TRSLP MEETING: సిట్టింగులకు భరోసా.. ముందస్తు ఊహాగానాలకు చెక్.. కేంద్ర సంస్థలతో అమీతుమీ.. కేసీఆర్ సందేశమిదే

దసరా రోజు టీఆర్ఎస్ ఎల్పీ, విస్తృత కార్యవర్గ సమావేశాలను నిర్వహించనున్నట్లు ఓ వారం రోజుల ముందే మీడియాకు లీక్ చేయడం ద్వారా ఓ హైప్ క్రియేట్ చేశారు కేసీఆర్. వారం రోజుల పాటు జాతీయ పార్టీగా మారనున్న నేపథ్యంలో...

TRSLP MEETING: సిట్టింగులకు భరోసా..  ముందస్తు ఊహాగానాలకు చెక్.. కేంద్ర సంస్థలతో అమీతుమీ.. కేసీఆర్ సందేశమిదే
Cm Kcr Key Decision
Follow us
Rajesh Sharma

|

Updated on: Nov 15, 2022 | 7:06 PM

ఏ అంశాన్ని అయినా సూపర్ హైప్ చేయాలన్నా.. అదే అంశాన్ని అంతలోనే చప్పున పక్కన పెట్టేయాలన్నా.. గులాబీ బాస్‌ది అందె వేసిన చేయి. తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా జాతీయ పార్టీగా చేయబోతున్న తరుణాన్ని ఓసారి గుర్తు చేసుకుంటే ఇది సులభంగా బోధపడుతుంది. దసరా ముహూర్తాన ప్రాంతీయ టీఆర్ఎస్ పార్టీని జాతీయ బీఆర్ఎస్‌గా చేసేందుకు పార్టీలో తీర్మానాన్ని ఆమోదించారు. దసరా నాడు ప్రగతిభవన్ వేదికగా టీఆర్ఎస్ చట్టసభల సభ్యులతోను, పార్టీ సీనియర్ నేతలతోను జరిపిన భేటీలో కేసీఆర్ ఈ మేరకు తీర్మానాన్ని ఆమోదింపజేసి, కేంద్ర ఎన్నికల సంఘానికి పంపారు. ఆ ఫార్మాలిటీస్ ఇపుడు తుది దశకు చేరుకున్నాయి. పార్టీ పేరును మారుస్తున్నామని, అభ్యంతరాలుంటే తెలియజేయాలని పార్టీ అధ్యక్ష హోదాలో కేసీఆర్ నవంబర్ 7వ తేదీన పత్రికల్లో ఓ ప్రకటన కూడా విడుదల చేశారు. ఈ ప్రకటనలో ఇచ్చిన నెల రోజుల వ్యవధి పూర్తి అయితే, ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాకుంటే డిసెంబర్ రెండోవారంలో భారత రాష్ట్ర సమితి పేరు కేంద్ర ఎన్నికల సంఘంలో రిజిస్టర్ అవుతుంది. అధికారికంగా టీఆర్ఎస్ పేరు బీఆర్ఎస్‌గా మారిపోతుంది. ఆ తర్వాత జాతీయ పార్టీగా గుర్తింపు పొందేందుకు అవసరమైన అంశాలపై అధినేత కేసీఆర్ దృష్టి సారించాల్సి వుంటుంది.

ఇదంతా పక్కన పెడితే దసరా రోజు టీఆర్ఎస్ ఎల్పీ, విస్తృత కార్యవర్గ సమావేశాలను నిర్వహించనున్నట్లు ఓ వారం రోజుల ముందే మీడియాకు లీక్ చేయడం ద్వారా ఓ హైప్ క్రియేట్ చేశారు కేసీఆర్. జాతీయ పార్టీగా మారనున్న నేపథ్యంలో కేసీఆర్ వ్యూహాలపై వారం రోజుల పాటు మీడియా పదుల సంఖ్యలో కథనాలను ప్రచురించింది.. ప్రసారం చేసింది. ఆ హైప్‌కు అనుగుణంగానే దసరా నాడు టీఆర్ఎస్ ఎల్పీ, విస్తృత కార్యవర్గ సమావేశం జరిగింది. పార్టీ పేరు మార్పుపై తీర్మానం జరిగింది. ఆ వెంటనే పార్టీ ప్రతినిధుల బృందం ఢిల్లీకి వెళ్ళి కేంద్ర ఎన్నికల సంఘానికి పార్టీ తీర్మానం ప్రతిని అందజేసి, అవసరమైన ఫార్మాలిటీస్‌పై చర్చించింది. తాజాగా మరోసారి అంటే నవంబర్ 15వ తేదీన టీఆర్ఎస్ ఎల్పీ భేటీ తెలంగాణ భవన్‌లో జరిగింది. ఈ సమావేశానికి సంబంధించి రెండు రోజుల క్రితమే మీడియాకు లీకేజీలు అందాయి. అంతే కేసీఆర్ మరో షాకింగ్ డెసిషన్ తీసుకున్నారని, దాన్ని నవంబర్ 15న జరిగే భేటీలో రాటిఫై చేయించుకుని ప్రకటిస్తారని ప్రచారం జోరుగా జరిగింది. తీరా నవంబర్ 15వ తేదీ వచ్చేసరికి కారణమేదైతేనేం ముందుగా అనుకున్న స్థాయిలో టీఆర్ఎస్ ఎల్పీ భేటీకి అంతగా హైప్ క్రియేట్ కాలేదు. దానికి సూపర్ స్టార్, నటశేఖర కృష్ణ మరణం ఓ కారణమైతే.. కేసీఆర్ స్వయంగా ఈ భేటీ కవరేజీకి మీడియాను దూరం పెట్టాలని ఆదేశించడం మరో కారణం. మధ్యాహ్నం 2 గంటలకు టీఆర్ఎస్ ఎల్పీ భేటీ వుందనగా మధ్యాహ్నం 12 గంటల కల్లా తెలంగాణ భవన్ నుంచి మీడియాను పంపించేయాలని ఆదేశాలు వెలువడ్డాయి. దాంతో మీడియాను అక్కడ్నించి పంపించేశారు.

