Telangana Weather: ముందే మొదలైన వేసవి.. తెలంగాణలో ఉక్కపోత

ఏంట్రా బాబోయ్ ఈ చలి..మరీ ఇలా చంపేస్తోంది. ఇది నిన్న మొన్నటి వరకూ వినిపించిన మాటలు. ఇప్పుడు సీన్ మారింది. ఏంటో అప్పుడే ఈ ఉక్కపోత అని నిట్టూరుస్తున్నారు. తెలంగాణలోని వాతావరణంలో ఇంత తొందరగా మార్పులు వచ్చేశాయి. జనవరి మొదటి వారం నుంచి గడగడ వణికిపోయేలా చలి గాలులు వీచాయి. మధ్యాహ్నం కాస్త ఎండపొడ అనిపించినా..సాయంత్రం 5 గంటల నుంచే మళ్లీ చలి మొదలైపోయింది.  కానీ..

Telangana Weather: ముందే మొదలైన వేసవి.. తెలంగాణలో ఉక్కపోత
Temperatures Rise
Follow us
Ram Naramaneni

|

Updated on: Feb 02, 2025 | 7:36 PM

తెలంగాణ రాష్ట్రంలో జనవరి ముగిసే సమయానికి వాతావారణంలో అనూహ్య మార్పు వచ్చింది. చలి గాలులు తగ్గిపోయి వేడి మొదలైంది. అలా రెండు నెలల వింటర్‌కి గుడ్‌బై చెప్పినట్టైంది. తెలంగాణలో హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు కొద్ది రోజులుగా పెరుగు తున్నాయి. కొన్ని చోట్ల 34-37 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముందుగానే వేసవి వచ్చేసిందా అన్నట్టుగా ఉంటోంది వాతావరణం. ఇవి పగటి పూట ఉష్ణోగ్రతలు కాగా..తెలంగాణ వ్యాప్తంగా రాత్రి పూట 12 నుంచి 22 డిగ్రీల సెల్సియస్‌గా నమోదవుతున్నాయి. హైదరాబాద్ విషయానికే వస్తే…కనిష్ఠ ఉష్ణోగ్రతలు 13 నుంచి 23 డిగ్రీలుగా నమోదవుతున్నాయి. వాతావరణ మార్పులకు ఇదే ఉదాహరణ అని అధికారులు చెబుతున్నారు.

అయితే..కనిష్ఠ ఉష్ణోగ్రతలు మరో మూడు రోజుల వరకూ 2 నుంచి 3 డిగ్రీల మేర పెరిగే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. వచ్చే మూడు రోజుల పాటు వాతావరణం పొడిగానే ఉంటుందని తెలిపారు. హైదరాబాద్ IMD వెల్లడించిన వివరాల ప్రకారం..ఉదయం పూట ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశముంది. మూడు రోజుల్లో వాతావరణంలో మరిన్ని మార్పులు చూస్తామని అధికారులు తెలిపారు. ఇక తెలంగాణ వెదర్‌మేన్ కూడా హైదరాబాద్‌లో వాతావరణ మార్పులకు సంబంధించి ఓ పోస్ట్ పెట్టాడు. గుడ్‌బై వింటర్స్ అంటూ పోస్ట్ చేశాడు. ఫిబ్రవరి 1 నుంచి 12వ తేదీ వరకూ వాతావరణం పొడిగానే ఉంటుందని, రానురాను పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతాయని చెప్పాడు. కాకపోతే..రాత్రి పూట మాత్రం కొంత వరకూ చలి ఉండే అవకాశముందని, క్రమంగా అది కూడా తగ్గిపోతుందని వివరించాడు. ఇప్పటికే ఆ తేడా తెలుస్తోంది. సాయంత్రం చల్లగాలి తీవ్రంగా ఇబ్బంది పెట్టేది. కానీ..కొద్ది రోజులుగా అది తగ్గిపోయింది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే..తెలంగాణ వ్యాప్తంగా అప్పుడే విద్యుత్ డిమాండ్ పెరిగిపోయింది. సాధారణంగా మార్చి నెల నుంచి ఈ డిమాండ్ మొదలవుతుంది. కానీ ఈ సారి ముందుగానే ఫిబ్రవరి నుంచే వినియోగం పెరగడంతో ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..