AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తుఫాన్ ప్రభావం.. తెలుగు రాష్ట్రాలకు హెచ్చరిక.. ఈ జిల్లాలకు భారీ వర్షాలు.!

మొన్నటి వరకు విపరీతమైన ఎండలు. ఆ వేసవి తాపానికి జనాలంతా ఎలా అల్లాడిపోయారో మనం చూశాం. ఇప్పుడిప్పుడే మెల్లగా వర్షాలు మొదలయ్యాయి. ముందుకన్నా కొంచెం పరిస్థితి మెరుగుపడింది. ఎండలతో ఉక్కిరిబిక్కిరైన జనానికి కాస్త ఇప్పుడే ఉపశమనం దొరికింది. రెమాల్ తుఫాన్ వల్ల..

తుఫాన్ ప్రభావం.. తెలుగు రాష్ట్రాలకు హెచ్చరిక.. ఈ జిల్లాలకు భారీ వర్షాలు.!
Rains In Ap
Noor Mohammed Shaik
| Edited By: |

Updated on: May 27, 2024 | 10:00 AM

Share

మొన్నటి వరకు విపరీతమైన ఎండలు. ఆ వేసవి తాపానికి జనాలంతా ఎలా అల్లాడిపోయారో మనం చూశాం. ఇప్పుడిప్పుడే మెల్లగా వర్షాలు మొదలయ్యాయి. ముందుకన్నా కొంచెం పరిస్థితి మెరుగుపడింది. ఎండలతో ఉక్కిరిబిక్కిరైన జనానికి కాస్త ఇప్పుడే ఉపశమనం దొరికింది. రెమాల్ తుఫాన్ వల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే.. ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. నాగర్‌కర్నూలు జిల్లాలో ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. దాంతో.. నాగర్‌కర్నూలు జిల్లాలోనే ఏడుగురు మృతి చెందారు. తాడూరు శివారులో రేకుల షెడ్డు కూలి నలుగురు ప్రాణాలు కోల్పోగా.. ఇద్దరు పిడుగుపాటుకు గురయ్యారు. మరొకరు ఈదురుగాలులకు ఇటుక రాయి కారుపై ఎగిరిపడడంతో అద్దం గుచ్చుకొని చనిపోయారు. వికారాబాద్ జిల్లాలోని పలు మండలాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం ప్రజల్ని భయపెట్టింది. గాలి దుమారానికి ఇంటిపైనున్న రేకులు కొట్టుకుపోయాయి. ధారూర్ మండలంలో విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరగడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో మరోసారి భారీ వర్షం పడింది. ప్రధానంగా.. హైదరాబాద్‌ శివారు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. పెద్దఅంబర్‌పేట్‌, హయత్‌నగర్‌, వనస్థలిపురం, ఎల్బీనగర్‌, సరూర్‌నగర్‌, దిల్‌సుఖ్‌నగర్, ఉప్పల్‌, నాచారం, హబ్సిగూడలో వర్షం కురిసింది. కీసర, ఘట్‌కేసర్ మండలాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. హైదరాబాద్ వనస్థలిపురంలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కారణంగా పెద్దపెద్ద చెట్లు కూలిపోయాయి. ఇక.. షామీర్‌పేటలో గాలి దుమారానికి చెట్టు విరిగి పడడంతో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. భారీ వర్షం, చెట్లు విరిగిపడడంతో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది.

అటు.. రెమాల్‌ తీవ్ర తుఫాన్‌ ప్రభావం ఏపీపై పెద్దగా లేనప్పటికీ.. పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. నంద్యాల జిల్లా శ్రీశైలంలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. దాంతో.. శ్రీశైలం ఆలయ ప్రాంగణంలోని రేకుల షెడ్డుల కింద ఉన్న భక్తులు పరుగులు తీశారు. ఇక.. తీవ్ర తూఫాన్‌ ఎఫెక్ట్‌తో సముద్రం మాత్రం అల్లకల్లోలంగా మారింది. కాకినాడ జిల్లా ఉప్పాడ తీరంలో అలలు భయపెడుతున్నాయి. సుబ్బంపేట నుంచి ఎస్పీజీఎల్ వరకు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. వాహనదారులను కెరటాలు ముంచెత్తుతుండడంతో బీచ్ రోడ్డులో రాకపోకలు నిలిపివేశారు. అటు.. రెమాల్ తుఫాన్‌ తీరం దాటే సమయంలో సముద్రం వెంబడి అలల ఉధృతి, ఈదురు గాలులు మరింత ఎక్కువ అయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలోనే.. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేసింది.