AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cyber Crime: సైబర్ నేరగాళ్లు డబ్బులు కొట్టేశారా? స్టేషన్‌కు వెళ్లకుండానే ఇలా డబ్బు రికవరీ చేసుకోండి!

హైదరాబాద్ పోలీసులు 'C-Mitra'తో సైబర్ నేర నియంత్రణలో విప్లవాత్మక అడుగు వేశారు. దేశంలోనే తొలి వర్చువల్ సైబర్ హెల్ప్‌డెస్క్ ను ఏర్పాటు చేసి. కేవలం 10 రోజుల్లో 100కి పైగా FIRలను నమోదు చేసి రికార్డ్ క్రియేట్ చేశారు. బాధితులు పోలీస్ స్టేషన్లకు వెళ్లకుండానే వేగవంతమైన న్యాయం అందిస్తున్నారు. AI సాయంతో ఫిర్యాదులు నమోదు చేసి, సైబర్ నేర బాధితులకు నమ్మకాన్ని పెంచుతున్నారు. హైరాబాద్‌ పోలీసులు శ్రీకారం చుట్టిన ఈ సేవలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి.

Cyber Crime: సైబర్ నేరగాళ్లు డబ్బులు కొట్టేశారా? స్టేషన్‌కు వెళ్లకుండానే ఇలా డబ్బు రికవరీ చేసుకోండి!
Hyderabad Police C Mitra
Lakshmi Praneetha Perugu
| Edited By: |

Updated on: Jan 19, 2026 | 7:00 PM

Share

సైబర్ నేరాల నియంత్రణలో హైదరాబాద్ పోలీసులు మరో కీలక ముందడుగు వేశారు. దేశంలోనే తొలిసారిగా ప్రారంభించిన వర్చువల్ సైబర్ హెల్ప్‌డెస్క్‌ ‘C-Mitra’ ద్వారా కేవలం 10 రోజుల్లోనే 100కి పైగా FIRలు నమోదు చేయడంలో రికార్డ్ క్రియేట్ చేశారు. సాంకేతికతను ప్రజాసేవకు మరింత చేరువ చేస్తూ, సైబర్ నేర బాధితులకు వేగవంతమైన, సులభమైన న్యాయం అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. C-Mitra ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటికే వెయ్యికి పైగా సైబర్ నేర బాధితులకు ఫోన్ కాల్స్ ద్వారా ప్రత్యక్షంగా సహాయం అందించారు. రోజుకు సగటున 100 కాల్స్ చేస్తున్న ఈ ప్రత్యేక బృందం, బాధితుల సమస్యలను ఓర్పుగా విని, తక్షణ పరిష్కార దిశగా చర్యలు చేపడుతోంది. ముఖ్యంగా 1930 హెల్ప్‌లైన్‌కు వచ్చిన కాల్స్‌ లేదా నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌లో నమోదైన ఫిర్యాదులపై వెంటనే స్పందిస్తూ, బాధితుల్లో నమ్మకం పెంచుతోంది.

స్టేషన్‌కు వెళ్లకుండానే ఫిర్యాదు చేసే ఛాన్స్

ఈ కార్యక్రమంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో లీగల్ ఫిర్యాదు డ్రాఫ్ట్‌లను సిద్ధం చేయడం మరో విశేషం. బాధితులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా, వారి ఫిర్యాదును సక్రమంగా రూపొందించి FIRగా నమోదు చేసే విధానాన్ని C-Mitra అమలు చేస్తోంది. FIR నమోదు అయిన వెంటనే దాని కాపీ నేరుగా బాధితుల మొబైల్‌కు మెసేజ్ రూపంలో పంపడం ద్వారా పారదర్శకతను మరింత పెంచింది.

నిరంతర సేవలు

ప్రస్తుతం C-Mitra కోసం 24 మంది సభ్యులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ బృందం రెండు షిఫ్టుల్లో నిరంతరంగా సేవలందిస్తూ, సైబర్ నేరాలపై ఫిర్యాదు చేసిన ప్రతి ఒక్కరికీ తక్షణ సహాయం అందిస్తోంది. ఇందులో మహిళా కానిస్టేబుళ్లు కీలక పాత్ర పోషిస్తూ, మానవతా దృక్పథంతో బాధితులను ధైర్యపరచడం ప్రత్యేకంగా ప్రశంసలు అందుకుంటోంది.

దేశానికే ఆదర్శం

సైబర్ నేరాల సంఖ్య రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో, C-Mitra లాంటి వినూత్న కార్యక్రమాలు ప్రజలకు ఎంతో ఊరటనిస్తున్నాయి. టెక్నాలజీని సమర్థవంతంగా వినియోగిస్తూ, పోలీస్ స్టేషన్‌కు వెళ్లకుండానే న్యాయం అందేలా చేస్తున్న హైదరాబాద్ పోలీసుల ఈ ప్రయత్నం దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలుస్తోంది. సైబర్ నేరాలపై పోరాటంలో హైదరాబాద్ పోలీసులు చేపట్టిన ఈ డిజిటల్ విప్లవం భవిష్యత్తులో మరింత విస్తరించే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.