తెలంగాణ గవర్నర్ తమిళిసై సంచలన నిర్ణయం.. నామినేటెడ్ కోటా ఎమ్మెల్సీల పేర్లు తిరస్కరణ
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అధికార పార్టీకి మరోసారి షాకిచ్చారు. ప్రభుత్వం పంపిన గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను ఆమె తిరస్కరించారు. దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉన్నారని.. సోషల్ సర్వీస్ చేసిన దాఖలాలు లేవన్నారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలకుగానూ సామాజిక కార్యక్రమాలలో పాల్గొన్నవారిని సిఫార్సు చేయాలని ముఖ్యమంత్రికి, మంత్రిమండలికి సూచించారు.
తెలంగాణ గవర్నర్ తమిళిసై సంచలన నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను తిరస్కరించారు. ప్రభుత్వం సిఫార్సు చేసిన దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ.. అభ్యర్థిత్వాలను రిజెక్ట్ చేశారు. ఆర్టికల్ 171 (5)- ప్రకారం ఈ అభ్యర్థులకు తగిన అర్హత లేదన్నారు. ఈ ఇద్దరిని ఎంపిక చేయడానికి కావాల్సిన సమాచారం తన వద్దకు రాలేదని తెలిపారు. కుర్రా సత్యనారాయణ రాజకీయంగా యాక్టివ్‌గా ఉన్నారని.. సామాజిక సేవ కార్యక్రమాల్లో ఉన్నట్లు ఎక్కడా ఆధారాలు సమర్పించలేదని తమిళిసై పేర్కొన్నారు. మన రాష్ట్రంలో చాలా మంది వివిధ రంగాల్లో ప్రముఖలు ఉన్నా.. వారిని పరిగణలోకి తీసుకోలేదని పేర్కొన్నారు. రాజకీయ నాయకులను గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా సిఫార్సు చేయొద్దని.. అలా చేయడం ఆర్టికల్ 171 (5)కి విరుద్దం అని ముఖ్యమంత్రికి, కేబినెట్‌కు సూచించారు. దాసోజు శ్రవణ్ రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. ఏ రంగంలోనూ దాసోజు శ్రవణ్ అచివ్‌మెంట్స్‌కు సంబంధించిన డాక్యుమెంట్లు సమర్పించలేదని పేర్కొన్నారు. సహకార ఉద్యమం, సాహిత్యం, కళలు, శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రావీణ్యం ఉన్న అర్హత గల వ్యక్తులను కేబినెట్ సిఫార్సు చేస్తే నియమిస్తానని తెలిపారు.
గవర్నర్ తీరుపై మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. గవర్నర్‌గా తమిళిసై ఎలా అర్హులు అని ఫైరయ్యారు. తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎలా గవర్నర్ అయ్యారని ప్రశ్నించారు. సర్కారియా కమిషన్ సిఫార్సు ప్రకారం గవర్నర్‌గా తమిళిసై అనర్హులు అని పేర్కొన్నారు. సామాజిక సేవను రాజకీయాల్లో ఒక భాగంగా చూడాలని.. దాసోజు, కుర్రా ముమ్మాటికీ ఎమ్మెల్సీ హోదాకు అర్హులే అని ప్రశాంత్ రెడ్డి పేర్కన్నారు.
2019 సెప్టెంబర్ 8న తెలంగాణా గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేసిన తమిళిసై సౌందరరాజన్.. రాజ్‌భవన్‌లో నాలుగేళ్లు పూర్తి చేసుకున్నారు. గవర్నర్‌గా తమిళిసై నాలుగేళ్ల ప్రయాణంలో ప్రభుత్వంతో చాలాసార్లు విభేదించారు. కౌశిక్‌రెడ్డి ఎమ్మెల్సీ సీటు దగ్గర మొదలైన వివాదం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. మెడికల్ కాలేజీల కేటాయింపు… కొత్త సెక్రటేరియట్ ప్రారంభోత్సవానికి ఆహ్వానం అందకపోవడం, ఆర్టీసీ విలీనం లాంటి కీలక బిల్లుల్ని పెండింగ్‌లో పెట్టడం లాంటివన్నీ సీఎంకీ, గవర్నర్‌కీ దూరాన్ని పెంచుతూ వచ్చింది. ప్రోటోకాల్స్‌పై ప్రభుత్వంతో తరచూ విభేదిస్తూ వచ్చిన గవర్నర్ తమిళిసై ఇవేవీ తనను కట్టడి చెయ్యబోవని సున్నితంగా హెచ్చరించారు.
ఇటీవల సచివాలయంలో దేవాలయాల ప్రారంభం సందర్భంగా.. గవర్నర్‌ను స్వయంగా ఆహ్వానించారు సీఎం కేసీఆర్. ఇద్దరి సమక్షంలోనే సెక్రటేరియట్ ప్రాంగణంలో అన్ని మతాలకు చెందిన మందిరాలు ప్రారంభమయ్యాయి. అక్కడితో సయోధ్య కుదిరినట్టేనా అనే చర్చ జరిగింది. కానీ..తాజాగా ఇద్దరిని ఎమ్మెల్సీలుగా నామినేట్ చేయాలని ప్రభుత్వం పంపిన అభ్యర్థిత్వాలను తిరస్కరించడంతో.. రాజ్‌భవన్, ప్రగతిభవన్ మధ్య దూరం తగ్గిందా లేదా అనేది మళ్లీ ప్రశ్నార్థకంగా మారింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..