AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తుక్కుగూడ సభ నుంచే దేశ రాజకీయాలకు శంఖారావం.. సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు..

చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి ముఖ్య నేతల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో 17 పార్లమెంట్ స్థానాల్లో 14 పార్లమెంట్ స్థానాలు గెలవాలనే పట్టుదలతో ఉన్నామన్నారు సీఎం. క్షేత్రస్థాయిలో అందరి అభిప్రాయాలు, సర్వేల ఆధారంగానే.. అదేంటో ఈ స్టోరీ చూసేయండి..

తుక్కుగూడ సభ నుంచే దేశ రాజకీయాలకు శంఖారావం.. సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు..
Revanth Reddy
Sravan Kumar B
| Edited By: |

Updated on: Mar 26, 2024 | 8:31 PM

Share

చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి ముఖ్య నేతల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో 17 పార్లమెంట్ స్థానాల్లో 14 పార్లమెంట్ స్థానాలు గెలవాలనే పట్టుదలతో ఉన్నామన్నారు సీఎం. క్షేత్రస్థాయిలో అందరి అభిప్రాయాలు, సర్వేల ఆధారంగానే పార్టీ అధిష్టానం అభ్యర్థులను ఎంపిక చేస్తోందని చెప్పారు. చేవెళ్ల, సికింద్రాబాద్, మల్కాజిగిరి నియోజకవర్గాలకు ఒకదానికొకటి సంబంధం ఉందని.. అన్ని రకాలుగా ఆలోచించే చేవెళ్లలో రంజిత్ రెడ్డి, మల్కాజిగిరిలో సునీతా మహేందర్ రెడ్డి, సికింద్రాబాద్‌లో దానం నాగేందర్‌ను అభ్యర్థులుగా పార్టీ ప్రకటించిందని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు మన వంద రోజుల పరిపాలనకు రెఫరెండమ్‌గా నిలుస్తుందని.. అందుకే అత్యధిక ఎంపీ స్థానాలను గెలిచేలా శ్రమించాలని పార్టీ కార్యకర్తలకు సీఎం దిశానిర్దేశం చేశారు. చేవెళ్ల ఎంపీ నియోజకవర్గం కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనంలో సీఎం మాట్లాడారు.

తెలంగాణలో 14 పార్లమెంట్ స్థానాలు గెలిచి తెలంగాణ ఇచ్చిన సోనియమ్మకు కృతజ్ఞత చెప్పాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పదేళ్లు ప్రధానిగా ఉన్న మోదీ ఏం చేశారు.? ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్ట్ పూర్తి చేయలేదు. వికారాబాద్ వరకు ఎంఎంటీఎస్ రైలు తీసుకురాలేదు. బుల్లెట్ ట్రైన్ గుజరాత్‌కు తీసుకెళ్లిన మోదీ.. వికారాబాద్‌కు ఎంఎంటీఎస్ రైలు తీసుకురాలేదు. గుజరాత్‌లో సబర్మతి రివర్ ఫ్రంట్‌ను అభివృద్ధి చేసుకున్న మోదీ.. మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధికి నిధులు ఇవ్వలేదు. రీజనల్ రింగ్ రోడ్డు రాకుండా బీజేపీ ఎందుకు మోకాలడ్డుతోంది.? ఏం చూసి మూడోసారి మోదీకి ఓటు వేయాలని బీజేపీ అడుగుతున్నారు.? బీజేపీ నేతల వ్యవహారం పెళ్లి పెద్దను చూసి పిల్లనివ్వాలన్నట్లుందంటూ రేవంత్ వ్యంగ్యాస్త్రం విసిరారు.

మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునేందుకు ఇది చక్కని అవకాశం.. పార్లమెంట్ ఎన్నికల్లో మన పార్టీ అభ్యర్థులను గెలిపించుకుంటేనే మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. 2004లో జెడ్పీటీసీగా ఉన్న రేవంత్.. 2024కి ముఖ్యమంత్రి అయ్యాడంటే.. పార్టీ స్టాండ్‌ను నమ్ముకుని కష్టపడ్డందుకే అని మీరందరూ కూడా పార్టీ స్టాండర్డ్ నమ్ముకునే కష్టపడితే ఫలితం దక్కుతుందని కార్యకర్తలకు సూచించారు. కార్యకర్తలకు అండగా నిలబడేందుకు, దేశాన్ని కాపాడుకునేందుకు రాహుల్ గాంధీ వేల కిలోమీటర్లు నడిచారు. పార్టీకి అండగా నిలబడి సోనియమ్మ నాయకత్వాన్ని బలపరచాల్సిన బాధ్యత అందరిపై ఉంది. తుక్కుగూడ రాజీవ్ గాంధీ ప్రాంగణంలో అసెంబ్లీ ఎన్నికలకు ఆరు గ్యారంటీలను ప్రకటించుకున్నాం. మళ్లీ అక్కడే ఏప్రిల్ 6 లేదా 7న జాతీయస్థాయి గ్యారంటీలను ప్రకటించుకోబోతున్నాం. రంగారెడ్డి జిల్లా నుంచే దేశ రాజకీయాలకు శంఖారావం పూరించబోతున్నాం. ఈ జనజాతర సభకు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే హాజరవుతారు.