AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: అమెరికాలో అదృశ్యమైన నల్లగొండ యువతి..

భవిష్యత్తుకు బాటలు వేసుకునేందుకు ఆ యువతి అమెరికా వెళ్లింది. ఉన్నత చదువులు చదువుతోంది.. పార్ట్‌టైం ఉద్యోగం చేస్తోంది. ఉన్నత విద్య పూర్తి చేసి జీవితంలో స్థిరపడుతుందని తల్లిదండ్రులు ఆశించారు. అంతలోనే ఏమైందో తెలియదు.. ఒక్కసారిగా కనిపించకుండా పోయింది. ఉన్నట్టుండి కుమార్తె అదృశ్యం కావడంతో ఆ కుటుంబంలో ఆందోళన మొదలైంది. రోజులు గడుస్తున్నా ఆచూకీ లేకాపోవడంతో తల్లిదండ్రులకు ఇప్పుడు కంటిమీద కునుకు లేకుండా పోయింది. అమెరికాలో యువతి మిస్సింగ్ మిస్టరీ ఇప్పుడు కలకలం రేపుతోంది.

Telangana: అమెరికాలో అదృశ్యమైన నల్లగొండ యువతి..
Sreeja Reddy
M Revan Reddy
| Edited By: |

Updated on: Nov 06, 2026 | 11:51 AM

Share

నల్లగొండ జిల్లా కనగల్ మండలం శాబ్దులాపురం గ్రామానికి చెందిన కోయ యాదగిరిరెడ్డి, రూప దంపతుల ఏకైక కుమార్తె శ్రీజ రెడ్డి కోయ. చిన్నప్పటి నుంచి ఉన్నత చదువులు చదివి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలన్న లక్ష్యంతో ముందుకు సాగింది. ఆ కలలను నిజం చేసుకునేందుకు ఏడాది క్రితం అమెరికా బాట పట్టింది. బోస్టన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ మసాచుసెట్స్‌లో విద్యనభ్యసిస్తోంది. చదువుతోపాటు పార్ట్‌టైం ఉద్యోగం చేసుకుంటూ తన భవిష్యత్తుకు బాటలు వేసుకుంటోంది. దీంతో తల్లిదండ్రులు ఆనందంలో ఉన్నారు.

నవంబర్ 2.. సోమవారం రాత్రి సుమారు 9.45 గంటలు. బోస్టన్‌లోని డోర్చెస్టర్ ప్రాంతం ఎడిసన్ గ్రీన్‌లో ఉన్న తన నివాసం నుంచి శ్రీజ బయటకు వెళ్లింది. సాధారణంగా వెళ్లినట్లుగానే తిరిగి వస్తుందని భావించిన స్నేహితులకు.. ఎంతసేపటికీ ఆమె రాకపోవడంతో ఆందోళన మొదలైంది. ఫోన్‌లో సంప్రదించేందుకు ప్రయత్నించినా స్పందన లేకపోవడంతో అనుమానం మరింత పెరిగింది. చివరకు నవంబర్ 3న బోస్టన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నవంబర్ 4న బోస్టన్ పోలీస్ డిపార్ట్‌మెంట్ అధికారికంగా మిస్సింగ్ పర్సన్ అలర్ట్ విడుదల చేసింది. శ్రీజను ఆచూకీ కోసం గాలిస్తున్నారు.

బీచ్ పరిసరాల్లో గాలింపు..

శ్రీజ అదృశ్యం వెనుక ఏం జరిగిందన్నది ఇప్పుడు మిస్టరీగా మారింది. ఆమె మొబైల్ ఫోన్‌కు సంబంధించిన చివరి లొకేషన్ ఆధారంగా పోలీసులు పలు ప్రాంతాలపై దృష్టి సారించారు. ముఖ్యంగా కార్సన్ బీచ్, హార్బర్ పాయింట్ పరిసరాల్లో ఆమె ఆచూకీ కోసం గాలిస్తున్నారు.

కన్నీరుమున్నీరవుతున్న తల్లిదండ్రులు…

ఒకవైపు అమెరికాలో పోలీసుల గాలింపు.. మరోవైపు స్వగ్రామంలో తల్లిదండ్రుల ఎదురు చూపులు. కూతురు ఎక్కడుందో.. ఎలా ఉందో తెలియక యాదగిరిరెడ్డి, రూప దంపతులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. ఉన్నత చదువుల కోసం విదేశాలకు పంపిన ఏకైక కుమార్తె ఇలా కనిపించకుండా పోవడంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరావుతున్నారు. శ్రీజ క్షేమంగా తిరిగి రావాలని బంధువులు, గ్రామస్థులు ప్రార్థిస్తున్నారు. అమెరికాలోని తెలుగు సంఘాలు, భారతీయ సమాజం కూడా శ్రీజ ఆచూకీ కోసం సహకరించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

మంత్రి చొరవ.. అధికారులతో సంప్రదింపులు..

శ్రీజ అదృశ్యమైన విషయం నల్లగొండ జిల్లాలో తీవ్ర కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి దృష్టికి కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని తీసుకెళ్లారు. స్పందించిన మంత్రి.. అమెరికా ఎంబసీ అధికారులతో మాట్లాడి శ్రీజ ఆచూకీ కనుగొనేందుకు అవసరమైన చర్యలపై చొరవ తీసుకున్నారు.

Follow Us