Ganesh Immersion: దారులన్నీ సాగర్ వైపే.. ఖైరతాబాద్ మహా గణేష్ నిమజ్జనం షెడ్యూల్ ఇదే.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్ వ్యాప్తంగా రేపు గణనాథుల నిమజ్జనం ఉండనుంది. ఖైరతాబాద్ మహా గణపతి, బాలాపూర్ గణేషుడి విగ్రహాలను హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేయనున్నారు. దానికి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. గ్రేటర్ పరిధిలో గణేశ్ నిమజ్జనం కోసం దాదాపుగా 25 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్యాంక్ బండ్ సహా నగరంలో ఉన్న ఇతర అన్ని..
హైదరాబాద్ వ్యాప్తంగా రేపు గణనాథుల నిమజ్జనం ఉండనుంది. ఖైరతాబాద్ మహా గణపతి, బాలాపూర్ గణేషుడి విగ్రహాలను హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేయనున్నారు. దానికి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. గ్రేటర్ పరిధిలో గణేశ్ నిమజ్జనం కోసం దాదాపుగా 25 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్యాంక్ బండ్ సహా నగరంలో ఉన్న ఇతర అన్ని చెరువుల వద్ద ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. రేపు ఉదయం నుంచి గణేష్ నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా మొత్తం 64 చోట్ల ట్రాఫిక్ డైవర్షన్స్ ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. ట్యాంక్ బండ్ దగ్గర 8 చోట్ల పార్కింగ్ సదుపాయం కల్పించారు. రేపు ఉదయం 7 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 8 గంటల వరకు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయంటున్నారు పోలీసులు. రేపు మధ్యాహ్నం ఒంటిగంటకు ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం జరగనుంది. ఇవాళ్టి నుంచి ఖైరతాబాద్ గణేష్ తరలింపుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు సాయంత్రం 4గంటల్లోపు బాలాపూర్ గణేష్ నిమజ్జనం జరిగేలా చూస్తామంటున్నారు పోలీసులు. రేపు హైదరాబాద్‌లో అన్ని దారులు సాగర్ వైపే దారి తీస్తాయి.
బాలాపూర్‌లో గుర్రం చెరువు ట్యాంక్‌పై కట్టమైసమ్మ ఆలయం దగ్గర గణేష్ విగ్రహాల ప్రధాన ఊరేగింపు ప్రారంభమై హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోకి ప్రవేశిస్తుంది. కేశవగిరి, చాంద్రాయణగుట్ట ఫ్లైఓవర్, ఎంబీఎన్‌ఆర్ ఎక్స్ రోడ్, ఫలక్‌నుమా రైల్వే ఓవర్ బ్రిడ్జ్, ఆలియాబాద్, చార్మినార్, మదీనా, అఫ్జల్‌గంజ్, మొజంజాహి మార్కెట్, అబిడ్స్ ఎక్స్ రోడ్, బషీర్‌బాగ్, లిబర్టీ జంక్షన్, ఎన్టీఆర్ మార్గ్, పీవీఎన్‌ఆర్ మార్గ్‌లో హుస్సేన్ సాగర్‌ని చేరుకుంటుంది. మిగిలిన ఊరేగింపులన్నీ వచ్చి ఈ ప్రధాన ఊరేగింపులో కలుస్తాయి.
సికింద్రాబాద్ నుంచి వచ్చే వినాయక విగ్రహ ఊరేగింపులు సంగీత్ థియేటర్, ప్యాట్నీ, ప్యారడైజ్ జంక్షన్, ఎంజీ రోడ్డు, కర్బలా మైదాన్, ట్యాంక్‌బండ్ మీదుగా నెక్లెస్ రోడ్డుకు వెళ్లనున్నాయి. చిలకలగూడ నుంచి వచ్చే విగ్రహాలు గాంధీ ఆసుపత్రి, ఆర్టీసీ క్రాస్ రోడ్, నారాయణగూడ ఫ్లైఓవర్, వై.జంక్షన్, హిమాయత్‌నగర్ నుంచి లిబర్టీ వైపు వెళ్తాయి. ఉప్పల్ నుంచి వచ్చే గణేష్ ఊరేగింపులు రామంతాపూర్, శ్రీ రమణ జంక్షన్, ఛే నంబరు, తిలక్‌నగర్, ఓయూ ఎన్‌సీసీ గేట్, విద్యానగర్ జంక్షన్, ఫీవర్ ఆస్పత్రి, బర్కత్‌పుర జంక్షన్ మీదుగా వెళ్తాయి. ఆ ఊరేగింపులు నారాయణగూడ వైఎంసీఏకి చేరుకొని, ఆర్టీసీ క్రాస్ రోడ్డు నుంచే వచ్చే ఊరేగింపుతో కలవనుంది.
