Hyderabad: మెట్రో, ఆర్టీసీ బస్సుల్లో తిరిగేవారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. దీపావళి రోజు నుంచి కొత్త ధరలు..
హైదరాబాద్ ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. మెట్రో, ఆర్టీసీ ప్రయాణాల కోసం తీసుకొచ్చిన ఉమ్మడి పాస్ ధరలను సగానికి సగం తగ్గించింది. ప్రజల నుంచి వచ్చిన డిమాండ్ల మేరకు ధరల్లో సవరణలు చేసింది. కొత్త ధరలను రవాణశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఎక్స్ వేదికగా ప్రకటించారు.

తెలంగాణ ప్రజలకు రేవంత్ సర్కార్ దీపావళి గిఫ్ట్ అందించింది. హైదరాబాద్‌లో ఉండేవారికి ఇది భారీ శుభవార్తగా చెప్పవచ్చు. మీరు రోజూ మెట్రోలు, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తుంటే.. ప్రయాణ ఛార్జీల నుంచి మీకు భారీగా డబ్బులు ఆదా కానున్నాయి. అదేంటంటే.. మెట్రో, ఆర్టీసీ బస్సుల్లో ఒకే కార్డుపై ప్రయాణించేందుకు వీలుగా రేవంత్ సర్కార్ కామన్ పాస్‌లను ఈ ఏడాది ఆగస్ట్ 15వ తేదీన స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రవేశపెట్టింది. అయితే ఈ ఉమ్మడి పాస్ ధరలు ఎక్కువగా ఉండటంతో ప్రజల నుంచి స్పందన రాలేదు. వీటిని తీసుకునేందుకు ఎవ్వరూ ముందుకు రాలేదు. దీంతో పాస్ ధరలను తగ్గించాలనే డిమాండ్లు ఎప్పటినుంచో వినిపిస్తుండగా.. ఇప్పుడు ఎట్టకేలకు ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి పాస్ ధరలు సగానికి సగం తగ్గిస్తున్నట్లు శుక్రవారం అధికారికంగా ప్రకటన చేసింది. దీపావళి రోజున నవంబర్ 8 నుంచి ఇవి అమల్లోకి వస్తాయి. ఈ మేరకు రాష్ట్ర రవాణశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ విషయాన్ని తన ఎక్స్ అకౌంట్లో ప్రకటించారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నుంచి వచ్చిన ఆదేశాల మేరకు తగ్గించినట్లు వెల్లడించారు.
రూ.4 వేలకు తగ్గింపు..
తొలుత మెట్రో, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేందుకు నెలవారీ ఉమ్మడి పాస్ ధర రూ.8,500గా ప్రభుత్వం నిర్ణయించింది. నెలకు రూ.8 వేలు అంటే చాలా ఎక్కువ. సామాన్య, మధ్యతరగతి ప్రజలకు ఇది భారం కూడుకున్నది. దీంతో ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయల మేరకు సామాన్యులకు అందుబాటులో ఉండేలా సగానికి సగం తగ్గించింది. ప్రస్తుతం నెలవారీ పాస్ ధరను రూ.4 వేలుగా ఫిక్స్ చేసింది. అంటే ఏకంగా రూ.4,500 తగ్గించింది. ఇక రోజువారీ ఉమ్మడి పాస్ ధర రూ.400గా గతంలో ఉండగా.. ఇప్పుడు రూ.275కి తగ్గించింది.
మెట్రో, ఆర్టీసీ వాటా ఎంతంటే..?
-రూ.4 వేల నెలవారీ పాస్ ధరలో మెట్రో వాటా రూ.3 వేలు, ఆర్టీసీ ప్రయాణాలకు రూ.వెయ్యి వినియోగించుకోవచ్చు. నెలలో గరిష్టంగా 50 రౌండ్ ట్రిప్పులకు ఇవి వర్తిస్తుంది
-రోజువారీ రూ.275 పాసులో మెట్రో ప్రయాణానికి రూ.200, ఆర్టీసీకి రూ.75 వినియోగించుకోవచ్చు. పాస్ రోజుకు 4 సింగిల్ జర్నీలకు ఉపయోగపడుతుంది
-ఈ తగ్గింపు వల్ల నెలవారీ పాస్ వినియోగదారులకు రూ.4,500, రోజువారీ పాస్ ఉపయోగించేవారికి రూ.125 ఆదా కానున్నాయి
రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం దీపావళి కానుక!
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలతో మెట్రో – ఆర్టీసీ ఉమ్మడి ప్రయాణ పాస్ ధరల్లో భారీ తగ్గింపు
రూ.8,500 ఉన్న నెలవారీ పాస్ ధర రూ.4,000కు తగ్గింపు
ప్రజలపై ప్రయాణ ఖర్చుల భారం తగ్గించడమే మా ప్రభుత్వ లక్ష్యం!!
రాష్ట్ర ప్రజలకు దీపావళి కానుకగా మెట్రో – ఆర్టీసీ ఉమ్మడి ప్రయాణ పాస్ ధరలను భారీగా తగ్గిస్తూ మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రజలపై ప్రయాణ ఖర్చుల భారాన్ని తగ్గించి, ప్రజా రవాణా సేవలను మరింత అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారి సహకారంతో ఈ నిర్ణయం తీసుకున్నాం.
ప్రస్తుతం రూ.400గా ఉన్న రోజువారీ ఉమ్మడి ప్రయాణ పాస్ ధరను రూ.275కు తగ్గించాం. ఇందులో రూ.200 మెట్రో ప్రయాణానికి, రూ.75 ఆర్టీసీ ప్రయాణానికి కేటాయించాం. ఈ పాస్ ద్వారా రోజుకు 4 సింగిల్ జర్నీలకు అనుమతి ఉంటుంది.
అదేవిధంగా ప్రస్తుతం రూ.8,500గా ఉన్న నెలవారీ ఉమ్మడి ప్రయాణ పాస్ ధరను రూ.4,000కు తగ్గించాం. ఇందులో రూ.3,000 మెట్రో ప్రయాణానికి, రూ.1,000 ఆర్టీసీ ప్రయాణానికి కేటాయించాం. ఈ పాస్ ద్వారా నెలలో గరిష్టంగా 50 సింగిల్ ట్రిప్పులకు మెట్రోలో అనుమతి ఉంటుంది. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణానికి ఎలాంటి పరిమితులు ఉండవు.
ఈ ధరల తగ్గింపుతో నెలవారీ ఉమ్మడి ప్రయాణ పాస్ వినియోగదారులకు రూ.4,500 ఆదా అవుతుంది. రోజువారీ ఉమ్మడి ప్రయాణ పాస్ వినియోగదారులకు రూ.125 ఆదా అవుతుంది.
నవంబర్ 8 నుంచి కొత్త ధరలు అమల్లోకి
మా ప్రభుత్వం ప్రకటించిన తగ్గింపు ధరలు నవంబర్ 8వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయి. ఇందుకు సంబంధించి అవసరమైన ఏర్పాట్లు చేయాలని సంబంధిత సంస్థలను ఆదేశించాం.
ప్రజల సంక్షేమం, ప్రయాణికుల ఆర్థిక ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ మేము తీసుకున్న ఈ నిర్ణయం సామాన్య ప్రజలకు ఎంతో ఊరటనిస్తుందని విశ్వసిస్తున్నాను.
@revanth_anumula @Bhatti_Mallu @TelanganaCMO @INCIndia @INCTelangana
— Ponnam Prabhakar (@Ponnam_INC) November 6, 2026
