AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రపంచంలో ఎక్కువ నీటిని వినియోగించే దేశం ఏదో తెలుసా?.. ఒక్కో వ్యక్తి ఎన్ని లీటర్లు వాడుతారంటే?

సాధారణంగా మనం మన అవసరాల కోసం ఒక రోజు మొత్తంలో ఎంత నీటిని వాడుతాం 30-40 లీటర్లు ఉండొచ్చు. కానీ ఇక్కడో దేశంలో మాత్రం సగటున ఓ వ్యక్త దాదాపు 15వేలకుపైగా లీటర్ల నీటిని వినియోగిస్తారట. దీంతో ప్రపంచంలో సగటున ఒక వ్యక్తి ఏకంగా 15,445 లీటర్ల నీటిని ప్రతిరోజూ వాడే దేశంగా తుర్క్మెనిస్తాన్ మొదటి స్థానంలో నిలిచింది. నీటి వినియోగంపై ప్రపంచవ్యాప్తంగా జరిగిన తాజా అధ్యయనంలో ఈ దిగ్భ్రాంతికరమైన విషయం వెలుగులోకి వచ్చింది.

ప్రపంచంలో ఎక్కువ నీటిని వినియోగించే దేశం ఏదో తెలుసా?.. ఒక్కో వ్యక్తి ఎన్ని లీటర్లు వాడుతారంటే?
Turkmenistan Water Consumption
Rakesh Reddy Ch
| Edited By: |

Updated on: May 20, 2026 | 10:10 AM

Share

సాధారణంగా గృహ అవసరాల కోసం మనం వాడే నీటి పరిమాణం చాలా తక్కువగా ఉంటుంది. కానీ తుర్క్మెనిస్తాన్ లో ఇంత భారీ స్థాయిలో నీటిని వినియోగించడానికి ప్రధాన కారణం అక్కడి వ్యవసాయ రంగమే. ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న మంచి నీటిలో డెబ్బై శాతం కేవలం వ్యవసాయం కోసమే ఖర్చు అవుతోంది. మధ్య ఆసియా ఖండంలోని దేశాల్లో ఈ పరిస్థితి మరింత తీవ్రంగా ఉండి వ్యవసాయానికి అధిక నీరు పడుతోంది. వరల్డోమీటర్, ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థలు సంయుక్తంగా విడుదల చేసిన తాజా నివేదిక ఈ సంచలన వివరాలను స్పష్టం చేసింది.

దీని ప్రకారం ఒక వ్యక్తికి సగటున ఏడాదికి లక్షా ఇరవై ఎనిమిది వేల క్యూబిక్ అడుగుల మంచి నీటిని తుర్క్మెనిస్తాన్ దేశం ఉపయోగిస్తోంది. ఈ భారీ నీటి వినియోగం జాబితాలో రెండో స్థానంలో మోంటెనెగ్రో దేశం నిలవగా ఆ తర్వాతి స్థానాల్లో ఉజ్బెకిస్తాన్, గయానా దేశాలు ఉన్నాయి. అత్యంత అభివృద్ధి చెందిన దేశమైన అమెరికా కూడా ఈ జాబితాలో మొదటి ఐదు స్థానాల్లో ఉండటం తీవ్ర ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

తుర్క్మెనిస్తాన్ ప్రధానంగా చాలా పొడి వాతావరణం కలిగిన ఎడారి దేశం. అక్కడ రైతులు పత్తి పంటను అత్యధికంగా పండిస్తారు కాబట్టి నీటి అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ పంటకు అవసరమైన నీటి కోసం దశాబ్దాల క్రితమే భారీ నీటిపారుదల ప్రాజెక్టులను నిర్మించారు. సోవియట్ పాలన కాలంలో అము దర్యా నది నుంచి తవ్విన కాలువల ద్వారా వ్యవసాయ భూములకు నీటిని భారీగా మళ్లించారు. దీని వల్లే ఆ దేశంలో ప్రతి మనిషి పేరు మీద నమోదయ్యే సగటు నీటి వినియోగం ఆకాశాన్ని తాకింది.

ఈ రకమైన భారీ నీటి వినియోగం పర్యావరణం మీద ఊహించని స్థాయిలో తీవ్రమైన ప్రభావాన్ని చూపుతోంది. పంటల కోసం విపరీతంగా నీటిని మళ్లించడం వల్ల ఆ ప్రాంతంలోని అతిపెద్ద సరస్సులలో ఒకటైన అరల్ సముద్రం ప్రమాదకర స్థాయిలో పూర్తిగా ఎండిపోయింది. సరైన నిర్వహణ లేని పాత నీటి పారుదల వ్యవస్థల వల్ల నీరు పొలాలకు చేరక ముందే మార్గమధ్యంలోనే పెద్ద ఎత్తున వృథా అవుతోంది. సెంట్రల్ ఆసియాలోని కిర్గిజిస్తాన్, తజికిస్తాన్ లాంటి దేశాలు కూడా సరిగ్గా ఇలాంటి నీటి వృథా సమస్యను తీవ్రంగా ఎదుర్కొంటున్నాయి.

వ్యవసాయం మాత్రమే కాకుండా విద్యుత్ ఉత్పత్తి, పరిశ్రమల అవసరాల కోసం కూడా అగ్ర దేశాలు పెద్ద ఎత్తున నీటిని వాడుతున్నాయి. తక్కువ జనాభా ఉండి అధిక పారిశ్రామిక లేదా సాగు నీటి అవసరాలు ఉన్నప్పుడు తలసరి నీటి వినియోగం అమాంతం పెరిగిపోతుంది. దీనివల్ల భవిష్యత్తులో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోయి తీవ్రమైన తాగునీటి కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. ప్రస్తుతం ఆఫ్రికా దేశాలైన కాంగో లాంటి చోట్ల తలసరి నీటి వాడకం కేవలం ముప్పై రెండు లీటర్లు మాత్రమే ఉండటం గమనార్హం.

రోజురోజుకూ పెరుగుతున్న నీటి కొరత భవిష్యత్తులో ప్రపంచ దేశాల ఉనికిని తీవ్రంగా కలవరపెట్టే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే వ్యవసాయంలో నీటి ఆదా కోసం నూతన సాంకేతిక విధానాలను, బిందు సేద్యం పద్ధతులను వెంటనే వాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రాజెక్టుల నుంచి నీరు లీకవుతూ వృథా కాకుండా ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు కాలువలను పర్యవేక్షించి మరమ్మతులు చేయాలి. అందుబాటులో ఉన్న నీటి వనరులను పొదుపుగా వాడుకుంటేనే రాబోయే తరాలకు మనం తగినంత ప్రాణాధారమైన నీటిని సురక్షితంగా అందించగలం. లేకపోతే ప్రపంచం మొత్తం ఒక భయంకరమైన నీటి సంక్షోభాన్ని ఎదుర్కోవడం మాత్రం కచ్చితం.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us