Skin Care: చలికాలంలో చర్మం పొడిబారకుండా ఉండాలంటే నూనె ఎప్పుడు రాయాలా తెలుసా?
Winter skin care in Telugu: శీతాకాలం వచ్చిందంటే చాలా మంది ఎదుర్కునే సమస్యల్లో చర్మం పొడిబారడం ఒకటి. ఈ సమస్య నుంచి బయటపడేందుకు చాలా మంది రకరకాల నూనెలు వాడుతూ ఉంటారు. కానీ దాన్ని స్నానానికి ముందా లేక తర్వాతా ఏ టైంలో రాసుకుంటే ఎక్కువ ప్రయోజనం ఉంటుందో చాలా మంది తెలియదు, కాబట్టి చలికాలంలో చర్మానికి నూనెను ఎప్పుడు రాసుకోవాలో ఇక్కడ చూద్దాం.

చలికాలం స్టార్ట్ అయిన వెంటనే చేతులు, కాళ్లపై గోరుతో చిన్నగా గీకినా శరీరంపై తెల్లని గీతలు పడుతుంటాయి. ఈ సమయంలో శీతాకాలపు చర్మ సంరక్షణ కోసం జనాలు మార్కెట్‌లో దొరికే అనేక రకాల క్రీము వాడుతూ ఉంటారు. కానీ ఇవి ఎన్ని ఉన్నా మన ఇంట్లోనే దొరికే సహజ నూనెను ఏవి సాటి రావు. అయితే ఇక్కడ అసలు ప్రశ్న ఏమిటంటే, నూనె సరిగ్గా ఎప్పుడు రాసుకోవాలి? స్నానానికి ముందా, లేక తర్వాతా? చాలా మందికి తెలియదు.
మీ చర్మం ఎక్కువ పొడిగా ఉంటే, తప్పకుండా స్నానం చేసిన తర్వాత నూనె రాసుకోవాలి. ఎందుకంటే స్నానం తర్వాత మన చర్మం పీల్చుకునే తేమను, నూనె రాయడం వల్ల ఆవిరైపోకుండా బంధిస్తుంది. శాస్త్రీయ భాషలో దీనిని ట్రాన్స్ ఎపిడెర్మల్ వాటర్ లాస్ తగ్గించడం అంటారు. దీనివల్ల చర్మం రోజంతా మృదువుగా, తేమగా ఉంటుంది.
దీనికి మరో భిన్నమైన నియమం కూడా ఉంది. ఒంటిపై దద్దురు లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్ లాంటివి ఉంటే, స్నానానికి ముందు పొడి చర్మంపై నూనె రాసుకోవాలి. ఎందుకంటే, నూనె రాసుకుని స్నానం చేయడం వల్ల చర్మం నీటిని పీల్చుకుని మెత్తబడదు. దాంతో ఆ భాగంలో ఫంగస్ లేదా శిలీంధ్రం పెరగడానికి అవకాశం ఉండదు.
ఏ నూనె వల్ల ఏ ప్రయోజనం?
అన్ని నూనెలు ఒకేలా పనిచేసినా.. వాటి గుణాలలో తేడా ఉంటుంది. కాబట్టి మీ చర్మాన్ని బట్టి మీకు ఏ నూనె ఉత్తమమో చూద్దాం.
కొబ్బరి నూనె : ఇది జుట్టుకే కాదు, చర్మానికి కూడా ఇది ఎంతో మేలు చేస్తుంది. ఇందులోని యాంటీమైక్రోబియల్ గుణాలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. పొడి చర్మాన్ని మృదువుగా మార్చడంలో దీనికి తిరుగులేదు.
బాదం నూనె : ఇందులో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. ఇది రాయడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది. అదే తలకు రాస్తే రక్త ప్రసరణ మెరుగుపడి, జుట్టు కూడా మెరుస్తుంది.
నువ్వుల నూనె : పొడి చర్మాన్ని మృదువుగా చేయడానికి ఇది బాగా పనిచేస్తుంది. అంతేకాదు చర్మాన్ని వివిధ ఇన్ఫెక్షన్లను అరికట్టడానికి నువ్వుల నూనె అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, కాబట్టి దీనిని ఆహారంలో తీసుకున్నా చర్మం కోమలంగా ఉంటుంది.
ఆలివ్ ఆయిల్ : చలికాలంలో ఎక్కువ మంది వాడే నూనెల్లో ఇది కూడా ఒకటి. అయితే మన దేశంలో నాణ్యమైన ఆలివ్ ఆయిల్ అంత సులభంగా దొరకదు. మిగతా నూనెలతో పోలిస్తే దీని ధర కూడా చాలా ఎక్కువ.
మొత్తంగా చర్మ సంరక్షణలో నూనె వల్ల కలిగే ప్రయోజనాలు ఒక్క రోజులో కనిపించవు. రోజూ క్రమం తప్పకుండా మసాజ్ చేస్తేనే ఫలితం ఉంటుంది. అయితే, మీ చర్మ తత్వాన్ని బట్టి సరైన నూనెను ఎంచుకోవడం కూడా చాలా ముఖ్యం.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
