Hyderabad Metro: మెట్రో ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. ఇక టికెట్ బుకింగ్ మరింత ఈజీ..!
మెట్రోలో టిక్కెట్లు తీసుకోవడం పెద్ద టాస్క్‌గా మారింది. ఫోన్ పే సదుపాయం ఉన్నా.. కొన్ని సందర్భాల్లో అది పనిచేయక లైన్లో నిలబడలేక ఇబ్బందులు పడుతుంటారు. అయితే ఇలాంటి వాటికి చెక్ పెట్టింది హైదరాబాద్ మెట్రో.. ఇకపై గూగుల్ ద్వారానే టికెట్ తీసుకునే సదుపాయాన్ని తీసుకొచ్చింది.
హైదరాబాద్ మెట్రోలో ప్రతిరోజు 5 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు.. అయితే టికెట్లు తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా రద్దీ సమయాల్లో ఈ పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారింది. మెట్రో ప్రయాణికులకు డిజిటల్ టెక్నాలజీని అందిపుచ్చుకొని మరింత వేగవంతమైన సేవలను అందించేందుకు ఎల్ అండ్ టీ మెట్రో సంస్థ గూగుల్ వాలెట్ టికెటింగ్ విధానాన్ని తీసుకొచ్చింది. ఆర్‌సీఎస్ చాట్‌తో మెట్రో టికెట్స్ కొనుగోలు చేయడానికి గూగుల్ వాలెట్ ద్వారా స్కాన్ చేసే వీలు కల్పిస్తున్నారు. ఈ కొత్త గూగుల్ వ్యాలెట్ టికెటింగ్ సర్వీస్‌ను మెట్రో ఎన్వీఎస్ రెడ్డి లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ మెట్రోకు పెరుగుతున్న ప్రయాణికుల తాకిడి నేపథ్యంలో ఈ టికెటింగ్ విధానం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఎలాంటి యాప్ అవసరం లేకుండా గూగుల్ వ్యాలెట్ ద్వారా ఒక్క మెసెజ్‌తో మెట్రో టికెట్స్ బుక్ చేసుకొవచ్చని తెలిపారు.
బీల్ ఈజీ, రూట్ మొబైల్ లిమిటెడ్ సంస్థలు సంయుక్తంగా హైదరాబాద్ మెట్రో సంస్థతో కలిసి ఈ యూనిక్ టికెటింగ్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు సంస్థ ప్రతినిధులు.. ముందుగా గూగుల్ లెన్స్‌లోకి వెళ్లి స్కాన్ చేయాల్సి ఉంటుంది. అనంతరం లింక్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన లింక్ ద్వారా మెట్రోలో ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేయాలని అనేది మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది.. ఈ టికెట్ 15 నిమిషాలు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం ఫోన్ పే ద్వారా మెట్రో టికెట్లను తీసుకుంటున్నారు ప్రయాణికులు.. అయితే ఈ సిస్టం అందుబాటులోకి వస్తే చాలా సులభంగా ఎలాంటి యాప్ లేకుండా టికెట్లను పొందే సౌలభ్యం ప్రయాణికులకు ఉంటుంది. నూతన టెక్నాలజీతో ప్రయాణికులు మరింత సౌలభ్యంగా మెట్రోలో ప్రయాణించే అవకాశం లభిస్తుంది.