AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ASMI Machine Pistol: అమెరికా ఆంక్షలకు కౌంటర్.. ఇండియన్ ఆర్మీ చేతికి స్వదేశీ మిషన్ పిస్టళ్లు

Indian Army: 'ఆత్మనిర్భర్ భారత్' నినాదంతో విదేశాలపై ఆధారపడకుండా స్వయం సమృద్ధి సాధించాలన్న తపనతో ముందుకెళ్తున్న కేంద్ర ప్రభుత్వం.. రక్షణ రంగంలోనూ స్వదేశీ పరిశోధనలకు ప్రోత్సాహం కల్పిస్తోంది. ఈ క్రమంలో డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) సహకారంతో భారత సైన్యానికి చెందిన కల్నల్ ప్రసాద్ బన్సోద్ ఓ సరికొత్త ఆయుధాన్ని అభివృద్ధి చేశారు. హైదరాబాద్‌కు చెందిన లోకేష్ మెషిన్ కంపెనీ దీన్ని తయారు చేస్తోంది. ఆ ఆయుధం పేరే 'అస్మి' (ASMI) మెషీన్ పిస్టల్.

ASMI Machine Pistol: అమెరికా ఆంక్షలకు కౌంటర్.. ఇండియన్ ఆర్మీ చేతికి స్వదేశీ మిషన్ పిస్టళ్లు
Asmi Machine Pistol
Mahatma Kodiyar
| Edited By: Janardhan Veluru|

Updated on: Nov 06, 2024 | 12:20 PM

Share

భారత రక్షణ బలగాల అమ్ములపొదిలో మరో బలమైన ఆయుధం చేరింది. అధునాతన ఆయుధం అనగానే విదేశాలే మనకు గుర్తుకొస్తాయి. అమెరికా, ఇజ్రాయిల్, రష్యా, ఫ్రాన్స్, జర్మనీ.. ఇలాంటి దేశాల పేర్లే మదిలో మెదులుతాయి. కానీ ఇప్పుడు భారత ఆర్మీ చేతిలోకి వచ్చిన ఈ ఆయుధాన్ని పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చేశారు. ‘ఆత్మనిర్భర్ భారత్’ నినాదంతో విదేశాలపై ఆధారపడకుండా స్వయం సమృద్ధి సాధించాలన్న తపనతో ముందుకెళ్తున్న కేంద్ర ప్రభుత్వం.. రక్షణ రంగంలోనూ స్వదేశీ పరిశోధనలకు ప్రోత్సాహం కల్పిస్తోంది. ఈ క్రమంలో డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) సహకారంతో భారత సైన్యానికి చెందిన కల్నల్ ప్రసాద్ బన్సోద్ ఓ సరికొత్త ఆయుధాన్ని అభివృద్ధి చేశారు. హైదరాబాద్‌కు చెందిన లోకేష్ మెషిన్ కంపెనీ దీన్ని తయారు చేస్తోంది. ఆ ఆయుధం పేరే ‘అస్మి’ (ASMI) మెషీన్ పిస్టల్.

అనేక రంగాల్లో ప్రపంచ అగ్రరాజ్యాలకు ధీటుగా ఎదుగుతున్న భారతదేశం, రక్షణ రంగంలోనూ స్వయం సమృద్ధిని సాధించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇండియన్ ఆర్మీని మరింత హైటెక్‌గా తీర్చిదిద్దేందుకు ఒక పెద్ద ముందడుగు వేసింది. ఆర్మీ తన నార్తర్న్ కమాండ్‌లో 550 ‘అస్మి’ మెషిన్ పిస్టల్స్‌ను చేర్చింది. జమ్ము-కాశ్మీర్ సహా అనేక సమస్యాత్మక సరిహద్దుల బాధ్యతల్ని పర్యవేక్షించే నార్తర్న్ కమాండ్ నిత్యం ఉగ్రవాదులతో పోరాటం చేస్తోంది. ఈ క్రమంలో వారికి ఈ ఆయుధం మరింత బలాన్ని ఇస్తోంది.

