Telangana: తెలంగాణలో డాగ్ టెర్రర్.. హైదరాబాద్‌లో మరో చిన్నారిపై దాడి చేసిన వీధి కుక్కలు.. మంచిర్యాల లోనూ సేమ్ సీన్
ఏపీ,తెలంగాణల్లో వీధికుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఓ వైపు మున్సిపాల్టీ సిబ్బంది చర్యలు కొనసాగుతుండగానే.. మరోవైపు గ్రామసింహాలు పిల్లలను టార్గెట్ చేసి గాయపరుస్తున్నాయి.
ఏపీ,తెలంగాణల్లో వీధికుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఓ వైపు మున్సిపాల్టీ సిబ్బంది చర్యలు కొనసాగుతుండగానే.. మరోవైపు గ్రామసింహాలు పిల్లలను టార్గెట్ చేసి గాయపరుస్తున్నాయి. మొన్న ప్రదీప్, నిన్న ఆశ్రిత్, తాజాగా శైలజ్, సహస్రల ఉదంతంతో జనం భయాందోళనకు గురవుతున్నారు. మొన్న అంబర్‌పేట్‌లో ఊరకుక్కల దాడిలో ప్రదీప్ చనిపోయిన ఘటన మరువకముందే హైదరాబాద్‌లో మరో ఘటన చోటుచేసుకుంది. నాచారంలోని మల్లాపూర్ గ్రీన్‌హిల్స్‌లో ఇంటిముందు ఆడుకుంటున్న ఆశ్రిత్‌పై కుక్కలు దాడిచేసి కరిచాయి. అప్పటికే భయంతో పరుగులు పెట్టిన ఆశ్రిత్‌ను చూసి గేటులోపల ఉన్న అక్క అరిచింది. ఓవైపు ఆశ్రిత్ పడిపోవడం, అక్క అరవడంతో కుక్కలు వెనక్కి పరిగెత్తాయి. కుక్కలదాడిలో గాయపడిన ఆశ్రిత్‌ను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఇక మంచిర్యాల జిల్లా మందమర్రిలోనూ సేమ్ సీన్. మూడు వేర్వేరు చోట్ల పదిమందిపై పిచ్చికుక్కలు దాడి చేసి వీరంగం సృష్టించాయి. వారిలో ముగ్గురు పిల్లలు, ఒకమ్మాయి, ఇద్దరబ్బాయిలు ఉన్నారు. ఇంటి ముందు ఆడుకుంటున్న శైలజ్, సహస్రపై వీధికుక్కలు దాడిచేసి తీవ్రంగా గాయపరిచాయి. అటు విజయవాడలోనూ కుక్కల బెడద పెరిగింది. భవానీపురంలో ముగ్గురుపిల్లలపై దాడి వీధికుక్కలు దాడి చేశాయి. స్థానికులు అలెర్ట్ కావడంతో కుక్కలు బారినుండి చిన్నారులు ప్రాణాలతో బయటపడ్డారు. తీవ్రగాయాలపాలైన చిన్నారులకు ఆస్పత్రిలో చికిత్స జరుగుతోంది. మరోవైపు వీధి కుక్కల నియంత్రణకు జంతు ప్రేమికులు అడ్డుగా నిలుస్తున్నారు. ఏమాత్రం చర్యలు తీసుకున్నా కోర్టు డైరెక్షన్‌తో బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఐతే కుక్కలపై ప్రేమ తప్ప పిల్లలపై ప్రేమ ఉండదా అని బాధితుల ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు..అంత ప్రేమ ఉంటే కుక్కలను వారి ఇళ్లలోకి తీసుకెళ్లి పెట్టుకోవాలని బాధితులు సూచిస్తున్నారు.
ప్రభుత్వాస్పత్రిలోని చిన్నారిపై..
కుక్కల బెడదపై టీవీ9 వరుస కథనాలతో GHMC నిద్రమత్తును వదిలించింది. మేయర్ గద్వాల విజయలక్ష్మి కార్పొరేటర్లు, అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. అంబర్‌పేటలో ప్రదీప్ కుటుంబానికి 8 లక్షల పరిహారం చెల్లించాలని నిర్ణయించింది. కుక్కల సమస్య పరిష్కారానికి కమిటీ వేయాలని కూడా నిర్ణయించారు. హైదరాబాద్ డాగ్ టెర్రర్ మరవకముందే రాజస్థాన్‌లో మరో దారుణం జరిగింది. సిరోహి జిల్లా ప్రభుత్వాస్పత్రిలో వీధికుక్కల దాడిలో నెలరోజుల బాలుడు చనిపోయాడు. తల్లిపక్కన నిద్రపోతున్న శిశువును వీధికుక్కలు నోటకర్చుకొని తీసుకెళ్లడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై స్థానికులు భగ్గుమంటున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..