Hyderabad: సింగరేణి కాలనీ ఘటనపై పోలీసుల నజర్.. వారందరిపై కేసులు నమోదు..!
Hyderabad: సింగరేణి కాలనీ ఘటనపై నగర పోలీసులు నజర్ పెట్టారు. చిన్నారి హత్యాచారం ఘటన తరువాత పోలీసులపై దాడి చేసిన వారిపై కేసులు నమోదు చేశారు.
Hyderabad: సింగరేణి కాలనీ ఘటనపై నగర పోలీసులు నజర్ పెట్టారు. చిన్నారి హత్యాచారం ఘటన తరువాత పోలీసులపై దాడి చేసిన వారిపై కేసులు నమోదు చేశారు. సింగరేణి కాలనీకి చెందిన చిన్నారి చైత్రపై నిందితుడు రాజు అత్యచారం, ఆపై హత్య చేసిన విషయం తెలిసిందే. చిన్నారి మృతదేహం తరలింపు సమయంలో సింగరేణి కాలనీలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆ సమయంలో సింగరేణి కాలనీ వాసులు కొందరు పోలీసులపై రాళ్లు రువ్వారు. ఆ ఘటనలో దాదాపు 12 మంది పోలీసులకు తీవ్ర గాయాలు అయ్యాయి. అయితే, ఇప్పుడు ఆ ఘటనపై పోలీసులు ఫోకస్ పెట్టారు. వీడియో ఫుటేజీ ఆధారంగా దాడి చేసిన వారిని గుర్తించి పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. మరోవైపు సింగరేణి కాలనీలో గంజాయి, గుడుంబా విచ్చలవిడిగా విక్రయిస్తున్నట్లు స్థానిక ప్రజలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ అంశాన్ని కూడా పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. అక్రమ మద్యం, గంజాయి, గుడుంబాలను అరికట్టడమే ధ్యేయంగా చర్యలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు పోలీసులు. సింగరేణి కాలనీలో త్వరలోనే కార్డన్ సెర్చ్ నిర్వహించేందుకు పోలీసులు ప్లాన్ వేస్తున్నారు. వినాయక నిమజ్జనం హడావుడి పూర్తయిన తరువాత కార్డెన్ సెర్చ్ నిర్వహించనున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.
ఇదిలాఉంటే.. హైదరాబాద్ సైఫాబాద్‌లోని భరోసా సెంటర్‌లో ఆడ పిల్లలకు, పోలీసు ఉన్నతాధికారులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్, నగర పోలీసు అదనపు కమిషనర్, షీ టీమ్, భరోసా ఇన్ ఛార్జ్ శిఖా గోయల్ తో పాటు పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు. తాజాగా సింగరేణి కాలనీ ఘటన నేపథ్యంలో భరోసా కేంద్రంలో అవగాహన కార్యక్రమం చేపట్టినట్లు శిఖా గోయల్ తెలిపారు. యువతకు, చిన్న పిల్లలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పై అవగాహన కల్పించనున్నట్లు పేర్కొన్నారు. ఆడ పిల్లలకు ఆపద వచ్చినప్పుడు ఎలా స్పందించాలో ఈ కార్యక్రమం ద్వారా అవగాహన కల్పిస్తున్నామన్నారు. సింగరేణి కాలనీ తరహా ఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించామని చెప్పారు. దశలవారీగా నగరంలోని పలు కాలనీలు, బస్తీల పిల్లలకు అవగాహన కల్పిస్తామన్నారు. ఆడపిల్లలకే కాకుండా అబ్బాయిలకు కూడా ఈ తరహా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని యువతులు వారి అభిప్రాయం వ్యక్తం చేశారని, తల్లిదండ్రులు సైతం అబ్బాయిలకు చిన్న పిల్లల నుండి వృద్ధురాలి వరకు మహిళలను గౌరవించడం నేర్పించాల్సిన అవసరం ఉందని వారు కోరారన్నారు.
Also read:
IPL 2021: 14 ఏళ్ల ఎదురుచూపులు ఫలించేనా..? ఢిల్లీ క్యాపిటల్స్ రాత మర్చేందుకు సిద్ధమంటోన్న రిషబ్ పంత్