Telangana News: సైబర్ నేరస్తుల సరికొత్త ట్రాప్..నమ్మితే పెడతారు టోపీ..జర జాగ్రత్త లేకుంటే మీరు ఇలానే..
సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త మోసంతో ప్రజలకు బురిడి కొట్టిస్తున్నారు. అత్యసర పరిస్థితుల్లో ఉన్నామని తమ బ్యాంకు ఖాతా లేదా ఫోన్ పని చేయడం లేదని డబ్బు పంపాలంటూ వంచిస్తున్నారు. నమ్మకం కుదరకపోతే ఇంకో మిత్రుడి ఖాతా నుంచి డబ్బు బదిలీ చేస్తున్నామంటూ అచ్చం బ్యాంకుల తరహాలోనే డమ్మీ సందేశాలు పంపిస్తున్నారు
జనం డబ్బు కొల్లగొట్టేందుకు సైబర్ నేరగాళ్లు మరో కొత్త మోసంతో ముందుకొస్తున్నారు. బ్యాంకుల తరహాలో డబ్బు జమ చేసినట్లు డమ్మీ సందేశాలు పంపిస్తూ బోల్తా కొట్టిస్తున్నారు. అత్యసర పరిస్థితుల్లో ఉన్నామని తమ బ్యాంకు ఖాతా లేదా ఫోన్ పని చేయడం లేదని డబ్బు పంపాలంటూ వంచిస్తున్నారు. నమ్మకం కుదరకపోతే ఇంకో మిత్రుడి ఖాతా నుంచి డబ్బు బదిలీ చేస్తున్నామంటూ అచ్చం బ్యాంకుల తరహాలోనే డమ్మీ సందేశాలు పంపిస్తున్నారు. ఈ నకిలీ సందేశాలు చూసి డబ్బు నిజంగానే వచ్చిందని భావిస్తున్న కొందరు అవతలి వ్యక్తులు చెప్పిన ఖాతాకు తిరిగి పంపించి మోసపోతున్నారు. డబ్బులు పంపే ముందు తనిఖీ చేసుకోవాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
రంగారెడ్డి జిల్లాలోని శేరిలింగంపల్లికి చెందిన ప్రైవేటు ఉద్యోగికి ఇటీవల ఒకరు ఫోన్ చేసి కంపెనీలో సహోద్యోగినని తన వాళ్లు ఆసుపత్రిలో ఉన్నారని పరిచయం చేసుకున్నాడు. ఫోన్ సాంకేతిక సమస్యతో ఆసుపత్రి బిల్లు చెల్లించడం ఇబ్బంది అవుతోందని, కొంత డబ్బు కావాలని అడిగాడు. బదులుగా తన మిత్రుడు ఫోన్‌పే, గూగుల్‌పేకి డబ్బు పంపిస్తాడని చెప్పి 9 విడతల్లో రూ.3.74 లక్షలు బదిలీ చేయించాడు. డబ్బు ఖాతాలో జమ అయినట్లు సందేశాలు రావడంతో ప్రైవేటు ఉద్యోగి నిజమేనని మొత్తం రూ.3.74 లక్షలు తిరిగి పంపాడు. మరుసటిరోజు బ్యాంకు ఖాతాను తనిఖీ చేయగా రూ.3.74 లక్షలు జమవ్వలేదు. ఇదేంటని ఆరా తీయగా సందేశాలు నకిలీ అని.. అవతలి వ్యక్తి మోసం చేసినట్లు తేలింది. ఇలా సైబర్ నేరగాళ్లు ఏ ఒక్క అవాకాశాన్ని వదలడం లేదు. ఏ మాత్రం అప్రమత్తంగా లేకున్నా.. అందిన కాడికి దోచేస్తున్నారు. ఇటీవల హైదరబాద్ నగరంలో ఈ తరహా కేసులు పెరుగుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. బాధితులు కనీసం డబ్బు ఖాతాలో జమ చేసిందో లేదో కూడా చూసుకోవడం లేదని సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు. పదుల సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయని అపరిచిత వ్యక్తులు ఫోన్ చేస్తే నమ్మొద్దని వారు హెచ్చరిస్తున్నారు.