Huzurabad By Election: హుజూరాబాద్‌లో ఆ పార్టీతోనే టీఆర్‌ఎస్‌కు పోటీ.. మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యలు
Huzurabad Bypoll: హుజూరాబాద్ అసెంబ్లీ ఉపఎన్నికల తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్‌లోకి చేరికలు జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ నెలకొన్న పోటీపై మంత్రి హరీశ్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Telangana Minister Harish Rao: హుజూరాబాద్‌లో బీజేపీ- టీఆర్ఎస్‌ల మధ్యే పోటీ నెలకొన్నట్లు మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. నియోజకవర్గ ఓటర్లు టీఆర్ఎస్‌కు పట్టంకట్టడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. హుజూరాబాద్ నియోజవర్గ పరిధిలోని ఇల్లందకుంట మండలం రాచపల్లి, సింగపురంకు చెందిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన కార్యకర్తలు, యువకులు, యాదవులు, ముస్లింలు సింగపురంలో జరిగిన కార్యక్రమంలో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరారు. వారికి మంత్రి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ..టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని అన్నారు. ఈ దిశగా రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత విద్యుత్, కేసీఆర్ కిట్, కళ్యాణ లక్ష్మి, రూ.2016 ఆసరా పెన్షన్ వంటి పథకాలు అమలు చేస్తున్నారన్నారు. బీజేపీ మాత్రం వాతలు – కోతలు మాత్రమే ప్రజలకు పెడుతోందని ఎద్దేవా చేశారు. పెట్రోల్, డీజీల్, గ్యాస్ ధరల పెంచి ప్రజలకు వాతలు పెడుతూ..మరో వైపు సబ్సిడీల్లో కోతలు విధించిందన్నారు. బీజేపీ వల్ల ప్రజలకు ఒరిగిందేంటని ప్రశ్నించారు.
నల్లధనం వెనక్కు తెచ్చి ప్రతీ అక్కౌంట్లో రూ.15 లక్షల వేస్తానని చెప్పిన బీజేపీ ఏడేళ్ల పాలనలో ఒక్క రూపాయి నల్ల ధనం వెనక్కు తెచ్చిందా? ఒక్క రూపాయి అయినా మీ అక్కౌంట్లలో పడ్డాయా? అని ప్రశ్నించారు. పెద్ద నోట్లు రద్దుతో నల్లధనం బయటకు వస్తుందని చెప్పి వేయి రూపాయల నోట్లు రద్దు చేసిన బీజేపీ ప్రభుత్వం రెండు వేల పెద్ద నోటును తెచ్చిందని గుర్తుచేశారు. కానీ నల్లధనం మాత్రం బయటకు రాలేదని.. మనమంతా బ్యాంకుల వద్ద లైన్లు కట్టాల్సిన పరిస్థితి తెచ్చారని విమర్శించారు. కేంద్రం ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతూ, కుదవపెడుతూ… ఉద్యోగాలు తొలగిస్తున్నారని విమర్శించారు. అటు ఈటెల పార్టీ(బీజేపీ) రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చిందని ధ్వజమెత్తారు. ఇలాంటి బీజేపీకి బుద్ది చెప్పాలని.. హుజూరాబాద్ ఓటర్లు బీజేపీ పాలన తీరును గమనించి వాత పెట్టాలని పిలుపునిచ్చారు.
హుజురాబాద్ నియోజకవర్గ అభివృద్ధి తమ పార్టీ బాధ్యతగా హరీశ్ రావు పేర్కొన్నారు. ఇక్కడి సమస్యలన్నీ టీఆర్ఎస్ ప్రభుత్వమే పరిష్కరిస్తుందన్నారు. ఏడేళ్లు మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ హుజూరాబాద్‌ను పట్టించుకోలేదని ఆరోపించారు. నాలుగు వేల ఇళ్లు మంజూరు చేస్తే తోటి మంత్రులంతా తమ నియోజకవర్గాల్లో ఇళ్లు కట్టించారని.. అయితే మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ తన నియోజకవర్గంలో ఒక్క ఇళ్లు కట్టించలేదని ఆరోపించారు. అలాగే మహిళ సమావేశానికి ఒక్క మహిళా భవనాన్ని కట్టించలేదని విమర్శించారు.
బావుల కాడ, బోర్ల కాడ విద్యుత్ మీటర్లు పెడతామని బీజేపీ అంటోందన్నారు. యూపీలో కేంద్ర మంత్రి కాన్వాయ్ రైతులు ధర్నా చేస్తే వాళ్ల మీదకు ఎక్కించి దాదాపు పది మంది చనిపోయినట్లు వార్తలు వస్తున్నాయని అన్నారు. రైతులను అంత అమానుషంగా ప్రాణాలు తీస్తారా? అంటూ మండిపడ్డారు. ఇలాంటి బీజేపీకి ఎందుకు ఓటు వేయాలో ప్రజలు ఆలోచించాలని అన్నారు. బీజేపీ ద్వారా రైతులకు, యువతకు, మహిళలకు ఎలాంటి ప్రయోజనం లేదన్నారు.
హుజూరాబాద్ ఉప ఎన్నికల పోలింగ్ ఈ నెల 30న జరగనుండగా.. నవంబరు 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
Also Read..
Lakhimpur Kheri Viral Video: అన్నదాతలపైకి దూసుకెళ్లిన కారు.. వీడియోను షేర్ చేసిన కాంగ్రెస్ నాయకులు..
Megastar Chiranjeevi: మెగాస్టార్ కోసం బరిలోకి దిగిన యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్…