AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: హైదరాబాద్ టూ బెంగళూరు.. ఇక 2 గంటల్లోనే.. రయ్ రయ్‌మంటూ హాయిగా వెళ్లిపోవచ్చు..

ప్రస్తుతం 8 వందేభారత్ సర్వీసులు ,8 అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ సర్వీసులు వివిధ మార్గాల్లో నడుస్తున్నాయి. 2014 నుంచి, దాదాపు 1,700 కి.మీ రైల్వే ట్రాక్‌లు నిర్మించారు. ఇది శ్రీలంక మొత్తం రైలు నెట్‌వర్క్ కంటే ఎక్కువ. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Telangana: హైదరాబాద్ టూ బెంగళూరు.. ఇక 2 గంటల్లోనే.. రయ్ రయ్‌మంటూ హాయిగా వెళ్లిపోవచ్చు..
Bangalore
Gopikrishna Meka
| Edited By: |

Updated on: Feb 03, 2026 | 8:52 AM

Share

కేంద్ర బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాల రైల్వే ప్రాజెక్టులకు రికార్డు స్థాయిలో నిధుల కేటాయింపు జరిగినట్లుగా ప్రకటించారు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్. రాష్ట్రాల వారీగా రైల్వే బడ్జెట్ కేటాయింపులు, హైస్పీడ్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులు, ఆయా రాష్ట్రాల వారీగా జరుగుతున్న అభివృద్ధి పనులను అశ్విని వైష్ణవ్ తెలిపారు. బడ్జెట్‌లో ప్రకటించిన ఏడు హైస్పీడ్ ట్రైన్ కారిడార్లలో మూడు హైస్పీడ్ ట్రైన్స్‌తో త్వరలోనే హైస్పీడ్ బుల్లెట్ ట్రైన్ మేజర్ హబ్‌గా హైదరాబాద్ మారబోతోంది. ఇది తెలంగాణ ఆర్థిక అభివృద్ధికి ఎంతగానో దోహదపడనుంది. రవాణా సహా అనేక కీలక అంశాల్లో తెలంగాణకి లబ్ధి చేకూరనుంది. హెల్త్ కేర్, ట్రాన్స్ పోర్ట్, ఎడ్యుకేషన్ రంగాలకు బుల్లెట్ ట్రెయిన్స్ ఊతం ఇవ్వనున్నాయి. హైదరాబాద్, చెన్నై, బెంగుళూరును కలిపే బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు దక్షిణాది రాష్ట్రాలకు డైమెండ్ ప్రాజెక్ట్‌గా నిలవనుంది. వీలైనంత త్వరగా సమగ్ర ప్రాజెక్టు నివేదికలు రూపొందించడం అలైన్మెంట్స్ ఖరారు చేయనున్నట్లు కేంద్రమంత్రి వెల్లడించారు. తెలంగాణ నుంచి హైదరాబాద్– చెన్నై, హైదరాబాద్–పూణే, హైదరాబాద్ – బెంగళూరుకు మూడు కొత్త హైస్పీడ్ ట్రైన్లు రానున్నాయి. గంటకు 350 కి.మీ వేగంతో ఈ ట్రైన్లు ప్రయాణిస్తూ ఆయా ప్రాంతాలతో కనెక్టివిటీ కలిగి ఉండనున్నాయి. డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్(డీపీఆర్), అలైన్ మెంట్స్ ఫైనలైజ్ కాగానే.. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పనులు ప్రారంభించనున్నట్లు అశ్విని వైష్ణవ్ తెలిపారు.

మూడు గంటల్లో హైదరాబాద్ నుంచి ముంబై, చెన్నై, బెంగళూరు..

బుల్లెట్ ట్రైన్స్ ఆపరేషన్‌లలోకి వస్తే.. హైదరాబాద్ నుంచి కీలక మెట్రోపాలిటన్ నగరాలైన ముంబై, బెంగళూరు, చెన్నై, పూణేలకు కేవలం మూడు గంటల్లోపే చేరుకోవచ్చు. ప్రధానంగా హైదరాబాద్–పూణేకు కేవలం 1:55 గంటల్లో, పూణే–ముంబయి 48 నిమిషాల్లో చేరుకోవచ్చు. అంటే హైదరాబాద్–ముంబాయికి కేవలం 2:30 నిమిషాల్లో ఈ హైస్పీడ్ ట్రైన్స్‌తో రీచ్ అవ్వొచ్చు. హైదరాబాద్–చెన్నైకు మూడు గంటల లోపు, హైదరాబాద్–బెంగళూరు రెండు గంటల్లో చేరుకోవచ్చు. బుల్లెట్ ట్రైన్‌తో మూడు మెట్రోపాలిటన్ సిటీల మధ్య కనెక్టివిటీలో గేమ్ చేంజర్‌గా హైదరాబాద్ మారనుంది. ఈ విషయంలో తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు అశ్విని వైష్ణవ్. మొదటి దశలో ముంబాయి–అహ్మదాబాద్‌కు హైస్పీడ్ ట్రైన్ ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా టెక్నికల్, డిజైన్, ఎలక్ట్రికల్ టీం అన్ని అంశాలను ఇప్పటికే పరిశీలించింది. ఇది సక్సెస్ కావడంతో సెకండ్ ఫేజ్‌లో దేశంలోని ఏడు ముఖ్య నగరాలను కలిపేలా కేంద్రం ఏడు బుల్లెట్ ట్రైన్లు తీసుకువచ్చింది. ఇందులో నార్త్‌కు రెండు, సౌత్–వెస్ట్ రాష్ట్రాలకు మిగిలిన ఐదు ట్రైన్లు ప్రకటించారు. ఈ ప్రాజెక్ట్‌లు పూర్తి అయిన తర్వాత.. దేశవ్యాప్తంగా మరిన్ని హైస్పీడ్ బుల్లెట్ ట్రైన్లు తీసుకురానుంది కేంద్రం. బుల్లెట్ ట్రైన్ కారిడార్లు అన్నీ ఎలివేటెడ్ కారిడార్లుగా ఉండనున్నాయి. రైల్వే ప్రాజెక్టులకు భూసేకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలని కేంద్రమంత్రి కోరారు. డిజైన్ డిపిఆర్‌లు సిద్ధమైన తరువాత బుల్లెట్ రైలు పనులు ప్రారంభం కానున్నాయి.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: గంగమ్మకు మొక్కి చెరువులో వల వేసిన జాలరి.. చిక్కింది చూసి స్టన్

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..