షెడ్యూలు ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు!

కేసీఆర్ అనుకున్నట్లుగా తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ ఎల్పీ సమావేశం జరిగింది. మూడు గంటల పాటు జరిగిన భేటీలో పలు కీలక అంశాలను పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో పంచుకున్నారు కేసీఆర్. ముఖ్యంగా తెలంగాణలో ముందస్తు ఎన్నికలు జరుగుతాయన్న ఊహాగానాలకు ఆయన చెక్ పెట్టారు. అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూలు ప్రకారమే జరుగుతాయని ఆయన పరోక్షంగా సంకేతాలిచ్చారు. ఇది ఎన్నికల సంవత్సరమని ఎమ్మెల్యేలకు గుర్తు చేశారు. ఈ ఏడాదంతా నియోజకవర్గం ప్రజలతో ఎక్కువ సమయం వుండాలని వారికి సూచించారు. ఇంతకాలం ప్రజలకు ఎన్నో చేశామని, ఇపుడు వాటిని ప్రజలకు వివరించడం ద్వారా మరోసారి అధికారంలోకి వచ్చేందుకు యత్నించాలని కేసీఆర్ పార్టీ ఎమ్మెల్యేలను ఆదేశించారు. సర్వేలన్నీ టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగానే వున్నాయని, మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమని చెప్పిన కేసీఆర్.. ఎమ్మెల్యేల్లో అలసత్వాన్ని సహించబోనని అన్నట్లు తెలుస్తోంది. ఎన్నికలకు సరిగ్గా ఏడాది మిగిలి వుంది.. అందరు క్యాలెండర్ రూపొందించుకుని మరీ ప్రజలతో మమేకం కావాలని కేసీఆర్ చెప్పారు. అయితే, సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ తిరిగి పోటీ చేసే అవకాశం కల్పిస్తామని, పార్టీ టిక్కట్లిస్తామని తెలిపారు. దాదాపు 40 సీట్లలో సిట్టింగ్ ఎమ్మెల్యేలపై తీవ్ర స్థాయిలో అసంతృప్తి వుందని ఇటీవల రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సారథ్యంలోని ఐప్యాక్ సంస్థ కేసీఆర్‌కు తమ సర్వే నివేదికను ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. ప్రజల్లో తీవ్ర స్థాయిలో అసంతృప్తిని ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకు కేసీఆర్ టిక్కెట్లు ఇవ్వకపోవచ్చన్న ప్రచారమూ జరిగింది. కానీ తాజా భేటీలో సిట్టింగులందరికీ మళ్ళీ అవకాశం ఇస్తానని కేసీఆర్ చెప్పడంతో పీకే టీమ్ ఇచ్చిన రిపోర్టును పక్కన పెట్టినట్లు భావించవచ్చు.

