Telangana: రూ.2 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సీఐ.. వైన్ షాపు నడవాలంటే..
హైదరాబాద్ సరూర్ నగర్లో నివాసముండే నూకల విద్యాసాగర్ రెడ్డి భార్య సునీతకు నాగార్జున సాగర్‌లోని హిల్ కాలనీలో మద్యం షాపు ఉంది.
Haliya Excise inspector: నల్గొండలో హాలియా ఎక్సైజ్ సీఐ యమునాధర్ రావు ఏసీబీకి చిక్కారు. రెండు లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఎక్సైజ్ సీఐని అదుపులోకి తీసుకొని అధికారులు సోదాలు చేస్తున్నారు. హైదరాబాద్ సరూర్ నగర్లో నివాసముండే నూకల విద్యాసాగర్ రెడ్డి భార్య సునీతకు నాగార్జున సాగర్‌లోని హిల్ కాలనీలో మద్యం షాపు ఉంది. వైన్ షాపు సక్రమంగా నడవాలంటే నెలకు 25 వేల రూపాయలు ఇవ్వాలని హాలియా ఎక్సైజ్ సీఐ యమునాధర్ రావు వేధిస్తున్నారు. 8 నెలలకు గాను 2 లక్షల రూపాయలు ఇవ్వడానికి ఒప్పుకుని.. విద్యాసాగర్ రెడ్డి ఎసిబిని ఆశ్రయించాడు.
ఈ క్రమంలో మంగళవారం.. నల్గొండ ఎక్సైజ్ స్టేషన్ వద్ద సీఐ వెంకటేశ్వర్లు వాహనంలో నూకల విద్యాసాగర్ రెడ్డి రూ.రెండు లక్షలను పెట్టాడు. సమాచారం అందుకున్న ఏసీబీ అధికారులు వాహనంలో డబ్బులు తీసుకుంటుండగా.. ఎక్సైజ్ సీఐ యమునాధర్ రావును రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
అనంతరం సీఐ యమునాధర్ రావును అరెస్ట్ చేసి.. నల్గొండ ఎక్సైజ్ స్టేషన్ సీఐ వెంకటేశ్వర్లు వాహనాన్ని ఏసీబీ అధికారులు సీజ్ చేశారు. ఏకకాలంలో హైదరాబాద్‌లోని కొత్తపేటలో ఉన్న సీఐ యమునాధర్ రావు నివాసంలో సోదాలు చేస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఏసీబీ అధికారులు తెలిపారు.
-రేవన్ రెడ్డి, టీవీ9 తెలుగు రిపోర్టర్, నల్గొండ
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..