వారెవ్వా.. ఈ రైతన్నది సూపర్ ఐడియా.. వరి గట్లపై ఇవి వేసి భలే ఆదాయం పొందుతున్నాడు..
తూర్పు గోదావరి జిల్లాకు చెందిన రైతు అనిల్ కుమార్ ప్రకృతి వ్యవసాయ విధానంలో వరి సాగు చేస్తూనే, పొలం గట్లపై కూరగాయలు, పండ్ల మొక్కలు సాగు చేస్తున్నారు. రసాయనాలకు స్వస్తి పలికి, సేంద్రియ పద్ధతులు, దేశీ విత్తనాలు ఉపయోగిస్తూ అధిక దిగుబడి, అదనపు ఆదాయం పొందుతున్నారు. ఇది ఇతర రైతులకు లాభదాయకమైన మార్గాన్ని చూపుతోంది.

నేటి వ్యవసాయ రంగంలో పెరుగుతున్న పెట్టుబడులు, తగ్గుతున్న దిగుబడులు, మార్కెట్లో సరైన ధరలు లభించకపోవడం వంటి కారణాల వల్ల రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారు. ఆరుగాలం కష్టపడుతున్న అన్నదాతకు అప్పులే మిగులుతున్నాయి. అయితే, కాలానికి అనుగుణంగా సాగు పద్ధతుల్లో మార్పులు చేపడితే నష్టాల సేద్యాన్ని లాభాల వైపు మళ్లించవచ్చని కొందరు రైతులు నిరూపిస్తున్నారు. ఈ కోవలోనే తూర్పు గోదావరి జిల్లా, కొవ్వూరు మండలం, దొమ్మేరు గ్రామానికి చెందిన రైతు అనిల్ కుమార్ ప్రకృతి వ్యవసాయ విధానంలో వరి పంట పండిస్తూనే, వరి గట్లపై కూరగాయలు సాగు చేస్తూ అదనపు ఆదాయాన్ని పొందుతున్నారు.
ఒకప్పుడు రైతులు సమీకృత వ్యవసాయం చేసేవారు. పాడి పరిశ్రమ నుంచి వచ్చే వ్యర్థాలను పంట పొలాలకు, పంట పొలాల వ్యర్థాలను పాడి పరిశ్రమకు ఉపయోగించుకుంటూ పెట్టుబడులు తగ్గించుకుని నాణ్యమైన దిగుబడులు పొందేవారు. పంట దెబ్బతిన్నా అనుబంధ రంగాల ద్వారా ఆ లోటును పూడ్చుకునేవారు. కానీ, క్రమంగా వాణిజ్య పంటలకు మొగ్గు చూపి, ఏక పంట విధానాన్ని అనుసరించడం వల్ల ప్రకృతి విపత్తులు, వాతావరణ మార్పులతో నష్టాలు చవిచూడాల్సి వచ్చింది. పంట దిగుబడి వచ్చినా, ఆదాయం సంవత్సరానికి ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే చేతికి అందేది. ఈ సమస్యలను అధిగమించేందుకు అనిల్ కుమార్ వంటి రైతులు కొత్త ఆలోచనలకు శ్రీకారం చుట్టారు.
అనిల్ కుమార్ ఖరీఫ్‌లో ఎకరంలో పీఎల్ 11 రకం వరిని సాగు చేశారు. పొలం గట్లు ఖాళీగా ఉండటాన్ని గుర్తించి, వాటిపై ఉద్యాన పంటలైన కూరగాయలు, పండ్ల మొక్కలను నాటారు. ముఖ్యంగా బెండ, బీర, మిరప, పొద చిక్కుడు, గోరు చిక్కుడు, టమాటా, వంగ, పచ్చిమిర్చి వంటి కూరగాయలతో పాటు పండ్ల మొక్కలను సాగు చేస్తున్నారు. ఈ ప్రయత్నం ఇప్పటికే ఆయనకు లాభాలను తెచ్చిపెడుతోంది. ముఖ్యంగా బీర పంట నుండి ఇప్పటికే దిగుబడులను పొందుతూ, వచ్చిన ఆదాయంతో ప్రధాన పంటకు కావాల్సిన పెట్టుబడిని సమకూర్చుకుంటున్నారు.
