Hyderabad: ఇలాంటి పాలు తాగితే మనం ఎన్నాళ్లు బ్రతుకుతాం..
రసాయనాలతో కల్తీ పాలు తయారుచేస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న ఓ పాల వ్యాపారి గుట్టును మహేశ్వరం SOT పోలీసులు రట్టు చేశారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం పోచారంలో దాడి చేసి 100 లీటర్ల కల్తీ పాలు, లీటరు హైడ్రోజన్ పెరాక్సైడ్, 35 కిలోల మిల్క్ పౌడర్‌ను స్వాధీనం చేసుకున్నారు.

లాభాలే లక్ష్యంగా కొందరు వ్యాపారులు ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్నారు. పాలల్లో ప్రమాదకర రసాయనాలు కలిపి కృత్రిమంగా తయారుచేసి విక్రయిస్తున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా రంగారెడ్డి జిల్లాలో ఇలాంటి కల్తీ పాల తయారీ కేంద్రాన్ని మహేశ్వరం SOT పోలీసులు గుర్తించారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఇబ్రహీంపట్నం మండలం పోచారం గ్రామంలోని ఓ పాల తయారీ కేంద్రంపై పోలీసులు ఆకస్మిక దాడి చేశారు. అక్కడ పాలు తయారుచేసేందుకు హైడ్రోజన్ పెరాక్సైడ్, ‘ధోల్పూర్’ బ్రాండ్ మిల్క్ పౌడర్ ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. ఈ కేంద్రాన్ని నిర్వహిస్తున్న పోచారం గ్రామానికి చెందిన అందె శ్రీశైలం (43)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాడిలో 100 లీటర్ల కల్తీ పాలు, ఒక లీటరు హైడ్రోజన్ పెరాక్సైడ్, 35 కిలోల మిల్క్ పౌడర్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని కేసు నమోదు నిమిత్తం ఇబ్రహీంపట్నం పోలీసులకు అప్పగించారు. ఈ కల్తీ పాలను హైదరాబాద్‌లోని వినియోగదారులకు విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
కల్తీ పాలు తాగితే ఎలాంటి దుష్ప్రభావాలు?
పాలలో హైడ్రోజన్ పెరాక్సైడ్ వంటి రసాయనాలు కలపడం ఆరోగ్యానికి ప్రమాదకరం. ఇది క్రిమిసంహారకంగా కొన్ని పారిశ్రామిక, శుభ్రపరిచే అవసరాల్లో ఉపయోగించే రసాయనం. దీన్ని కలిపిన పాలు తాగితే తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయి. కడుపులో మంట, నొప్పి, వాంతులు, విరేచనాలు రావచ్చు. అధిక మోతాదులో రసాయనం చేరితే కడుపు, పేగుల లోపలి పొర దెబ్బతినే ప్రమాదం ఉంది. హైడ్రోజన్ పెరాక్సైడ్ మోతాదు, గాఢత ఎక్కువగా ఉంటే అంతర్గత గాయాలు, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తలెత్తవచ్చు. తీవ్రమైన సందర్భాల్లో రక్తనాళాల్లో ఆక్సిజన్ బుడగలు ఏర్పడి రక్తప్రసరణకు ఆటంకం కలిగించే గ్యాస్ ఎంబాలిజం సంభవించవచ్చు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతినొప్పి, స్పృహ కోల్పోవడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. అనుమానాస్పద పాలను తాగడం కంటే అసలు పాలు లేదా టీ తాగకుండా ఉండటమే ఉత్తమం.
