AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shubman Gill: గిల్ సెంచరీ కొడితే నన్ను తిడుతున్నారు.. ఆర్సీబీ స్టార్ ఆవేదన

Shubman Gill: శుభ్‌మన్ గిల్ సెంచరీ చేసిన ప్రతిసారీ కేకేఆర్ అభిమానులు తనను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారని ఆర్సీబీ ఆటగాడు వెంకటేశ్ అయ్యర్ వెల్లడించాడు. ఆకాశ్ చోప్రా పాడ్‌కాస్ట్‌లో తన ఆవేదనను బయటపెట్టాడు. ఐపీఎల్ 2022లో గిల్‌ను వదిలేసి తనను కొనసాగించిన కేకేఆర్ నిర్ణయం ఇప్పటికీ విమర్శలకు కారణమవుతోందని తెలిపాడు.

Shubman Gill: గిల్ సెంచరీ కొడితే నన్ను తిడుతున్నారు.. ఆర్సీబీ స్టార్ ఆవేదన
Venkatesh Iyer, Shubman Gill
Rakesh
|

Updated on: Nov 06, 2026 | 11:13 AM

Share

Shubman Gill: క్రికెట్‌లో ఆటగాళ్ల మధ్య పోటీ సహజం. కానీ ఒక ఆటగాడు సెంచరీ చేస్తే మరో ఆటగాడిని సోషల్ మీడియాలో తిట్టడం ఎంతవరకు సమంజసం? ప్రస్తుతం ఆర్సీబీ ఆటగాడు వెంకటేశ్ అయ్యర్ ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నాడు. టీమిండియా స్టార్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ సెంచరీ చేసిన ప్రతిసారీ కేకేఆర్ అభిమానులు తనను టార్గెట్ చేస్తూ కామెంట్లు పెడుతున్నారని వెంకటేశ్ అయ్యర్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఆకాశ్ చోప్రా నిర్వహించిన బైఠ్ అండ్ బోల్ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న అతడు.. గత కొన్నేళ్లుగా ఎదుర్కొంటున్న సోషల్ మీడియా ట్రోలింగ్ గురించి మనసులోని బాధను బయటపెట్టాడు. గిల్ సెంచరీ చేసినప్పుడు కూడా తనపై విమర్శలు ఆగడం లేదని చెప్పుకొచ్చాడు.

గిల్ సెంచరీ చేస్తే నన్నెందుకు తిడతారు?

ఐపీఎల్ 2022 సీజన్‌కు ముందు కోల్‌కతా నైట్‌రైడర్స్ తీసుకున్న నిర్ణయమే ఈ వివాదానికి కారణం. అప్పట్లో శుభ్‌మన్ గిల్ లాంటి టాలెంటెడ్ ఆటగాడిని కేకేఆర్ వదులుకుంది. మరోవైపు వెంకటేశ్ అయ్యర్‌ను రూ.8 కోట్లకు రిటైన్ చేసుకుంది. ఈ నిర్ణయంపై అప్పటి నుంచి కేకేఆర్ అభిమానుల్లో కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గిల్ మరో జట్టుకు వెళ్లి అద్భుతంగా ఆడుతుండటంతో ఆ విమర్శలు మరింత పెరిగాయి. ముఖ్యంగా గిల్ సెంచరీ చేసిన ప్రతిసారీ కేకేఆర్ సోషల్ మీడియా ఖాతాల్లో వెంకటేశ్‌ను ఉద్దేశించి కామెంట్లు పెడుతున్నారని అతడు తెలిపాడు.

వజ్రం కోసం వెళ్లి బంగారాన్ని పోగొట్టుకున్నామంటూ..

కేకేఆర్ అభిమానుల నుంచి వస్తున్న కామెంట్ల గురించి వెంకటేశ్ అయ్యర్ మాట్లాడుతూ.. చాలా కాలంగా తనపై ద్వేషపూరిత వ్యాఖ్యలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశాడు. ముఖ్యంగా శుభ్‌మన్ గిల్ సెంచరీ చేసినప్పుడు కేకేఆర్ సోషల్ మీడియా పేజీకి వెళ్తే బంగారం కోసం వెతుకుతూ వజ్రాన్ని పోగొట్టుకున్నాం అంటూ కామెంట్లు పెడుతున్నారని చెప్పాడు. గిల్‌ను వదిలేసి తనను కొనసాగించడంపై అభిమానులు ఇప్పటికీ తనను తప్పుపడుతున్నారని వివరించాడు. అయితే అప్పట్లో జట్టు యాజమాన్యం తీసుకున్న నిర్ణయంలో తన పాత్ర ఏమీ లేదని, అయినా ఆ విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తోందని అతడి మాటల్లో బాధ కనిపించింది.

వెంకటేశ్ కోసం రూ.23.75 కోట్లు ఖర్చు చేసిన కేకేఆర్

ఐపీఎల్ వేలంలో వెంకటేశ్ అయ్యర్ చుట్టూ ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఐపీఎల్ 2025 మెగా వేలంలో అతడిని తిరిగి దక్కించుకునేందుకు కేకేఆర్ ఏకంగా రూ.23.75 కోట్లు ఖర్చు చేసింది. ఆ వేలంలో ఆర్సీబీ కూడా అతడి కోసం పోటీపడింది. అయితే 2025 సీజన్‌లో 11 మ్యాచ్‌లు ఆడిన వెంకటేశ్ 142 పరుగులే చేయగలిగాడు. ఆ తర్వాత ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు కేకేఆర్ అతడిని జట్టు నుంచి విడుదల చేసింది. ఈ సమయంలో మళ్లీ కేకేఆర్‌లో కొనసాగే అవకాశం ఉందా అనే ఆశతో యాజమాన్యాన్ని సంప్రదించినట్లు పాడ్‌కాస్ట్‌లో గుర్తుచేసుకున్నాడు. సహ యజమాని షారుఖ్ ఖాన్‌ను కూడా ఈ విషయంపై అడిగినట్లు వెల్లడించాడు. చివరకు ఆర్సీబీ జట్టులో చేరాడు.

జెర్సీకి పూజలు చేయడం ఎక్కడా చూడలేదు

ఆర్సీబీలో చేరిన తర్వాత తనకు ఎదురైన అనుభవాల గురించి కూడా వెంకటేశ్ ఆసక్తికర విషయాలు చెప్పాడు. ఆర్సీబీ అభిమానుల్లో ఉండే అభిమానం, ఆటపై వారికున్న ప్రేమ తనను ఆశ్చర్యపరిచాయని తెలిపాడు. మ్యాచ్‌కు ముందు కొంతమంది అభిమానులు ఆర్సీబీ జెర్సీకి పూజలు చేయడం తాను చూశానని చెప్పాడు. ఇంతటి అభిమానం గతంలో ఎప్పుడూ చూడలేదని, ఆర్సీబీ అభిమానుల అభిమానం నెక్ట్స్ లెవల్ ఉంటుందని ప్రశంసించాడు. ఒకవైపు కేకేఆర్ అభిమానుల నుంచి ట్రోలింగ్ ఎదుర్కొన్న వెంకటేశ్.. మరోవైపు ఆర్సీబీ అభిమానుల నుంచి లభిస్తున్న ఆదరణను ప్రత్యేకంగా ప్రస్తావించాడు. మొత్తానికి శుభ్‌మన్ గిల్ సెంచరీలతో మొదలైన ఈ ట్రోలింగ్ వ్యవహారం ఇప్పుడు క్రికెట్ అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us