అనిల్ కుమార్ 2015 నుంచి రసాయన మందులను పూర్తిగా మానేసి, ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అనుసరిస్తున్నారు. మొదట్లో దేశీ విత్తనాలు (బర్మా బ్లాక్ లాంగ్, ఇంద్రాణి, నవార, రత్నచోడి) వాడినా, దిగుబడి తక్కువ రావడం, అధిక వర్షపాతం కారణంగా ప్రస్తుతం పీఎల్ 1100 రకాన్ని సాగు చేస్తున్నారు. ఈ రకం ఎకరానికి 40 బస్తాల దిగుబడిని ఇస్తోంది. నాటు పద్ధతికి బదులుగా వెదజల్లే పద్ధతిని అనుసరించి ఎకరానికి రూ. 5000 ఆదా చేసుకుంటున్నారు.
పంటకు బయోచార్, జీవామృతం, ఘనజీవామృతం వంటి సేంద్రియ ఎరువులను వాడటం ద్వారా రసాయన ఎరువుల ఖర్చును పూర్తిగా తగ్గించుకున్నారు. తెగుళ్ల నివారణకు వేప గింజల కషాయం, పేడమూత్రం ద్రావణం, అగ్నాస్త్రం, దశపర్ణి కషాయం, కోడిగుడ్డు-నిమ్మరసం మిశ్రమం వంటి సహజసిద్ధమైన ద్రావణాలను ఉపయోగిస్తున్నారు. దీనివల్ల తెగుళ్లు, వర్షాలు, తుఫానుల వల్ల కలిగే నష్టం నుండి పంటను కాపాడుకోగలుగుతున్నారు. ఇటీవల తుఫాను వచ్చినప్పుడు కూడా ఆయన పొలం నిలబడి ఉండగా, పక్కన రసాయన వ్యవసాయ పొలాలు దెబ్బతిన్నాయని తెలిపారు. స్థానిక కలెక్టర్ కూడా ఆయన పొలాన్ని సందర్శించి అభినందించడం విశేషం.
తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి, భూసారం పెంపుదల కోసం అనిల్ కుమార్ RDS (రబీ డ్రై సోయింగ్), PMDS (ప్రీ-మాన్‌సూన్ డ్రై సోయింగ్) వంటి పద్ధతులలో నవధాన్యాలను వేసి, పచ్చిరొట్ట ఎరువును మల్చింగ్‌గా ఉపయోగించడం ద్వారా సేంద్రియ కర్బనాన్ని పెంచి, కలుపు మందుల అవసరాన్ని తగ్గించారు.
ప్రకృతి వ్యవసాయం వల్ల అనిల్ కుమార్ కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉన్నారు. మొదట్లో లేని కస్టమర్లు ఇప్పుడు ఆయన పొలం దగ్గరికే వచ్చి కూరగాయలు, టమాటాలు, బెండకాయలు, బీరకాయలు కొనుగోలు చేస్తున్నారు. సోమవారాల్లో ఆర్డీవో కార్యాలయం వద్ద తన కూరగాయలను విక్రయిస్తున్నారు. పీఎల్ 1100 రకం బియ్యం కిలో రూ. 50కి, 75 కిలోల ధాన్యం రూ. 2200కి విక్రయిస్తున్నారు. బీర సాగు ద్వారా రోజుకు రూ. 1000 వరకు (నెలకి రూ. 30,000) ఆదాయం పొందుతున్నారు. ఇతర పంటలతో కలిపి నెలకు సుమారు రూ. 50,000 వరకు సంపాదిస్తూ అనిల్ కుమార్ లాభసాటి వ్యవసాయానికి మార్గదర్శకంగా నిలుస్తున్నారు.
