Telangana: తెలంగాణలో మరో కొత్త పథకం.. వారందరీ అకౌంట్లోకి రూ.2 లక్షలు.. నిధులు విడుదల
మహిళల కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెడుతోంది. ఇప్పటికే ఉచిత బస్సు, రూ.500కే గ్యాస్ సిలిండర్ వంటి పథకాలు వారి కోసం అమలు చేస్తోంది. ఇక డ్వాక్రా మహిళలకు స్త్రీ శక్తి పేరుతో రుణాలు అందిస్తోంది. ఈ క్రమంలో మహిళల కోసం మరో ప్రత్యేక పథకం ప్రారంభించింది.

తెలంగాణలోని మహిళలను ఆర్ధికంగా అభివృద్ది చేసేందుకు, వాళ్లు సొంత కాళ్ల మీద నిలబడేందుకు ప్రభుత్వం మరో సరికొత్త పథకాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. మహిళలే సొంతగా డెయిరీ బిజినెస్ స్టార్ట్ చేసి ఆదాయం పొందేలా సహాయం అందించనుంది. ఈ పధకం ద్వారా మహిళలు నెలకు రూ. 20 వేల నుంచి రూ.40 వేల వరకు డబ్బులు సంపాదించుకోవచ్చు. మహిళలను ఆర్ధికంగా శక్తివంతులను చేయడానికి, వారికి కొత్త ఆదాయ వనరులను సృష్టించేందుకు ప్రభుత్వం ఈ కొత్త స్కీమ్‌ను ప్రారంభిస్తోంది. ఈ పథకం పేరు ఏంటి..? మహిళలు ఎలా చేసుకోవాలి..? అనే పూర్తి వివరాలు చూద్దాం.
ఇందిరా డెయిరీ ప్రాజెక్ట్
మహిళలకు డెయిరీ రంగంలో అవకాశాలు కల్పించేందుకు ఇందిరా డెయిరీ ప్రాజెక్ట్‌ను తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది. దీని ద్వారా మహిళలకు రూ.2 లక్షల విలువ చేసే రెండు గేదెలను ప్రభుత్వం అందించనుంది. ఈ అమౌంట్‌లో 70 శాతం అంటే రూ.1.4 లక్షలు ప్రభుత్వం సబ్సిడీ రూపంలో అందించనుండగా.. మిగిలిన అమౌంట్ బ్యాంక్ రుణం రూపంలో ఇవ్వనుంది. అలాగే పశువులకు గడ్డి, షెడ్లు కూడా ప్రభుత్వం అందించనుంది. దీని ద్వారా మహిళలు నెలకు రూ.40 వేల వరకు కూడా సంపాదించుకోవచ్చు.
రూ.40 వేల వరకు ఆదాయం
రెండు గేదెలు రోజుకు 20 లీటర్ల వరకు పాలు ఇవ్వనున్నాయి. అంటే నెలకు రూ.40 వేల వరకు సంపాదించుకోవచ్చు. ఖర్చులు పోను మహిళలకు రూ.20 వేల వరకు నెలకు మిగులుతాయి. ప్రస్తుతం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్, మధిరలో ఈ పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నారు. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించనుండగా.. ఇందుకోసం రూ.781 కోట్ల బడ్జెట్ కేటాయించారు. ప్రస్తుతం ఈ పథకం కోసం రూ.286 కోట్లు విడుదల చేశారు.
