Rain Alert: వర్షాలే.. వర్షాలు.. దూసుకువస్తున్న దానా తుఫాన్.. ఈ ప్రాంతాల్లో కుండపోత.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్
పారాదీప్ (ఒడిశా)కి ఆగ్నేయంగా 700 కి.మీ., సాగర్ ద్వీపానికి (పశ్చిమ బెంగాల్) దక్షిణ ఆగ్నేయంగా 750 కి.మీ, ఖేపుపరా (బంగ్లాదేశ్)కి ఆగ్నేయంగా 730 కి.మీ. దూరంలో ఉన్న వాయుగుండం.. ఇవాళ దానా తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది.. దీని ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని తెలుగు రాష్ట్రాలకు అలర్ట్ జారీ చేసింది..
దానా తుఫాన్ దూసుకువస్తోంది.. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ లేటెస్ట్ బులెటిన్ విడుదల చేసింది.. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. దీని ప్రభావంతంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది. అయితే.. బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది.. గురువారం రాత్రి (అక్టోబర్ 24వ తేదీ రాత్రి – అక్టోబర్ 25 ఉదయం) శుక్రవారం ఉదయంలోపు ఉత్తర ఒడిశా-పశ్చిమ బెంగాల్ సమీపంలో పూరీ, సాగర్ ద్వీపం మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
పారాదీప్ (ఒడిశా)కి ఆగ్నేయంగా 700 కి.మీ., సాగర్ ద్వీపానికి (పశ్చిమ బెంగాల్) దక్షిణ ఆగ్నేయంగా 750 కి.మీ, ఖేపుపరా (బంగ్లాదేశ్)కి ఆగ్నేయంగా 730 కి.మీ. దూరంలో ఉన్న వాయుగుండం.. ఇవాళ దానా తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది.. గురువారం తీవ్ర తుపానుగా బలపడే అవకాశం ఉంది. అయితే, దానా తుఫానుతో ఒడిషా, పశ్చిమబెంగాల్‌లో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుఫాను తీరం దాటే సమయంలో గంటలకు 120 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచనున్నాయి. దీంతో ఉత్తరాంధ్ర, రాయలసీమలో హై అలర్ట్ కొనసాగుతోంది. దానా తుఫాన్ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం సైతం అలర్టయ్యింది.. దానా తుఫాన్ తో 24, 25 తేదీల్లో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
బుధవారం ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు..
బుధవారం కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రకాశం, నెల్లూరు, వైఎస్ఆర్, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.
తెలంగాణలో రెండు రోజుల పాటు వర్షాలు..
మరోవైపు తెలంగాణలో రాగల రెండు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
మత్య్సకారులకు అలర్ట్..
ఇప్పటికే వాయుగుండం ప్రభావంతో తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్లు వేగంతో గాలులు వీస్తున్నాయి.. మత్య్సకారులు వేటకు వెళ్లారాదని వాతవారణ శాఖ హెచ్చరించింది. అలాగే రాష్ట్రంలో అన్ని పోర్టులలో ఒకటవ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ అయ్యాయి..
పలు రైళ్లు సర్వీసులు రద్దు..
తుపాను ప్రభావంతో ఇప్పటికే పలురైళ్లను రద్దు చేశారు అధికారులు. ఎల్లుండి వరకు 66 సర్వీసులను రద్దుచేసినట్లు రైల్వే అధికారులు చెప్పారు.
వాయుగుండం ప్రభావంతో ఇప్పటికే ఏపీవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి చిత్తూరు, అనంతపురం, కృష్ణా, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాల్లో కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చెరువులు, వాగులు కట్టలు తెంచుకుని ఊళ్లను ముంచెత్తుతున్నాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..