Hydarabad: పరాయి వ్యక్తితో కనిపించిన భార్య.. ఆగ్రహంతో భర్త ఏం చేశాడంటే?
వివాహేతర సంబంధాలు ఇటీవలి కాలంలో పచ్చని కాపురంలో చిచ్చు పెడుతున్నాయి. వేద మంత్రాల నడుమ పెళ్లి చేసుకుని.. సంప్రదాయాలకు విలువ ఇవ్వడం మర్చిపోయి కట్టుకున్నవారినే కడతేర్చుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే హైదరాబాద్‌లో వెలుగు చూసింది. భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుదని తెలిసిన వ్యక్తి.. ఇద్దరిపై కత్తితో దాడి చేశారు. ఈ దాడితో భార్య ప్రియుడు మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

హైదరాబాద్ నగరం పాతబస్తీలోని కామాటిపుర పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న మహారాజ్ గంజ్ ప్రాంతంలో శనివారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ దారుణానికి వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. కట్టుకున్న భార్య వేరే వ్యక్తితో సంబంధం పెట్టుకుందని తెలుసుకున్న భర్త.. ఆగ్రహావేశాలకు ఊగిపోయి.. భార్యతో పాటు ఆమె ప్రియుడు అమిత్ సింగ్ అనే వ్యక్తిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన అమిత్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ చనిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రవి అనే వ్యక్తి తన భార్యకు అమిత్ అనే వ్యక్తితో గత కొన్నేళ్లుగా వివాహేతర సంబంధం ఉందని తెలుసుకున్నాడు. దీంతో ఈ విషయమై తీవ్ర ఆగ్రహానికి గురై పదునైన కత్తితో మహారాజ్ గంజ్ ప్రాంతానికి చేరుకుని.. అక్కడ తన భార్య, ఆమె ప్రియుడిపై దాడి చేశాడు. ఈ దాడిలో భార్య ప్రియుడు అమిత్ తీవ్రంగా గాయపడగా, గమనించిన స్థానికులు అతన్ని వెంటనే చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో అమిత్ చికిత్స పొందుతూ మృతి చెందాడు.
సమాచారం అందుకున్న కామాటిపుర పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని విచారణ ప్రారంభించారు. ఘటనకు సంబంధించి సాక్ష్యాలను సేకరించిన పోలీసులు.. నిందితుడు రవిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఇటీవల కూడా భార్యాభర్తలు ఈ విషయమై గొడవ పడుతున్న వీడియో ఒకటి పోలీసుల దృష్టికి వచ్చింది. ప్రస్తుతం నిందితుడి కోసం గాలింపు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో మహారాజ్ గంజ్ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొనగా.. పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. కేసుపై పూర్తిస్థాయి దర్యాప్తు కొనసాగుతోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