భారత ఆర్మీ చేతిక అస్మీ మిషన్ పిస్టల్స్

నమ్మదగిన చిన్న ఆయుధం

‘ASMI’ మెషిన్ పిస్టల్ ఒక దృఢమైన, కాంపాక్ట్ ఆయుధం. షార్ట్ రేంజ్ షూటింగ్‌లో ఇది చాలా ఉపయోగకరం. ముఖ్యంగా ఉగ్రవాదులకు వ్యతిరేకంగా జరిపే ఆపరేషన్లు, ఎన్‌కౌంటర్లలో ఇలాంటి ఆయుధాలు జవాన్లకు మరింత బలాన్ని అందిస్తాయి. ఉగ్రవాదులకు వ్యతిరేకంగా జరిగే ఆపరేషన్లకు ఇలాంటి చిన్న మెషిన్ పిస్టల్స్ చాలా అవసరం. ఇది 100 మీటర్ల వరకు ఖచ్చితంగా గురి పెట్టగలదు. దీని హై-కెపాసిటీ మ్యాగజీన్‌లో 33 బుల్లెట్లను లోడ్ చేయవచ్చు. టెలిస్కోప్, లేజర్ లైట్, బైనాక్యులర్‌లను దానిపై సులభంగా అమర్చవచ్చు. కమెండో ఆపరేషన్లను ఇది మరింత సులభం చేస్తుంది. ఈ మెషిన్ పిస్టల్ యొక్క లోడింగ్ స్విచ్ రెండు వైపులా ఉంటుంది. తద్వారా ఎడమచేతివాటం జవాన్లు కూడా దీన్ని ఉపయోగించవచ్చు. దీని ప్రత్యేకమైన సెమీ-బుల్‌పప్ డిజైన్ కారణంగా పిస్టల్ మాదిరిగానూ ఉపయోగించవచ్చు, అవసరమైతే సబ్‌మెషిన్ గన్‌గా మార్చుకుని ఒకే చేతితో కాల్పులు జరపవచ్చు. యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్లలో నిమగ్నమయ్యే నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ (NSG), అస్సాం రైఫిల్స్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) వంటి బలగాలకు ఈ ఆయుధం ఉపయోగకరంగా మారనుంది.

ఉగ్రవాదులపై ఆపరేషన్లలో మాత్రమే కాదు, సాయుధ బలగాల ఇతర ఆపరేషన్లకు కూడా దీన్ని అనువుగా మార్చుకునే వెసులుబాటు దీనికి ఉంది. పిస్టల్‌కి ఉన్న 8 ఇంచుల బట్ మడుచుకునే వెసులుబాటు కారణంగా ఆయుధం పరిమాణాన్ని పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు. తద్వారా భుజంపై పెట్టుకుని రైఫిల్ మాదిరిగానూ ఉపయోగించవచ్చు. లేదా ఒక చేతితో ఉపయోగించే పిస్టల్ మాదిరిగానూ మార్చుకోవచ్చు. నార్తర్న్ కమాండ్‌లోని పట్టణ ప్రాంతాల్లో ఉగ్రవాదులకు వ్యతిరేకంగా నిర్వహించే ఆపరేషన్లకు ఇది ఒక ఉత్తమ ఆయుధంగా మారుతుందని సైనికవర్గాలు భావిస్తున్నాయి. నూటికి నూరుపాళ్లు మేడ్-ఇన్-ఇండియా ఆయుధమైన ‘అస్మి’ మెషీన్ పిస్టల్ రక్షణ రంగంలో దేశాన్ని స్వావలంబన దిశగా తీసుకెళ్లేందుకు కీలకంగా మారనుంది.

అస్మి తయారీ హైదరాబాద్‌లోనే..

అస్మి మెషీన్ పిస్టళ్లు హైదరాబాద్‌లోనే తయారవుతున్నాయి. 1983లో హైదరాబాద్‌లో ఏర్పాటైన ‘లోకేష్ మెషీన్స్ లిమిటెడ్’ సంస్థ వీటిని తయారు చేస్తోంది. ఈ సంస్థ తాజాగా అమెరికా ఆంక్షలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ సంస్థ తయారు చేస్తున్న మెషీన్ టూల్స్ రష్యాకు ఎగుమతి అవుతున్నాయి. ఈ కారణంగా అమెరికా ఆంక్షలు విధించడంతో లోకేష్ మెషీన్స్ లిమిటెడ్ వార్తల్లో నిలిచింది. అయితే అమెరికా ఆంక్షలు విధించిన కొద్ది రోజుల్లోనే ఇండియన్ ఆర్మీ అస్మి (ASMI) మెషీన్ పిస్టళ్లను సమకూర్చుకునేందుకు నిర్ణయం తీసుకుంది. తద్వారా రూ. 4.26 కోట్ల విలువైన ఆర్డర్‌ను లోకేష్ మెషీన్స్ లిమిటెడ్ సంస్థ పొందింది.

ఈ మెషీన్ పిస్టల్‌ను ఎంపికచేసే క్రమంలో ఇండియన్ ఆర్మీ ఇంజ్రాయిల్‌కు చెందిన Uzi తరహా పిస్టళ్లను, జర్మనీకి చెందిన హెక్లర్, కోచ్ MP5 తరహా పిస్టళ్లను పరిశీలించింది.

మరిన్ని జాతీయ వార్తలు చదవండి..