దిల్‌సుఖ్‌నగర్ నుంచి వచ్చే గణేష్ విగ్రహాలు ఐఎస్ సదన్, సైదాబాద్, చంచల్‌గూడ ఉంచి వచ్చే ఊరేగింపుతో నల్గొండ ఎక్స్ రోడ్డులో కలవనుంది. తార్నాక వైపు వచ్చే విగ్రహాలు ఉస్మానియా విశ్వవిద్యాలయం దూర విద్యాకేంద్రం రోడ్డు, అడిక్‌మెట్ వైపు వెళ్లి విద్యానగర్ మీదుగా ఫీవర్ ఆసుపత్రి వద్దకు చేరుకోనున్నాయి. టోలిచౌకి, రేతిబౌలి, మోహిదీపట్నం వైపు నుంచి వచ్చే గణేష్ విగ్రహాలు మాసబ్‌ట్యాంక్, అయోధ్య జంక్షన్, నిరంకారి భవన్, ద్వారకా హోటల్ జంక్షన్, ఇక్బాల్ మినార్ మీదుగా ఎన్టీఆర్ మార్గ్‌కు వెళ్లనున్నాయి. ఎర్రగడ్డ నుంచి వచ్చే విగ్రహాలు ఎస్‌ఆర్ నగర్, అమీర్‌పేట్, పంజాగుట్ట, ఖైరతాబాద్ మీదుగా మోహిదీపట్నం నుంచి వచ్చే ఊరేగింపు నిరంకారి భవన్ వద్ద చేరి, ఎన్టీఆర్ మార్గ్ వరకు వెళ్లనున్నాయి.
టప్పాచబుత్ర, ఆసిఫ్‌నగర్ ప్రాంతాల నుంచి వచ్చే గణేష్ విగ్రహాలు సీతారాంబాగ్, బోయిగూడ కమాన్, వోల్గా హోటల్ ఎక్స్‌రోడ్, గోషామహల్, మీదుగా వెళ్లి ఎంజేఎం దగ్గర ప్రధాన ఊరేగింపులో కలుస్తాయి. ఊరేగింపు కొనసాగే మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. ప్రజలు అందుకు అనుగుణంగా తమ ప్రయాణ మార్గాన్ని నిర్దేశించుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.
ఇక ట్యాంక్ బండ్ పై గణేష్ నిమజ్జనం పై నిషేధాజ్ఞలను ప్రభుత్వం ఎత్తేసింది. నిమజ్జనం కోసం బడా బడా క్రేన్లను రంగంలోకి దింపింది. దీనిపై మరిన్ని వివరాలు మా సీనియర్ కరస్పాండెంట్ లక్ష్మీకాంత్ అందిస్తారు. ఇక అందరిచూపు ఖైరతాబాద్ బడా గణేష్ మీదే ఉంది. బడా గణేష్ దగ్గర తొలగింపు పనులు ప్రారంభమయ్యాయి. రేపు తెల్లవారుజాము 4 గంటలకు టస్కర్‌పైకి గణనాథుడు చేరుతాడు.
ఊరేగింపు ఇలా..
ఉదయం 6 గంటల నుంచి బడా గణేష్ శోభాయాత్ర కొనసాగనుంది. ఖైరతాబాద్, సైదాబాద్, ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్ మార్గ్ ద్వారా ట్యాంక్‌బండ్‌కు తరలించనున్నారు. క్రేన్ నెంబర్ 4 దగ్గరకు మహాగణపతి రానుంది. సుమారు ఏడు గంటలపాటు నిమజ్జన ఘట్టం కొనసాగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు నిమజ్జనం పూర్తి అయ్యేలా పోలీసులు చర్యలు చేపడుతున్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు సిబ్బంది భారీ భద్రత ఏర్పాటు చేసింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి