Khammam: కౌన్ బనేగా ఖమ్మం కార్పొరేషన్ మేయర్.. కుస్తీ పడుతున్న ముఖ్యనేతలు.. నేతలను ప్రసన్నం చేసుకుంటున్న కార్పొరేటర్లు
ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల్లో తెలంగాణ రాష్ట్ర సమితి తిరుగులేని అధిక్యతను సంపాదించింది. ఖమ్మం పీఠంపై గులాబీ జెండా రెపరెపలాడనుంది.
Khammam Municipal Corporation Mayor: ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల్లో తెలంగాణ రాష్ట్ర సమితి తిరుగులేని అధిక్యతను సంపాదించింది. ఖమ్మం పీఠంపై గులాబీ జెండా రెపరెపలాడనుంది. కార్పొరేషన్ పీఠం కోసం అధికార టీఆర్ఎస్ పార్టీలో పోటాపోటీ ప్రయత్నాలు చేస్తున్నారు కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు. మేయర్ కుర్చీ ఎవరిది అన్న దానిపై ఆసక్తి నెలకొంది. మేయర్ స్థానం మహిళా జనరల్ కావడంతో ఆశావాహులు వారి ప్రయత్నాలను ముమ్మరం చేశారు.
ఏఫ్రిల్ 30న జరిగిన ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీలో ఎక్కువ డివిజన్లలో 29 మంది మహిళా కార్పొరేటర్లు గెలుపొందారు.. ఏదో ఒక ఈక్వేషన్ లో తమకు అవకాశం రాకపోతుందా అన్న ఆశ దాదాపు అందరిలోనూ కనిపిస్తుంది. అయితే ఈ విషయంలో నిర్ణయాత్మకమైన వ్యక్తి స్థానిక ఎమ్మెల్యే, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఇప్పటికే ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది.. సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు పార్టీ అధిష్టానం పంపే సీల్డ్ కవర్లో ఏ పేరు ఉంటే వారే మేయర్ అని క్లారిటీ ఇచ్చేశారు..
ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలను తన భుజాలపై వేసుకుని అంతా తానై నడిపించి పార్టీ విజయానికి కృషి చేసిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుంటారని చర్చ సాగుతోంది.. గతంలో 2016లో జరిగిన మేయర్ ఎన్నికలో సీఎం కేసీఆర్ తానే సొంతంగా నిర్ణయం తీసుకున్న విషయాన్ని పార్టీలోని సీనియర్లు కొంతమంది గుర్తు చేస్తున్నారు. 2016 లో జరిగిన కార్పొరేషన్ తొలి ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలవడం మేయర్ పదవి ఎస్టీ జనరల్ రిజర్వు కావడంతో తెలంగాణ ఉద్యమ సమయంలో ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో తనకు చికిత్స చేసిన డాక్టర్ పాపాలాల్‌ను సీఎం కేసీఆర్ ఎంపిక చేశారు.
అయితే, ఈసారి మేయర్ ఎంపికలో సామాజిక సమీకరణలు బేరీజు వేసుకుని నిర్ణయం తీసుకుంటారా.. లేక ఇంకేదైనా ఫార్ములాను అమలు చేస్తారా అన్న దానిపై ఇంకా క్లారిటీ రాలేదు.. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు సంబంధించిన కమ్మ సామాజిక వర్గం నుంచి భారీగా పోటీ నెలకొంది. ఇక, బీసీలలో ప్రధాన కులాలైన మున్నూరుకాపు, ముదిరాజ్, యాదవులు ఉన్నారు. లేదంటే మంత్రి అజయ్ కుమార్ తనకు ప్రతి ఎన్నికల్లో అండగా నిలుస్తున్న ముస్లిం మైనారిటీని ఆదరిస్తారన్న కోణంలో కూడా చర్చ నడుస్తుంది.. ఖమ్మం మేయర్ పీఠం విషయంలో అధిష్టానం కూడా అన్ని అంశాలను పరిగణంలోకి తీసుకుని ఏ సామాజిక వర్గానికి కేటాయిస్తే పార్టీకి మేలు చేకూరుతుందని అంటూ ఇంటెలిజెన్స్ నివేదికలు తెప్పించుకున్నట్లు సమాచారం. ఇప్పటికే టీఆర్ఎస్ అధిష్టానం పలు దఫాలుగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తో చర్చలు జరిగాయి.
ఖమ్మం జిల్లాలో సామాజికవర్గాల పరంగా చూసుకుంటే బీసీల నుంచి ఇప్పటికే కాపు నేత బచ్చు విజయ్ కు సుడా చైర్మన్ పదవి లభించింది.. డిసిసిబి చైర్మన్ పదవి బిసి యాదవ కులానికి చెందిన కూరాకుల నాగభూషణంకు మంత్రి అజయ్ కుమార్ కట్టబెట్టారు. కాబట్టి ఈసారి ఓసీ కులానికి చెందిన వారికి ఖమ్మం మేయర్ స్థానం, మైనారిటీ సంఘానికి డిప్యూటీ మేయర్ స్థానం కేటాయించే అవకాశం ఉంది. కాగా, మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక కోసం టీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ అధిష్టానం పరిశీలకులను నియమించింది. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, పార్టీ జనరల్ సెక్రటరీ నూకల నరేశ్ రెడ్డిలకు ఎన్నిక బాధ్యతను అప్పగించింది. గురువారం సాయంత్రం ఖమ్మం చేరుకుని కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లతో పాటు పార్టీ ముఖ్య నేతలతో సమావేశమవుతారు. వారి అభిప్రాయాలను సేకరించి అధినేత కేసీఆర్‌కు వివరిస్తారు. తదనంతరం సీల్డు కవర్ ద్వారా ఖమ్మం కార్పొరేషన్, డిప్యూటీ మేయర్ ను ఎన్నికుంటారు.
మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఖమ్మం మేయర్ అభ్యర్థి విషయంలో ఇప్పటికే అధిష్టానానికి పేర్లు పంపినట్లుగా తెలుస్తోంది.. కమ్మ సామాజిక వర్గానికి చెందిన 26 వ డివిజన్ కార్పొరేటర్ పునుకొల్లు నీరజ, పదవ డివిజన్ కార్పొరేటర్ చావా మాధురి, 56 వ డివిజన్ కార్పొరేటర్ పైడిపల్లి రోహిణి వీళ్ళందరూ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కుటుంబానికి విధేయులుగా కొనసాగుతున్నారు. వీరందరిలో పునుకొల్లు నీరజ వైపు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. వీరికి తోడు ముస్లిం మైనార్టీల సైతం తమకు ఛాన్స్ ఇవ్వాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మీద ఒత్తిడి తేవడంతో డిప్యూటీ మేయర్ పదవి మైనార్టీలకు కేటాయించే అవకాశం కనిపిస్తుంది.
Read Also…. Corona Pandemic: కరోనా కల్లోలంలో లాక్ డౌన్ రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ.. ఎలా పాటిస్తున్నారంటే..