Telangana: హైడ్రా భవన నిర్మాణాలకు అనుమతులు ఇవ్వదు.. ఆందోళన చెందకండి: భట్టి విక్రమార్క

బ్యాంకర్ల సమావేశంలో హైడ్రాపై కీలక వ్యాఖ్యలు చేశారు తెలంగాణ డిప్యూటీ సీఎం. భవన నిర్మాణాలకు ఇబ్బందులు లేవని, లోన్లు ఇచ్చేందుకు ఎటువంటి అనుమానాలు అక్కర్లేదన్నారు. అలాగే.. గ్రామీణ ప్రాంతాల్లో మహిళా సంఘాలకు సహకరించాలన్నారు భట్టి విక్రమార్క..

Telangana: హైడ్రా భవన నిర్మాణాలకు అనుమతులు ఇవ్వదు.. ఆందోళన చెందకండి: భట్టి విక్రమార్క
Telangana Deputy CM Bhatti Vikramarka
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Nov 06, 2024 | 9:17 PM

బ్యాంకర్లు హైడ్రా గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. హైడ్రా భవనాల నిర్మాణాలకు అనుమతులు ఇవ్వదని తెలిపారు. ప్రజాభవన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన బ్యాంకర్ల సమావేశంలో భట్టి విక్రమార్క మాట్లాడారు. జిహెచ్ఎంసి, టౌన్ ప్లానింగ్ లాంటి ప్రభుత్వ విభాగాలు అన్ని అంశాలు పరిశీలించి నిర్మాణాలకు అనుమతులు ఇస్తాయని, ఏ ప్రభుత్వమైనా వీటిని కొనసాగిస్తుందని డిప్యూటీ సీఎం చెప్పారు. హైడ్రా సెక్యూరిటీ, ట్రాఫిక్ నియంత్రణ, పార్కులు, చెరువులు అక్రమణలు చూస్తుందని తెలిపారు భట్టి విక్రమార్క..

స్వయం సహాయక సంఘాలకు ఈ ఏడాది 20వేల కోట్ల వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని నిర్ణయించామని.. వీలైతే అంతకుమించి వడ్డీ లేని రుణాలు ఇస్తామని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. బ్యాంకర్లు సామాజిక బాధ్యతతో పనిచేయాలని, రుణాలు ఇచ్చేందుకు నిబంధనలు సరళతరం చేయాలని కోరారు. స్వయం సహాయక సంఘాలకు ఇచ్చిన రుణాల రికవరీ 98 శాతానికి పైగా ఉందని.. బ్యాంకర్లు మహిళా సంఘాలకు తక్కువ వడ్డీతో.. ఎక్కువ మొత్తంలో రుణాలు ఇవ్వాలని సూచించారు. గిరిజన ప్రాంతాల్లోని సంఘాలు దాదాపు 200 కోట్ల వరకు రుణాలు చెల్లించలేని పరిస్థితిలో ఉన్నారని.. వాటిని మాఫీ చేయడం లేదంటే వన్ టైం సెటిల్మెంట్ చేసే అవకాశాన్ని పరిశీలించాలని కోరారు.

సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలకు బ్యాంకర్లు సహకరిస్తే.. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి, ఆర్థిక అభివృద్ధికి అవకాశం ఏర్పడుతుందన్నారు భట్టి విక్రమార్క. హైదరాబాదులో 3వేల కోట్ల వడ్డీ లేని రుణాలు మహిళలకు ఇవ్వాలని నిర్ణయించామన్నారు డిప్యూటీ సీఎం. వాటిని ఐదు వేల కోట్లకు తీసుకువెళ్లాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. తెలంగాణను గొప్ప రాష్ట్రంగా, ప్రోగ్రెసివ్ స్టేట్‌గా ముందుకు తీసుకువెళ్లాలనుకుంటున్నామని ఇందుకు బ్యాంకర్లు సహకరించాలన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..