AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: చెత్త మధ్యన ఉన్నది ఏదో సాధారణ శిల్పం అనుకుంటే మీరు పొరపడినట్లే..

సిద్ధిపేట జిల్లా గజ్వెల్ మండలంలోని బెజుగామ గ్రామంలో చరిత్రకారుడు కొలిపాక శ్రీనివాస్ రెండు అరుదైన జైన తీర్థంకరుడు మహావీరుని శిల్పాలను గుర్తించారు. ఒకటి రాయ చెరువులో, మరొకటి హనుమాన్ ఆలయం పక్కన చెత్తలో విరిగిన స్థితిలో ఉన్నాయి. ఈ శిల్పాలు 8వ నుంచి 11వ శతాబ్దాల మధ్య కాలానికి చెందినవి. చెరువులోని శిల్పాన్ని నీటిలో మునిగిపోకముందే రక్షించాలని, గ్రామ చరిత్రను కాపాడుకోవాలని కొలిపాక శ్రీనివాస్ సూచించారు.

Telangana: చెత్త మధ్యన ఉన్నది ఏదో సాధారణ శిల్పం అనుకుంటే మీరు పొరపడినట్లే..
Jain Sculpture
P Shivteja
| Edited By: |

Updated on: Jun 04, 2025 | 6:52 PM

Share

సిద్ధిపేట జిల్లా గజ్వెల్ మండలంలోని చారిత్రక ప్రాధాన్యత కలిగిన గ్రామం బెజుగామలో వేర్వేరు కాలాలకు చెందిన జైన తీర్థంకరుడు వర్ధమాన మహావీరుని రెండు శిల్పాలను కొత్త తెలంగాణ చరిత్ర బృందం చరిత్రకారుడు కొలిపాక శ్రీనివాస్ గుర్తించారు. మొదటి శిల్పం గ్రామంలోని రాయ చెరువు వద్ద ఉంది. ఇది ధ్యాన ముద్రలో ఉన్న మహావీరుని శిల్పం. శిల్పంపై ఉన్న ఉష్ణీషం (తలపై ఆభరణం) అరుదైన కళాత్మకతలో ఆకర్షిస్తోంది. కోలముఖంతో కనిపించే ఈ శిల్పం 8వ లేదా 9వ శతాబ్దానికి చెందినది. ఇది బ్లాక్ కోరైట్ రాయిపై చెక్కబడింది. ఆ కాలానికి ప్రత్యేకమైన శిల్పకళను ప్రతిబింబిస్తుంది.

రెండవ శిల్పం గ్రామంలోని హనుమాన్ ఆలయం పక్కన చెత్తలో పడి ఉంది. ఇది కొంత విరిగిపోయినా, 10వ లేదా 11వ శతాబ్దం శైలిలో చెక్కబడినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఈ శిల్పం గుండ్రని ముఖంతో, చిన్న ఉష్ణీషంతో ఉంది.

బెజుగాం దేవుడు అనే జైనతీర్థంకరుడికి సంబంధించిన కళ్యాణీ చాళుక్యులు పాలించిన భువనైకమల్ల దేవర కాలానికి చెందిన శాసనాలు ఈ గ్రామంలో ఉన్నాయి. వీటిలో 1072 సంవత్సరానికి చెందిన ఒక శాసనమూ, మరొక శాసన శకలమూ ఉన్నాయి. శాసనంలో పేర్కొన్న బెజుగాం దేవుడు జైనతీర్థం కరుడే అయ్యుండవచ్చని చరిత్రకారులు భావిస్తున్నారు.

పరిశోధకుడు కొలిపాక శ్రీనివాస్ గ్రామస్తులకు పిలుపునిస్తూ, చెరువులో ఉన్న మహావీరుని శిల్పాన్ని నీటిలో మునిగిపోకముందే బయటకు తీసి సురక్షితంగా ఉంచాలని, తమ గ్రామ చరిత్రను సంరక్షించుకోవాలని సూచించారు. ఈ శిల్పాలు, శాసనాలు బెజుగామ చారిత్రక వైభవాన్ని ప్రతిబింబిస్తున్నాయి.

Kolipaka Srinivas

Kolipaka Srinivas with sculpture

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..