AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Huzurabad By-Poll: హుజురాబాద్ ఉపఎన్నిక బరిలో కొండా సురేఖ..! ఆమె అభ్యర్థిత్వానికే పలువురు మొగ్గు.. ఎందుకంటే?

హుజురాబాద్ ఉప ఎన్నికకు ఇంకా నగారా మోగనే లేదు. కానీ రాజకీయ పార్టీల వ్యూహాలు మాత్రం రోజురోజుకూ పదునెక్కుతున్నాయి. సరికొత్త ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర సమితిని వీడిన మాజీ మంత్రి ఈటల రాజేందర్...

Huzurabad By-Poll: హుజురాబాద్ ఉపఎన్నిక బరిలో కొండా సురేఖ..! ఆమె అభ్యర్థిత్వానికే పలువురు మొగ్గు.. ఎందుకంటే?
Huzurabad
Rajesh Sharma
|

Updated on: Aug 21, 2021 | 7:17 PM

Share

Huzurabad By-poll Congress Candidate Konda Surekha: హుజురాబాద్ ఉప ఎన్నికకు ఇంకా నగారా మోగనే లేదు. కానీ రాజకీయ పార్టీల వ్యూహాలు మాత్రం రోజురోజుకూ పదునెక్కుతున్నాయి. సరికొత్త ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర సమితిని వీడిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ (Eetala Rajendar) భారతీయ జనతా పార్టీ తరపున బరిలోకి దిగడం ఖాయమైంది. అదే సమయంలో ఈటలకు ధీటుగా అధికార టీఆర్ఎస్ (TRS) పార్టీ తరపున గెల్లు శ్రీనివాస్‌ను దింపేందుకు గులాబీ దళం రెడీ అయ్యింది. కానీ కాంగ్రెస్ క్యాండిడేట్ విషయంలోనే కాస్త కన్ఫ్యూజన్ కొనసాగుతోంది. ఈ క్రమంలో నాలుగైదు రోజుల పాటు హైదరాబాద్ (Hyderabad) నగరంలో మకాం వేసిన తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జీ మాణిక్కం ఠాగూర్.. సీనియర్లతో మంతనాలు జరిపారు. టీపీసీసీ (TPCC) అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) తోపాటు రాష్ట్రస్థాయిలో కీలక నేతలందరితోను సమాలోచనలు కొనసాగించారు. టీఆర్ఎస్, బీజేపీ (BJP) తరపున బీసీ నేతలే హుజురాబాద్ ఉప ఎన్నిక బరిలో నిలవడం ఖాయమైన నేపథ్యంలో వారికి ధీటైన బీసీ నేతనే బైపోల్ బరిలోకి దింపాలని తెలంగాణ కాంగ్రెస్ దాదాపు నిర్ణయానికి వచ్చింది. ఇందులోభాగంగా మూడు పేర్లతో మాణిక్కం ఠాగూర్ ఓ నివేదికను రూపొందించి.. హస్తినకు ఆగస్టు 21న బయలుదేరారు. అయితే.. ఈ మూడు పేర్లలో అనూహ్యంగా మాజీ మంత్రి కొండా సురేఖ పేరు చేరడం తెలంగాణ పాలిటికల్ లీడర్లను ఆశ్చర్యచకితులను చేసింది.

కొండా సురేఖ దంపతులు చిరకాలంగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా వున్నప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాలను కొండా దంపతులు ఓ రకంగా ఏలారు అనడం సబబుగా వుంటుంది. అయితే.. వైఎస్ మరణానంతరం జగన్ బాటలో నడిచి కొండా దంపతులు.. తెలంగాణవాదానికి వ్యతిరేకంగా పనిచేశారు. 2010లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలంగాణలో నిర్వహించ తలపెట్టిన ఓదార్పు యాత్రకు తెలంగాణవాదుల నుంచి గట్టి ప్రతిఘటన ఎదురుకాగా.. మానుకోట రైల్వేస్టేషన్లో చోటుచేసుకున్న కాల్పుల ఉదంతం పదకొండేళ్ళయినా ఎవరు మరువ లేని ఉదంతంగా నిలిచిపోయింది. మానుకోట రైల్వేస్టేషన్ వేదికగా ఆనాడు కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఎవరు మరువలేరు.

ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన క్రమంలో కొండా దంపతులు బలహీన పడిన కాంగ్రెస్ పార్టీని వీడారు. కొంతకాలం స్తబ్దుగా వుండిపోయిన కొండా సురేఖ, కొండా మురళీ దంపతులు.. కేసీఆర్ ఆహ్వానం మేరకు తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. చేరనైతే చేరారు కానీ.. అక్కడ వారికి అంతగా ప్రాధాన్యత లభించలేదు. దానికి కారణంగా ఉమ్మడి ఓరుగల్లు జిల్లాలో కొండా ఫ్యామిలీకి చిరకాల ప్రత్యర్థిగా అందరూ భావించే ఎర్రబెల్లి దయాకర్ రావు.. టీఆర్ఎస్ పార్టీలో కీలక పాత్రలో వుండడం.. ఆయనకు ముఖ్యమంత్రి, గులాబీ బాస్ కేసీఆర్ ఎక్కువ ప్రాధాన్యత నివ్వడంతో కొండా దంపతులు గులాబీ పార్టీలో ఎంతో కాలం ఇమడలేకపోయారు. ఆ తర్వాత స్లోగా పార్టీకి దూరమయ్యారు. ఓ దశలో కొండా దంపతులు బీజేపీలో చేరతారన్న ప్రచారమూ బాగానే జరిగింది. కానీ కొండా దంపతులు.. తమ మాతృ సంస్థ కాంగ్రెస్ పార్టీవైపే మొగ్గు చూపారు.

