Hyderabad: మరోసారి వరుణ ప్రతాపం.. నగరంపై కుండపోత.. మోకాలి లోతు నీటిలో వాహనదారుల అవస్థలు
నిన్న (సోమవారం) కురిసిన కుండపోత వానను మరిచిపోకముందే భాగ్యనగరంపై వరుణుడు మరోసారి విరుచుకుపడ్డాడు. నగరవాసులపై తన ప్రతాపం చూపించాడు. వరుసగా రెండో రోజూ రాజధాని నగరంలో..
నిన్న (సోమవారం) కురిసిన కుండపోత వానను మరిచిపోకముందే భాగ్యనగరంపై వరుణుడు మరోసారి విరుచుకుపడ్డాడు. నగరవాసులపై తన ప్రతాపం చూపించాడు. వరుసగా రెండో రోజూ రాజధాని నగరంలో వాన దంచికొట్టింది. నాంపల్లి, బషీర్ బాగ్, లక్డీకాపూల్, కోఠి, బేగంబజార్, సుల్తాన్ బజార్, ప్యాట్నీ, అబిడ్స్, నారాయణగూడ, హైదర్‌గూడ, నాంపల్లి, సికింద్రాబాద్, బోయిన్‌పల్లి, హిమాయత్‌నగర్, మెహదీపట్నం, మాసబ్‌ట్యాంక్, మారేడ్‌పల్లి, తిరుమలగిరి, చిలకలగూడ, బేగంపేట్, అల్వాల్, ప్యారడైజ్ తదితర ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షం పడింది. ఒక్కసారిగా కురిసిన వర్షాలకు రోడ్లపై నీరు నిలిచిపోయింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించిపోయింది.
కాగా సోమవారం సాయంత్రం 5 గంటల తర్వాత వాన దంచి కొట్టింది. అర్ధరాత్రి వరకూ కురుస్తూనే ఉంది. బేగంపేట్, మాసబ్ ట్యాంక్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, అమీర్ పేట్, కూకట్ పల్లి, ఎల్బీనగర్, వనస్థలిపురం, కోఠి, ప్రాంతాల్లో వర్షం కురిసింది. నాంపల్లి, మలక్ పేట్, దిల్ సుఖ్‌నగర్ ప్రాంతాల్లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఒక్కసారిగా కురిసిన వానలకు లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. నాలాలు, డ్రైనేజీలు ఉప్పొంగాయి. చాలా చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఒక్కసారిగా వర్షం పడటంతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తమయ్యాయి. నగరంలో మరో రెండ్రోజులపాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
నాంపల్లిలో 9 సెంటీ మీటర్లు, చార్మినార్‌లో 5 సెంటీ మీటర్ల వాన పడింది. దీంతో అత్యవసరం అయితే తప్ప ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని పోలీసులు కోరారు. అందరూ ఇళ్లల్లోనే ఉండాలని, అవసరమైతే తప్ప బయటకు రావద్దని GHMC సూచించింది. అయితే.. సోమవారం కురిసిన వాన కేవలం స్టార్టింగేనని, రానున్న 28 – 30 రోజుల పాటు అతిభారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..