సిట్టింగులకు హామీలో రెండు కీలకాంశాలు

2018లో కాంగ్రెస్, టీడీపీల తరపున గెలిచిన వారిలో చాలా మంది టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ నాయకత్వం ఆల్ రెడీ వుంది. 2023లో తమకే టిక్కెట్ అనుకుంటున్నారు. ఇపుడు సిట్టింగులందరికీ టిక్కెట్ ఖాయమని కేసీఆర్ చెప్పడంతో ఆయా నియోజకవర్గాల్లో చిరకాలంగా పార్టీలో పని చేస్తున్నవారికి షాక్ తగిలినట్లయ్యింది. రాష్ట్రంలోని 119 సీట్లలో దాదాపు 30 నుంచి 35 సీట్లలో టిక్కెట్ ఆశిస్తున్న వారి సంఖ్య రెండు అంత కంటే ఎక్కువగా వుంది. ఇపుడు సిట్టింగులకే అవకాశం అని కేసీఆర్ తేల్చేయడంతో టిక్కెట్ ఆశిస్తున్న మిగిలిన వారు వేరే పార్టీల వైపు వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, తిరిగి టీఆర్ఎస్ పార్టీనే అధికారంలోకి వస్తుందన్న నమ్మేవారు పార్టీని వీడకపోవచ్చు. ఇక ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన అంశం కనిపిస్తోంది. సిట్టింగులందరికీ తిరిగి టిక్కెట్ ఇస్తామనడం వెనుక కేసీఆర్‌కు మరో వ్యూహం వుందన్న విశ్లేషణ కూడా వినిపిస్తోంది. ఇటీవల నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పార్టీ నుంచి లాగేసేందుకు యత్నం జరిగింది. ఈ యత్నం వెనుక నిజంగానే బీజేపీ వుందా లేదా అన్న అంశాన్ని పక్కన పెడితే.. బీజేపీ సిట్టింగులకు గాలం వేస్తుందన్న అనుమానం మాత్రం టీఆర్ఎస్ పార్టీలో ప్రబలంగా వుంది. ఈ నేపథ్యంలోనే మరోసారి పార్టీ టిక్కెట్ సిట్టింగులకే ఇస్తామనడం వెనుక వారు ఇతర పార్టీలు మరీ ముఖ్యంగా బీజేపీ ప్రలోభాలకు లొంగకుండా వుండేందుకు కేసీఆర్ ఆ ప్రకటన చేసి వుంటారని కొందరంటున్నారు. ఏది ఏమైనా సిట్టింగులకు కేసీఆర్ హామీతో ఓ ప్రయోజనం ఓ నష్టం కనిపిస్తోంది. ప్రయోజనం ఏంటంటే.. సిట్టింగులు వేరే పార్టీవైపు చూడకుండా వుండడం. ఇక నష్టం ఏంటంటే.. ఒకరి కంటే ఎక్కువ మంది టిక్కెట్ ఆశిస్తున్న నియోజకవర్గాల్లో తమకు టిక్కెట్ రాదనుకునే వాళ్ళు పార్టీ మారే అవకాశం.

ద్విముఖవ్యూహంతో భేటీ?

నవంబర్ 15 భేటీలో కేసీఆర్ ఓ ఇంటరెస్టింగ్ కామెంట్ చేసినట్లు తెలుస్తోంది. బీజేపీ నేతలు ఏకంగా తన కూతురు కవితనే తమ పార్టీలోకి లాగేందుకు ప్రలోభాలకు గురి చేశారని ఆయన అన్నట్లు సమాచారం. తన కూతురినే టీఆర్ఎస్ పార్టీ నుంచి లాగేందుకు యత్నించిన బీజేపీ నేతల పట్ల అప్రమత్తంగా వుండాలని కేసీఆర్ పార్టీ ఎమ్మెల్యేలను హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఇదేసమయంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ పేరిట వేధిస్తే తిరగబడాలని, అవసరమైతే ఆందోళనలు, ధర్నాలు చేయాలని కేసీఆర్ సూచించినట్లు సమాచారం. అంటే కేంద్ర దర్యాప్తు సంస్థలతో అమీతుమీకి కేసీఆర్ సిద్దమైనట్లు తెలుస్తోంది. మొత్తమ్మీద భారీగా హైప్ క్రియేట్ చేసినప్పటికీ ఎల్పీ భేటీని సింపుల్‌గా ముగించడం విశేషం. ఎమ్మెల్యేలను అలర్ట్ చేసేందుకు ఈ భేటీ నిర్వహించినట్లు అవగతమవుతోంది.  సిట్టింగులు తమకు తిరిగి టిక్కెట్ రాదేమోనన్న భయంతో పార్టీ మారే అవకాశాలను తుడిచేయడం, కేంద్ర దర్యాప్తు సంస్థల దర్యాప్తులను రాజకీయం చేయడం వంటి ద్విముఖ వ్యూహంతోనే నవంబర్ 15 భేటీ జరిగి వుండవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?
కుంభ మేళాలో వీఐపీల కోసం సర్క్యూట్ హౌస్ ఏర్పాటు సౌకర్యాలు ఏమిటంటే
కుంభ మేళాలో వీఐపీల కోసం సర్క్యూట్ హౌస్ ఏర్పాటు సౌకర్యాలు ఏమిటంటే