Telangana BJP: రూట్ మ్యాప్ సిద్ధం.. గెలుపే లక్ష్యంగా తెలంగాణ బీజేపీ భారీ స్కెచ్..
స్కెచ్ వేస్తే పక్కాగా ఉండాలి.. ప్రణాళిక రచిస్తే సక్సెస్ దరి చేరాలి. రాజకీయాలకు ఇదేం అతీతం కాదు. పార్టీల పక్కా వ్యూహాలు ఇలానే ఉంటాయి. ప్రచారం మొదలెడితే కేడర్‌లో జోష్ ఉండాలి. పంచ్‌లు, ప్రాసల ఉపన్యాసాలు ఇస్తే జనాలతో ఓట్లు వేయించాలి. ఓవరాల్‌గా విజయతీరాలు చేరాలి.
స్కెచ్ వేస్తే పక్కాగా ఉండాలి.. ప్రణాళిక రచిస్తే సక్సెస్ దరి చేరాలి. రాజకీయాలకు ఇదేం అతీతం కాదు. పార్టీల పక్కా వ్యూహాలు ఇలానే ఉంటాయి. ప్రచారం మొదలెడితే కేడర్‌లో జోష్ ఉండాలి. పంచ్‌లు, ప్రాసల ఉపన్యాసాలు ఇస్తే జనాలతో ఓట్లు వేయించాలి. ఓవరాల్‌గా విజయతీరాలు చేరాలి. సార్వత్రిక ఎన్నికలకు పార్టీలు ఇంతలా ప్రచార వ్యూహాలకు పదును పెడుతున్నాయి. మరి తెలంగాణలో భారీ టార్గెట్ పెట్టుకున్న బీజేపీ ఎలా ముందుకెళ్తుందో.?
తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలకు అభ్యర్థుల ప్రకటించిన ఊపులోనే.. ప్రచార పర్వాన్ని రెట్టింపు ఉత్సాహంతో ముందుకు తీసుకెళ్తోంది భారతీయ జనతా పార్టీ. ఇప్పటికే ప్రధాని మోదీ, అమిత్ షా ప్రచార సభలు నిర్వహించగా.. ఎన్నికల కోడ్ రావడంతో పక్కా ప్రణాళికతో ప్రచార అస్త్రాలకు సానపెడుతోంది తెలంగాణ కమలదండు. ఎన్నికల ప్రచార వ్యూహల రూట్ మ్యాప్ సిద్ధం చేసి ప్రతీ గడపకు మోదీ నామాన్ని తీసుకెళ్లి విజయబావుట ఎగురవేయాలని సంకల్పంతో ముందుకెళ్తోంది. తెలంగాణ బీజేపీ ఎలక్షన్ క్యాంపెయిన్ కోసం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, పార్లమెంటరీ బోర్డు మెంబర్ లక్ష్మణ్ ఎప్పటికప్పుడు పార్టీ ఎన్నికల మేనేజ్‌మెంట్ కమిటీలతో రివ్యూలు చేస్తున్నారు. గడప గడపకు మోదీ పదేళ్ల సంక్షేమ పాలన తీసుకెళ్లడమే లక్ష్యంగా క్యాంపెయిన్ రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. రాష్ట్రంలో 30 వేలకు పైగా ఉన్న పోలింగ్ బూత్‌లకు 32 వేల బూత్ కమిటీలను ఏర్పాటు చేశారు.
ఇంచార్జ్ సహా 21 మందితో బూత్ కమిటీలను నియమించారు. ప్రతీ మూడు పోలింగ్ బూత్‌లను కలిపి శక్తి కేంద్రంగా ఏర్పాటు చేశారు. బూత్ లెవెల్‌లో ప్రతీ ఓటర్‌ను కలిసేలా కమిటీలకు దిశానిర్దేశం చేశారు. ప్రతీ మూడు కుటుంబాలకు ఒక ఇంచార్జ్‌ను నియమించడంతో పాటు 30 మంది ఓటర్లకు ఒక పన్నా ప్రముఖ్‌కు బాధ్యత అప్పగించారు. బీజేపీకి ఎన్నికల్లో కీలకమైన పన్నా ప్రముఖ్‌ల పాత్రను తెలంగాణలోనూ పటిష్టంగా వాడుకోవాలని చూస్తోంది. ఒక్కో పన్నా ప్రముఖ్ కనీసం 30 మంది ఓటర్లను కలిసి ఓటు వేయించేలా బాధ్యతలు అప్పగించారు. ప్రతీ ఇంటికి మోదీ చేసిన సంక్షేమ పథకాలను తీసుకెళ్లాలని.. మోదీ మేనియా నేపథ్యంలో మోదీ నామస్మరణతో ప్రతీ గడప బీజేపీకి మద్దతు తెలిపేలా ప్రచారం చేయాలని దిశానిర్దేశం చేశారు.
క్షేత్రస్థాయి పర్యటనలతో పాటు ప్రధాని మోదీ, కేంద్ర హెూంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయాధ్యక్షుడు నడ్డాలతో భారీ బహిరంగ సభలు, రోడ్ షోలు నిర్వహించి ప్రచారాన్ని మరింత హెూరెత్తించాలని భావిస్తోంది. తెలంగాణలో ఎన్నికలకు దాదాపు 55 రోజుల సమయం ఉండటంతో ప్రతీ గ్రామానికి ప్రతీ ఇంటికి రీచ్ అవడానికి సమయం ఉందని బీజేపీ అభ్యర్థులు భావిస్తున్నారు. ప్రతీ వర్గాన్ని కలిసి దేశంలో స్థిరమైన మోదీ సర్కార్‌కు మరోసారి అవకాశం ఇవ్వాలని నేతలు కోరనున్నారు. తెలంగాణలో గత బీఆర్ఎస్ పాలనతో విసిగిపోయిన ప్రజలు.. ప్రస్తుత కాంగ్రెస్ పాలనను నమ్మే పరిస్థితి లేదని.. ఆరు గ్యారంటీలు వంద రోజుల్లో అమలు చేయలేకపోయిన కాంగ్రెస్‌కు ఓటు వేస్తే దండగ అంటూ బీజేపీ విమర్శనాస్త్రాలను ఎక్కు పెట్టనుంది.