తాజాగా ఈటల రాజేందర్ శాసనసభ్యత్వానికి రాజీనామా చేయడంతో హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉపఎన్నిక అనివార్యమైంది. సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో హుజురాబాద్ ఉప ఎన్నికల ఖాయమని తేలడంతో ప్రధాన పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. అధికార పార్టీ టీఆర్ఎస్.. నియోజకవర్గంపై ప్రత్యేకంగా నజర్ పెట్టింది. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బంధు లాంటి కీలక పథకానికి హుజురాబాద్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల శ్రీకారం చుట్టారు. కొంతమంది లబ్దిదారులను ఎంపిక చేసి.. వారికి ఏకంగా పదిహేను లక్షల రూపాయలను ఉపాధి కల్పనకు కేటాయించారు. అదేసమయంలో కులాలు, మతాల వారీగా అందరినీ ప్రసన్నం చేసుకుని.. హుజురాబాద్ నియోజకవర్గాన్ని తమ ఖాతాలోంచి చేజారకుండా అన్ని ప్రయత్నాలను అధికార పార్టీ చేస్తోంది. అదే సమయంలో భారతీయ జనతాపార్టీ సైతం హుజురాబాద్ నియోజకవర్గంపై ప్రత్యక దృష్టి పెట్టింది. ఈటల రాజేందర్ సొంత ప్రాబల్యానికి బీజేపీ చరిష్మా కూడా జత కలిస్తే విజయం తమదేనని కమలం నేతలంటున్నారు.

అటు బీజేపీ, ఇటు టీఆర్ఎస్ సర్వశక్తులను ఒడ్డుతున్న తరుణంలో ఇటీవల తెలంగాణ కాంగ్రెస్ పగ్గాలను చేప్టటిన రేవంత్ రెడ్డికి కూడా హుజురాబాద్ ఉప ఎన్నిక కీలకంగా మారింది. తన హయాంతో జరగబోతున్న తొలి ఉప ఎన్నిక కావడంతో అక్కడ సత్తా చాటడం రేవంత్ రెడ్డికి అనివార్యమైంది. తన వ్యక్తిగత చరిష్మాతో తెలంగాణలో పార్టీ పరిస్థితిని మెరుగు పరుస్తానని హామీతో పలువురు సీనియర్ నేతలను కాదని మరీ అధిష్టానాన్ని మెప్పించి టీపీసీసీ అధ్యక్ష పదవిని పొందారు రేవంత్ రెడ్డి. ఆయన టీపీసీసీ బాధ్యతలు చేపట్టిన తర్వాత జరుగుతున్న హుజురాబాద్ బరిలో కాంగ్రెస్ పార్టీ మంచి ప్రదర్శన చేయడం రేవంత్ రెడ్డికి సవాల్‌ మారిందనే చెప్పాలి. దాంతో హుజురాబాద్ బరిలో ధీటైన అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ తరపున దింపాలని నిర్ణయించిన రేవంత్ రెడ్డి.. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ మాణిక్కం ఠాగూర్‌తో సుదీర్ఘ మంతనాలు జరిపారు. పలువురు సీనియర్లను సంప్రదించారు. ఉమ్మడి ఓరుగల్లు నేతలతో పలుమార్లు భేటీ అయ్యారు. ఈక్రమంలోనే కొండా సురేఖ పేరుతో సహా మూడు పేర్లతో ఓ జాబితాను ఖరారు చేసి.. మాణిక్కం ఠాగూర్‌తో ఢిల్లీ అధిష్టానానికి పంపారు.

తాజాగా సమాచారం ప్రకారం మూడు పేర్లతో ప్రతిపాదన ఢిల్లీకి చేరినప్పటికీ.. అందులో కొండా సురేఖ అభ్యర్థిత్వమే ఖరారు అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఘనమైన రాజకీయ చరిత్ర కలిగిన కొండా సురేఖ… అన్ని రకాల రాజకీయాల్లో ఆరితేరిన నేత. ధనబలంతోపాటు.. అంగబలం పుష్కలంగా వున్న కొండా సురేఖ హుజురాబాద్ ఎన్నికల బరిలో దిగితే కాంగ్రెస్ పార్టీ మెరుగైన ప్రదర్శన చేయడం ఖాయమని తెలంగాణ కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. అన్నీ అనుకున్నట్లుగా సాగితే.. నేడో, రేపో సురేఖ అభ్యర్థిత్వంపై కాంగ్రెస్ అధిష్టానం నుంచి ప్రకటన రావచ్చని తెలుస్తోంది. అయితే.. ఉప ఎన్నిక షెడ్యూల్ ఇంకా ప్రకటించకపోవడంతో.. అభ్యర్థిపై నిర్ణయం జరిగినా.. వెంటనే ప్రకటిస్తారా లేక షెడ్యూలు వచ్చే వరకు వేచి చూస్తారా అన్నది చర్చనీయాంశంగా మారింది.