AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాఠశాలల్లో AI వినియోగంపై గూగుల్ కీలక నిర్ణయం.. జెమిని ఆఫ్ చేస్తే గూగుల్ సెర్చ్ కూడా బంద్!

టెక్ దిగ్గజం గూగుల్ పాఠశాల విద్యార్థుల కోసం తన ఏఐ విధానంలో కీలక మార్పులు తీసుకొస్తోంది. ఇకపై విద్యార్థులు గూగుల్ జెమిని, జెమిని నోట్‌బుక్, గూగుల్ సెర్చ్ వంటి సేవలను ఉపయోగించాలంటే పాఠశాల యాజమాన్యం అనుమతి తప్పనిసరి కానుంది. పాఠశాలలు ఏఐ సేవలను నిలిపివేస్తే గూగుల్ సెర్చ్ కూడా అందుబాటులో ఉండదని సంస్థ స్పష్టం చేసింది. చిన్నారులపై ఏఐ ప్రభావం, విద్యార్థుల ఆలోచనా సామర్థ్యంపై ఆందోళనల నేపథ్యంలో గూగుల్ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది..

పాఠశాలల్లో AI వినియోగంపై గూగుల్ కీలక నిర్ణయం.. జెమిని ఆఫ్ చేస్తే గూగుల్ సెర్చ్ కూడా బంద్!
Google Changes Ai Policy For Students
Srilakshmi C
|

Updated on: Nov 06, 2026 | 9:59 AM

Share

పాఠశాల విద్యార్థులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాధనాలను ఉపయోగించే విషయంలో టెక్ దిగ్గజం గూగుల్ కీలక మార్పులు తీసుకొస్తోంది. ఇకపై పాఠశాల స్థాయి విద్యార్థులు జెమిని (Gemini), గూగుల్ సెర్చ్ వంటి సేవలను వినియోగించాలంటే పాఠశాల యాజమాన్యం అనుమతి తప్పనిసరి కానుంది. పాఠశాలలు తమ విద్యార్థుల ఖాతాల్లో ఏఐ సేవలను నిలిపివేస్తే, గూగుల్ సెర్చ్ అందుబాటులో ఉండదని సంస్థ స్పష్టం చేసినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ కొత్త విధానం K-12 విద్యార్థుల ఖాతాలకు వర్తించనుంది. గూగుల్ తీసుకొచ్చిన కొత్త విధానం ప్రకారం, పాఠశాల స్థాయి విద్యార్థుల ఖాతాల్లో కొన్ని సేవలు డిఫాల్ట్‌గా నిలిపివేయబడతాయి. వీటిలో గూగుల్ జెమిని, జెమిని నోట్‌బుక్, జెమిని ఇన్ క్లాస్‌రూమ్, గూగుల్ సెర్చ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. పాఠశాల యాజమాన్యం అనుమతించిన తర్వాతే వీటిని విద్యార్థులు ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. దీంతో పాఠశాలలు తమ విద్యా విధానాలు, విద్యార్థుల వయస్సు, అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఏఐ సాధనాలను అనుమతించాలా వద్దా అనే నిర్ణయం తీసుకోవచ్చు. కొత్త విధానానికి అనుగుణంగా మార్పులు చేసుకునేందుకు పాఠశాలలకు రాబోయే నెలల్లో పూర్తి వివరాలను అందించనున్నట్లు గూగుల్ తెలిపింది.

గూగుల్ ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంది?

గూగుల్ విద్యా విభాగం ఉపాధ్యక్షుడు, జనరల్ మేనేజర్ క్రిస్ ఫిలిప్స్ ఒక బ్లాగ్ పోస్ట్ ద్వారా ఈ మార్పులను ప్రకటించారు. పాఠశాలలు, ఉపాధ్యాయులు, పరిశోధకులు, విధాన రూపకర్తల నుంచి వచ్చిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. తరగతి గదుల్లో సాంకేతికత, ఏఐ వినియోగంపై పాఠశాలలకు మరింత నియంత్రణ కల్పించడమే ఈ మార్పుల ప్రధాన ఉద్దేశమని గూగుల్ వెల్లడించింది. విద్యార్థులు ఏ డిజిటల్ సేవలను ఉపయోగించాలో నిర్ణయించుకునే అధికారం పాఠశాలలకే ఉండనుంది.

AIని నిలిపివేస్తే గూగుల్ సెర్చ్ కూడా పనిచేయదా?

గూగుల్ కొత్త విధానంలో అందరినీ ఆశ్చర్యపరుస్తున్న అంశం ఇదే. ప్రస్తుతం గూగుల్ సెర్చ్‌లో కూడా ఏఐ ఆధారిత సాంకేతికత కీలక పాత్ర పోషిస్తోంది. ఈ నేపథ్యంలో పాఠశాలలు విద్యార్థుల ఖాతాల్లో ఏఐ సేవలను పూర్తిగా నిలిపివేస్తే, గూగుల్ సెర్చ్ కూడా అందుబాటులో ఉండదని క్రిస్ ఫిలిప్స్ పేర్కొన్నట్లు సమాచారం. అలాంటి సందర్భాల్లో విద్యార్థులు గూగుల్ సెర్చ్‌ను ఉపయోగించేందుకు ప్రయత్నిస్తే, ఆ సేవను పాఠశాల యాజమాన్యం అందుబాటులో ఉంచలేదని తెలిపే సందేశం స్క్రీన్‌పై కనిపిస్తుంది. దీంతో ఏఐ వినియోగాన్ని నియంత్రించే క్రమంలో విద్యార్థుల సాధారణ ఆన్‌లైన్ సమాచార శోధనపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. మరోవైపు పాఠశాలల్లో ఏఐ సాధనాల వినియోగంపై ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, బాలల అభివృద్ధి నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చిన్న వయసులోనే పిల్లలు ఏఐ చాట్‌బాట్‌లపై ఎక్కువగా ఆధారపడితే వారి స్వతంత్ర ఆలోచనా శక్తి, గ్రహణశక్తి, సమస్యలను పరిష్కరించే సామర్థ్యం తగ్గే ప్రమాదం ఉందని విద్యా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇవి కూడా చదవండి

గూగుల్ క్లాస్‌రూమ్ ఉపయోగించే పాఠశాల విద్యార్థుల కోసం జెమిని చాట్‌బాట్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు సంస్థ ప్రకటించిన తర్వాత ఈ అంశంపై చర్చ మరింత పెరిగింది. గూగుల్ తీసుకున్న ఈ నిర్ణయం పాఠశాలల్లో ఏఐ వినియోగానికి సంబంధించి కొత్త చర్చకు తెరలేపనుంది. ఒకవైపు ఏఐ ద్వారా విద్యార్థులకు సులభంగా సమాచారం, అభ్యాస సహాయం అందే అవకాశం ఉండగా, మరోవైపు పిల్లలు సాంకేతికతపై అతిగా ఆధారపడకుండా చూడాల్సిన బాధ్యత కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఏఐ సాధనాల వినియోగంపై తుది నిర్ణయం తీసుకునే అధికారం పాఠశాలలకు ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Follow Us