Harish Rao: మేధావులు మౌనం విడాలి.. కృష్ణా బోర్డుకు ప్రాజెక్టులు అప్పగింతపై హరీష్

ఈ రోజు జరిగిన సమావేశంలో అంగీకారం ప్రామాణికమా అని హరీష్‌ ప్రశ్నించారు. ప్రాజెక్టుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా తప్పుదోవ పట్టిస్తోందని హరీష్‌ రావు తెలిపారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల ఆపరేషన్ కృష్ణా బోర్డుకు ఇక నుంచి చుక్క నీరు తీసుకోవాలన్నా కృష్ణా బోర్డు అనుమతి తప్పనిసరి అవుతుందని హరీష్‌ అన్నారు...

Harish Rao: మేధావులు మౌనం విడాలి.. కృష్ణా బోర్డుకు ప్రాజెక్టులు అప్పగింతపై హరీష్
Harish Rao
Follow us
P Shivteja

| Edited By: Narender Vaitla

Updated on: Feb 01, 2024 | 8:18 PM

ప్రాజెక్టుల నిర్వహణను కృష్ణా బోర్డుకు అప్పగిస్తూ తీసుకున్న నిర్ణయంపై మాజీ మంత్రి హరీష్‌ రావు స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తి గందరగోళంలో ఉందని విమర్శించారు. ప్రాజెక్టుల స్వాధీనం అంశానికి సంబంధించి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పలుమార్లు ప్రస్తావించిన అంశాలనే పేర్కొంటూ 27వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసిందిని,ఇవాళ ప్రాజెక్టుల నిర్వహణను కృష్ణా బోర్డుకు అప్పగిస్తున్నట్లు రెండు రాష్ట్రాల ఇంజనీర్ ఇన్ చీఫ్‌లు మీడియా ముందు ప్రకటించారన్నారని హరీష్‌ రావు తెలిపారు.

ఈ రోజు జరిగిన సమావేశంలో అంగీకారం ప్రామాణికమా అని హరీష్‌ ప్రశ్నించారు. ప్రాజెక్టుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా తప్పుదోవ పట్టిస్తోందని హరీష్‌ రావు తెలిపారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల ఆపరేషన్ కృష్ణా బోర్డుకు ఇక నుంచి చుక్క నీరు తీసుకోవాలన్నా కృష్ణా బోర్డు అనుమతి తప్పనిసరి అవుతుందని హరీష్‌ అన్నారు. వేసవిలో నీరు అవసరం పడినపుడు తాగునీటి కోసం నీరు తీసుకునే అధికారం రాష్ట్రానికి ఉంటుందా.? అని హరీష్‌ ప్రశ్నించారు. జలవిద్యుత్ హౌస్‌ల గురించి చర్చ లేదని చెప్తున్నారు కానీ, నీరు లేకుండా విద్యుత్ ఎలా వస్తుందన్నారు.

బోర్డు అనుమతి లేకుండా విద్యుత్ ఉత్పత్తి ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించిన హరీష్‌ రావు.. బోర్డు అనుమతి లేనిది రాష్ట్ర ఇంజనీర్లు, అధికారులు కనీసం ప్రాజెక్టుల వద్దకు వెళ్ళే పరిస్థితి ఉండదన్నారు. మార్పు అంటే ఇదేనా, తెలంగాణ ప్రయోజనాలు, హక్కులు కేంద్రం, ఏపీ చేతిలో పెట్టడమా? అంటూ హరీష్‌ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ సీట్లు కట్టబెట్టిన పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం తో పాటు రాష్ట్ర ప్రజలకు ఇచ్చే బహుమానం ఇదేనా అని హరీష్‌ ప్రశ్నించారు.

అందరితో చర్చిస్తామని చెప్పిన ప్రభుత్వం ఇవాళ ఎలా అంగీకరించిందన్నారు. ఓ వైపు ప్రాజెక్టులు అప్పగించబోమని చెబుతూనే మరోవైపు సమావేశంలో అధికారులు అంగీకరించి వచ్చారు. ముఖ్యమంత్రి శనివారం సమీక్ష నిర్వహించారు… ఇవాళ ఈఎన్సీ కృష్ణా బోర్డు మీటింగ్ కు వెళ్లి ప్రాజెక్టుల నిర్వహణ బోర్డుకు అప్పగించేందుకు అంగీకరించి వచ్చారు. 2021లో కేంద్రం గెజిట్ ఇచ్చి ఒత్తిడి తీసుకొచ్చినా బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టులు ఇచ్చేందుకు అంగీకరించలేదని హరీష్‌ రావు గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు నెలలు కూడా కాకముందే ప్రాజెక్టులు ఇచ్చేందుకు అంగీకరించారు… తెలంగాణ ప్రయోజనాలు కాపాడేది ఎవరో… దీంతోనే స్పష్టం అవుతోందన్నారు. తెలంగాణ ప్రజలు అన్ని విషయాలు అర్థం చేసుకోవాలని, రాజకీయాల కోసం కాకుండా.. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకోవాలని, ఈ విషయమై మేధావులు మౌనం వీడాలని హరీష్‌ అన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..