Numerology: లేటుగా వచ్చినా లేటెస్ట్ గా వస్తారు.. ఈ 4 నంబర్ల వారికి 35 ఏళ్ల తర్వాతే అసలైన పండగ!
కొందరికి చిన్న వయసులోనే అదృష్టం తలుపు తడుతుంది. కానీ మరికొందరు ఎంత కష్టపడినా గుర్తింపు కోసం ఏళ్ల తరబడి వేచి చూడాల్సి వస్తుంది. సంఖ్యాశాస్త్రం ప్రకారం.. ఈ తేదీల్లో పుట్టిన వారికి 35 ఏళ్ల తర్వాతే అసలైన 'రాజయోగం' మొదలవుతుందట. ఇక వీరికి పాత రోజులకు గుడ్ బై చెప్పాల్సిన టైమ్ ఆసన్నమైంది. మరి ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.

విజయం ఆలస్యంగా వస్తే ఆ కిక్కే వేరు. ముఖ్యంగా కొన్ని ప్రత్యేక సంఖ్యల ప్రభావం ఉన్న వ్యక్తులు జీవితం ప్రథమార్థంలో ఎన్నో సవాలు ఎదుర్కొంటారు. అయితే 35 ఏళ్లు దాటాక వీరికి తిరుగులేని ఆర్థిక ఎదుగుదల, సామాజిక హోదా లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు. జీవితంలో గెలుపు ఎప్పుడు వస్తుందనేది వ్యక్తి శ్రమతో పాటు పుట్టిన తేదీపై కూడా ఆధారపడి ఉంటుందని సంఖ్యాశాస్త్ర నిపుణులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా 3, 4, 8, 9 అంకెల ప్రభావం ఉన్నవారు 35 ఏళ్ల తర్వాతే అద్భుత ఫలితాలు సాధిస్తారని చెబుతున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..
సృజనాత్మకతతో ‘3’ 3, 12, 21, 30 తేదీల్లో జన్మించిన వారికి సహజంగానే తెలివితేటలు మెండుగా ఉంటాయి. కళాత్మక నైపుణ్యాలు ఉన్నా.. కెరీర్ ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. అనుభవం పెరిగే కొద్దీ అంటే 35 ఏళ్లు దాటాక వీరి ప్రతిభకు తగిన గుర్తింపు వస్తుంది. అప్పుడు లభించే విజయం సుస్థిరంగా ఉంటుంది.
పరిశోధనతో ‘4’ 4, 13, 22 తేదీల్లో పుట్టిన వారిపై కేతువు ప్రభావం ఉంటుంది. వీరు వృత్తి జీవితం మొదట్లో కొంత అయోమయానికి గురవుతారు. లోతైన ఆలోచనలు, నిరంతర పరిశోధనల వల్ల వీరికి ఆలస్యంగా గొప్ప అవకాశం దక్కుతుంది. 35 ఏళ్ల తర్వాతే వీరి వినూత్న ఆలోచనలను ప్రపంచం గుర్తిస్తుంది.
క్రమశిక్షణతో ‘8’ 8, 17, 26 తేదీల్లో పుట్టిన వారిని శని పాలిస్తాడు. వీరికి కష్టం కొత్త కాదు. 20 ఏళ్ల వయసులో ఎన్ని ఆటంకాలు వచ్చినా పట్టుదలతో పని చేస్తే.. 35 ఏళ్లు దాటాక కోరుకున్న స్థాయికి చేరుకుంటారు. క్రమశిక్షణే వీరిని విజేతలుగా నిలబెడుతుంది.
మానవత్వంతో ‘9’ 9, 18, 27 తేదీల్లో జన్మించిన వారు సమాజం కోసం ఏదైనా చేయాలని తపిస్తారు. వీరు సాధించే విజయాలు సమాజంపై బలమైన ముద్ర వేస్తాయి. కొంచెం ఆలస్యమైనా వీరి పేరు ప్రఖ్యాతులు చిరకాలం నిలుస్తాయి.
కాబట్టి, ప్రస్తుతానికి సక్సెస్ దక్కలేదని బాధపడకుండా ప్రయత్నం కొనసాగించండి. ఈ సంఖ్యల ప్రభావంతో మీకు ముందు ముందు మంచి రోజులు ఉన్నాయి.
గమనిక: ఈ కథనంలోని అంశాలు కేవలం సంఖ్యాశాస్త్ర నిపుణుల విశ్లేషణలు, నమ్మకాలపై ఆధారపడి ఇచ్చినవి మాత్రమే. వీటిని పాటించే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించగలరు.
