Viral News: ఏమైందని చూసేందుకెళ్లిన స్థానికులు.. ఏడుగురిని మింగేసిన మృత్యువు
జార్ఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై అదుపుతప్పి పడిపోయిన స్కూటీ వాహనదారుడికి సహాయం చేసేందుకు వెళ్లిన ఏడుగురు వ్యక్తులను ఓ భారీ ట్రక్కు అతివేగంతో వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వారు ప్రాణాలు కోల్పోయారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ప్రమాదం జరిగిందని సహాయం చేసేందుకు వెళ్లిన ఏడుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన జార్ఖండ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఖుంటీ జిల్లా కర్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్రా-టోర్పా ప్రధాన రహదారిపై గురువారం రాత్రి సుమారు 9:45 గంటలకు జోన్-లుడ్రు మలుపు సమీపంలో ఓ స్కూటీ డ్రైవర్ అదుపుతప్పి పడిపోయాడు. అది గమనించిన అటుగా వెళ్తున్న వాహనదారులు, స్థానికులు అతనికి సహాయం చేసేందుకు అక్కడికి వెళ్లారు.
ఇంతలో టోర్పా వైపు నుంచి వేగంగా వచ్చిన ఓ భారీ ట్రక్కు.. ప్రమాదానికి గురైన వ్యక్తికి సహాయం చేసేందుకు వెళ్లిన వారిపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మరణించగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారంతో వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు.. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే 12 ఏళ్ల సౌరభ్ నాయక్ అనే బాలుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. దీంతో ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య ఏడుకు చేరింది.
ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. మృతుల్లో పాకో దేవి, కాసిలా దేవి, మన్హు దేవి, గోలు కుమార్, అంజలి కుమారి, టుటి కుమారి, 12 ఏళ్ల సౌరభ్ నాయక్ ఉన్నారు. వీరంతా స్థానికంగా ఉన్న ఓ గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.
ఈ ప్రమాదానికి కారణమైన ట్రక్కు డ్రైవర్ ప్రమాద సమయంలో మద్యం మత్తులో ఉన్నాడని స్థానికులు ఆరోపించారు. ట్రక్కు టోర్పా నుంచి కర్రా వైపు అతివేగంగా, నిర్లక్ష్యంగా వచ్చినట్లు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ అక్కడి నుంచి పరారైనట్లు స్థానికులు వెల్లడించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
