నో ప్రమాదాల నుంచి బయటపడి, చివరకు లాటరీ ద్వారా కోటీశ్వరుడైన ఫ్రాన్ సెలాక్ అద్భుత గాథ ఇది.
క్రొయేషియాకు చెందిన ఫ్రాన్ సెలాక్ ప్రపంచంలోనే అత్యంత అదృష్టవంతుడిగా గుర్తింపు పొందారు. ఒక సాధారణ సంగీత ఉపాధ్యాయుడైన ఆయన జీవితం ఎన్నో అనూహ్య మలుపులతో సాగింది. ఏకంగా ఏడు సార్లు ఘోర ప్రమాదాల నుంచి ప్రాణాలతో బయటపడి అందరినీ ఆశ్చర్యపరిచారు.
వరుస ప్రమాదాలు.. అద్భుత మనుగడ సెలాక్ ప్రయాణిస్తున్న బస్సు 1957లో నదిలో పడిపోయింది. అప్పుడు క్షేమంగా బయటపడిన ఆయనకు ఆ తర్వాత వరుసగా గండాలు ఎదురయ్యాయి. ఆయన ప్రయాణిస్తున్న రైలు పట్టాలు తప్పి నదిలో పడినా, విమానం ప్రమాదానికి గురై గాలిలో నుంచి కింద పడినా ప్రాణాపాయం కలగలేదు. విమానం నుంచి కింద పడే సమయంలో గడ్డివాముపై పడటంతో ఆయన ప్రాణాలు నిలిచాయి. ఇవే కాకుండా రెండుసార్లు కారు పేలుడు నుంచి తప్పించుకున్నారు. ఒకసారి కొండపై నుంచి కారు పడిపోతుండగా చెట్టు కొమ్మను పట్టుకుని ప్రాణాలు కాపాడుకున్నారు. బస్సు ఢీకొట్టిన సంఘటనలోనూ ఆయనకు ఏమీ కాలేదు.
కోట్ల లాటరీ.. సాదాసీదా జీవితం వరుస ప్రమాదాల నుంచి బయటపడిన సెలాక్ ను 2000 సంవత్సరంలో అదృష్టం వరించింది. క్రొయేషియా లాటరీలో ఆయనకు సుమారు 10 లక్షల డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ. 8.36 కోట్లు) వచ్చాయి. ఆ డబ్బుతో విలాసవంతమైన ఇల్లు కొనుగోలు చేసినా.. మనసు మార్చుకుని 2010లో దాన్ని అమ్మేశారు. తన ఐదో భార్యతో కలిసి సాధారణ జీవితం గడపడానికి ప్రాధాన్యం ఇచ్చారు. లాటరీలో గెలిచిన డబ్బులో ఎక్కువ భాగం స్నేహితులు, బంధువులకే ఇచ్చి తన దాతృత్వాన్ని చాటుకున్నారు.
తమకు ప్రాణభిక్ష పెట్టినందుకు కృతజ్ఞతగా వర్జిన్ మేరీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో పాటు, తన అనారోగ్య చికిత్స కోసం మిగిలిన డబ్బును ఖర్చు చేశారు. ఏది ఏమైనా సెలాక్ జీవితం సినిమా కథలను మించిన అద్భుతం అనడంలో సందేహం లేదు.
